- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పార్టీ కమిటీలపై సీఎం చంద్రబాబు నాయుడు ఫోకస్
టీడీపీ (TDP) జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ కమిటీల నియామకం, సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు వార్తలు వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : టీడీపీ (TDP) జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ కమిటీల నియామకం, సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని కొనసాగించడానికి, ప్రభుత్వానికి-పార్టీకి మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడానికి ఆయన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నేడు మంగళగిరిలోని కేంద్ర కార్యాలయానికి విచ్చేయనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ కార్యాలయంలో కీలక నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమై కమిటీల నిర్మాణం, నామినేటెడ్ పోస్టులపై నేతలతో చర్చించనున్నట్లు సమాచారం.
కమిటీల నియామకంపై దృష్టి..
సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్టం చేసే లక్ష్యంతో సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించారు. అందులో భాగంగా పార్లమెంటరీ నియోజకవర్గాల అధ్యక్షులు, కమిటీల ఎంపికపై కసరత్తు వేగవంతం చేశారు. త్వరలోనే ఈ కమిటీలను, అలాగే జిల్లా స్థాయి కమిటీలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ సంస్థాగత ఎన్నికలు, రాష్ట్ర కమిటీ కూర్పుపై కూడా ముఖ్య నేతలతో ఆయన సమావేశాలు నిర్వహించినట్లు సమాచారం. సుదీర్ఘ కాలం పాటు కష్టపడ్డ కార్యకర్తలందరికీ న్యాయం జరిగేలా, పార్టీని నడిపించగల సమర్థులకే పదవులు ఇవ్వాలని ఆయన నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
నామినేటెడ్ పదవుల హామీ..
మరోవైపు ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సేవ వంటి అంశాల్లో అలసత్వం వహించిన కొంతమంది ఎమ్మెల్యేల తీరుపై ఇటీవల సీఎం సీరియస్ అయినట్లు వార్తలు వచ్చాయి. ప్రభుత్వ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆయన స్పష్టం చేశారు. అలాగే, పార్టీ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలకు త్వరలో నామినేటెడ్ పదవుల జాతర ఉంటుందని హామీ ఇచ్చారు. ముఖ్యంగా మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల్లో పదవులకు సంబంధించి, బూత్ స్థాయిలో చురుకుగా ఉన్నవారికే ప్రాధాన్యత ఉంటుందని తేల్చి చెప్పారు.
క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం లక్ష్యం..
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ శ్రేణులు కీలకపాత్ర పోషించాలని చంద్రబాబు సూచించారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, 2029లో కూడా విజయం సాధించేలా పనితీరు ఉండాలని దిశానిర్దేశం చేశారు. జిల్లాలకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా పార్టీ కార్యాలయానికి వెళ్లి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యేలకు స్పష్టమైన సూచనలను ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.






