రైతులు, లబ్ధిదారులకు ప్రభుత్వం ఉగాది కానుకలు : సీఎం చంద్రబాబు

by Naga Rani Yarlagadda |

నాలుగునెలల్లో నాలుగురోజులు గ్రామాల్లో పర్యటించాలని కలెక్టర్లను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రైతులు, పేదలకు ఉగాది కానుకలు ప్రకటించారు.

రైతులు, లబ్ధిదారులకు ప్రభుత్వం ఉగాది కానుకలు : సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: అధికారులు, ప్రభుత్వం, ప్రజల మధ్య స్పష్టత సమన్వయం లేకుంటే అనుకున్న ఫలితాలు రావని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 20 నెలల కాలంలో సమష్టి కృషితో ఒక నూతన రాజకీయ, పాలనా సంస్కృతికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. అభివృద్ధి-సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. మార్చి 13న అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేస్తామని తెలిపారు. ప్రతినెలా సంక్షేమ పథకాలపై సంక్షేమ క్యాలెండర్ ను విడుదల చేస్తామన్నారు. జులైలో వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభిస్తామని, 2027లో పోలవరాన్ని జాతికి అంకితమిస్తామని చంద్రబాబు ప్రకటించారు. అలాగే వచ్చే ఏడాది మార్చినాటికి రాష్ట్రంలో ఎక్కడా భూ వివాదాలు లేకుండా చేస్తామన్నారు. ఏ కారణం చేతనైనా ప్రజల ప్రాణాలకు ఇబ్బందులు కలిగితే సహించబోమని స్పష్టం చేశారు.

ఇటీవల రాష్ట్రంలో కలకలం రేపిన శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి కల్తీపాలు, వేట్లపాలెం బాణసంచా ఘటనలు తనను తీవ్రంగా కలచివేశాయన్నారు. అధికారుల ఉదాసీనత, పర్యవేక్షణ లోపంతోనే ఈ ఘటనలు జరిగాయన్న సీఎం.. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. 4 నెలల్లో 4 రోజులు సీనియర్ ఐఏఎస్ అధికారులంతా గ్రామాలకు వెళ్లి పర్యటించాలని ఆదేశించారు.

విజన్ 2047 దిశగా అడుగులు

ఒకప్పుడు తాను 'విజన్ 2020'ని ప్రకటించినప్పుడు విమర్శించిన వారు సైతం, నేడు ఆ లక్ష్యాలు సాధ్యమవడాన్ని చూసి 'విజన్ 2047' వైపు అడుగులు వేస్తున్నారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు దీర్ఘకాలంలో అద్భుతమైన ఫలితాలను ఇస్తాయని, అందుకే అభివృద్ధి సాధించడానికి ఉన్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఉదాసీనతకు తావులేకుండా, ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు.

సూపర్ సిక్స్ - సూపర్ హిట్

గత 20 నెలల్లో తమ ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను అత్యంత పారదర్శకతతో అమలు చేసి, వాటిని సూపర్ హిట్ చేశామని సీఎం ప్రకటించారు. వీటితో పాటు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని తెలిపారు. ఈ ఏడాది లక్ష్యాలను చేరుకోవడానికి 15 పాయింట్లతో కూడిన కొత్త ప్రణాళికను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆవిష్కరించారు.

పేదలకు ఉగాది కానుక

ముఖ్యమంత్రి తన ప్రసంగంలో వ్యవసాయ, గృహ నిర్మాణ రంగాలపై కీలక ప్రకటనలు చేశారు. రైతుల సంక్షేమం కోసం ఉద్దేశించిన 'అన్నదాత సుఖీభవ' పథకాన్ని ఉగాది కానుకగా ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. ఉగాది పర్వదినం నాడే రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 50 వేల ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతు సమస్యల పరిష్కారం కోసం ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు

గతంలో భారంగా మారిన విద్యుత్ రంగాన్ని సంస్కరించామని, ట్రూఅప్ నుంచి ట్రూడౌన్ దిశగా మార్పులు తీసుకువచ్చి విజయం సాధించామని చంద్రబాబు తెలిపారు. మైక్రో గ్రిడ్లను బలోపేతం చేయడం ద్వారా ప్రజలపై విద్యుత్ భారాన్ని మరింత తగ్గించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

పారిశ్రామికాభివృద్ధి - ఇన్నోవేషన్

"ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి" అనే సరికొత్త లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం అన్నారు. ఇందులో భాగంగానే 'రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్' ఏర్పాటు చేశామని, కొత్త ఆలోచనలతో వచ్చే యువతను ప్రోత్సహిస్తామని తెలిపారు. ఆర్థిక అసమానతలు తొలగిపోయి, సామాన్యుడి జీవన ప్రమాణాలు పెరిగే వరకు సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

Next Story