ఆ పేరుతో తిరుపతిలో అతిపెద్ద రీసెర్చ్ సెంటర్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

by Jakkula.Mamatha |   (  Updated:2026-01-16 12:58:53  IST  )

యువతరం భవిష్యత్తును తీర్చిదిద్దేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చంద్రబాబు(CM Chandrababu) అన్నారు.

ఆ పేరుతో తిరుపతిలో అతిపెద్ద రీసెర్చ్ సెంటర్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
X

దిశ,వెబ్‌డెస్క్: యువతరం భవిష్యత్తును తీర్చిదిద్దేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చంద్రబాబు(CM Chandrababu) అన్నారు. భవిష్యత్తులో ఏయే రంగాల్లో అవకాశాలు ఉంటాయో గుర్తించడంతో పాటు ఆయా రంగాల్లో వారిలో నైపుణ్యాన్ని పెంచడంపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ రోజు(శుక్రవారం) క్యాంప్ కార్యాలయంలో ఏరో స్పేస్-డిఫెన్స్, ఐటీ-డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సలహదారులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.

ఈ భేటీలో డ్రోన్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ తరుణంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో తిరుపతి కేంద్రంగా అతిపెద్ద రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలను ముఖ్యమంత్రి అంగీకరించారు. ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ-AP FIRST పేరుతో తిరుపతిలో రీసెర్చ్ కేంద్రం ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ”రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. వివిధ రంగాల్లో కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. ఎయిరో స్పేస్, డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీ, ఏఐ-సైబర్ సెక్యూరిటీ, సెమీ కండక్టర్ల డివైసెస్-సెన్సార్లు, క్వాంటం టెక్నాలజీ, హెల్త్ కేర్, బయోటెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, రూరల్ ఏరియా టెక్నాలజీ వంటి రంగాలు భవిష్యత్తులో కీలకం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి అనుగుణంగా పాలసీలు రూపొందిస్తోంది. ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టే కంపెనీలను ప్రోత్సహిస్తోంది.

దేశంలో తొలిసారిగా గ్రీన్ ఎనర్జీ రంగంలో గ్రీన్ అమోనియా ప్లాంట్ కాకినాడలో ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ఈ తరహాలో కొత్త ఆవిష్కరణలకు వివిధ స్టార్టప్ కంపెనీలకు రాష్ట్రం వేదికగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఇలా వచ్చే కంపెనీలకు పరిశ్రమలకు నైపుణ్యమున్న యవతను అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఈ మేరకు భవిష్యత్తులో డిమాండ్ ఉన్న రంగాలకు పెద్దపీట వేయడమే కాకుండా.. స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

వీటికి రాష్ట్ర ప్రభుత్వం(AP Govt) వైపు నుంచి ఓ అతి పెద్ద రీసెర్చ్ కేంద్రం అవసరమని సీఎం చంద్రబాబు తెలిపారు. తిరుపతిలో ఏర్పాటు చేయబోతున్న ఏపీ-ఫస్ట్ వ్యవస్థ ఆ అవసరాలను తీర్చేలా.. రాష్ట్రంలోని యువతకు సహకరించేలా పూర్తి స్థాయిలో పని చేయాలి. తిరుపతిలోని ఐఐటీ-ఐఐఎస్‌ఈఆర్ రెండు ప్రముఖ జాతీయ విద్యా సంస్థల కాంబినేషన్ లో ఏపీ ఫస్ట్ ఏర్పాటు కాబోతోంది. దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దాలి. ఏపీ ఫస్ట్ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వంతోనూ సంప్రదింపులు జరపాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story