హైదరాబాద్‌పై సీఎం చంద్రబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

అభివృద్ధి ఒక్కటే ఎన్నికల్లో గెలిపించదని, కానీ సమాజ మార్పునకు సాంకేతికతే మూలమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) వేదికగా సౌత్‌ఏషియా లెర్నింగ్ సమ్మిట్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ..

హైదరాబాద్‌పై  సీఎం చంద్రబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: అభివృద్ధి ఒక్కటే ఎన్నికల్లో గెలిపించదని, కానీ సమాజ మార్పునకు సాంకేతికతే మూలమని సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu ) అన్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలి(Hyderabad Gachibowli)లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) వేదికగా సౌత్‌ఏషియా లెర్నింగ్ సమ్మిట్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా AI వినియోగం, డేటా భద్రత, భవిష్యత్తు సాంకేతికతలపై చంద్రబాబు ప్రసంగం చేశారు. ముప్పై ఏళ్ల క్రితమే ఐటీ రంగంపై దృష్టి సారించామని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచం ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, స్పేస్ టెక్నాలజీ దిశగా అడుగులు వేస్తోందని చంద్రబాబు తెలిపారు. డ్రోన్లు, ఎయిర్ అంబులెన్స్‌ల విస్తరణ వేగంగా జరుగుతోందని, ప్రస్తుత యుద్ధాల్లో డ్రోన్ టెక్నాలజీ పాత్రను ప్రపంచం గమనిస్తోందని చెప్పారు. డేటా సెంటర్లు, పాలసీల రూపకల్పన ద్వారా ఏపీని అగ్రస్థానంలో నిలుపుతామని చంద్రబాబు పేర్కొన్నారు.

హైదరాబాద్‌ నిర్మాణంలో మా పాత్ర కీలకం

హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చడంలో తాము చాలా కష్టపడ్డామని గుర్తిచేసిన సీఎం చంద్రబాబు ఐఎస్‌బీని హైదరాబాద్‌కు తీసుకువచ్చేందుకు ఎంతో కృషి చేశామన్నారు. శంషాబాద్ విమానాశ్రయం కోసమూ 5 వేల ఎకరాల భూసేకరణ చేశామని గుర్తు చేశారు. నల్సార్, ట్రిపుల్ ఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలను సైతం తామే ఏర్పాటు చేశామన్నారు. కేవలం 9 నెలల్లోనే కృష్ణా నది నీటిని హైదరాబాద్‌కు తీసుకువచ్చి తాగునీటి సమస్యను పరిష్కరించిన తీరును చంద్రబాబు వివరించారు.

బిల్‌ గేట్స్ నుంచి బిల్ క్లింటన్ వరకు..

హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన అరుదైన సందర్భాలున్నాయని చంద్రబాబు గుర్తు చేశారు. ఢిల్లీ వెళ్లి బిల్‌ గేట్స్‌ను కలిసి భారతీయులకు గణితం, ఇంగ్లీష్‌పై ఉన్న పట్టును వివరించానని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో కార్యాలయం పెట్టేలా ఒప్పించానని చంద్రబాబు తెలిపారు. అప్పట్లో అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్ ఆహ్వానం లేకుండానే హైదరాబాద్ వచ్చారని, ఆయన సూచనతోనే టోనీ బ్లెయిర్ సైతం నగరాన్ని సందర్శించారని చంద్రబాబు గుర్తు చేశారు. మాజీ ప్రధాని వాజ్‌పేయీ చేతుల మీదుగా హైటెక్ సిటీ ప్రారంభోత్సవం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

గ్రీన్ ఎనర్జీలో అగ్రగామిగా ఏపీ

విద్యుత్ సంక్షోభం నుంచి మిగులు విద్యుత్ సాధించే వరకు ఏపీ పయనించిందని, ప్రస్తుతం సోలార్, విండ్, గ్రీన్ ఎనర్జీ రంగాలను ప్రోత్సహిస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. గ్రీన్ ఎనర్జీ వినియోగంలో దక్షిణాదిలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్‌గా ఉందని ఆయన పేర్కొన్నారు. 2014-19 మధ్య ఎన్నో సంస్కరణలు తెచ్చామని, ఇప్పుడు మళ్లీ అభివృద్ధి, సంక్షేమాలను సమతూకంలో ముందుకు తీసుకెళ్తున్నామని చంద్రబాబు తెలిపారు.

Next Story