శ్రీవారి లడ్డూల విక్రయ కేంద్రంలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు

by Vemula.Srinu Prasad |

శ్రీవారి లడ్డూల విక్రయ కేంద్రంలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు...

శ్రీవారి లడ్డూల విక్రయ కేంద్రంలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala) శ్రీవారి లడ్డూల(Srivari Laddu) విక్రయ కేంద్రంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(TTD Chairman BR Naidu) ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. భక్తులతో కలిసి స్వయంగా కౌంటర్ వద్దకు వెళ్లారు. లడ్డూల జారీ విధానాన్ని, సిబ్బంది పని తీరు, లడ్డూ బరువును పరిశీలించారు. లడ్డూ కౌంటర్‌లోని కియోస్క్ యంత్రం వద్ద దర్శనం కాని భక్తులకు ఆధార్ నమోదు ద్వారా యూపీఐ చెల్లింపు చేసి లడ్డూలు పొందే విధానంపై భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత బూందీ పోటుకు వెళ్లారు. బూందీ తయారీని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.


ఈ సందర్భంగా చైర్మన్ బీర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందులో భాగంగా లడ్డూ విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం టీటీడీ రోజుకు 4 లక్షల లడ్డూలు, 8 వేల కళ్యాణోత్సవ లడ్డూలను భక్తులకు విక్రయిస్తోందని చెప్పారు. వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా లడ్డూల కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. లడ్డూల నాణ్యత, రుచి, క్యూ లైన్లలో వేచి ఉండే సమయం తగ్గించడం వంటి సౌకర్యాలపై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో లడ్డూల ఉత్పత్తిని పెంచి కౌంటర్ల వద్ద త్వరితగతిన భక్తులు లడ్డూలు పొందే విధంగా ఏర్పాట్లు చేస్తామని బీఆర్ నాయుడు పేర్కొన్నారు.

Next Story