AP Politics:ఎన్నికల ప్రచారంలో వైసీపీ అభ్యర్థికి చేదు అనుభవం

by Disha Web Desk 18 |
AP Politics:ఎన్నికల ప్రచారంలో వైసీపీ అభ్యర్థికి చేదు అనుభవం
X

దిశ ప్రతినిధి,చిత్తూరు: వైసీపీ అభ్యర్థి సునీల్ కుమార్‌కు సోమవారం పూతలపట్టు మండలంలో చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే..ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మండల వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి వేపనపల్లి, బూసిపల్లి గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ క్రమంలో వేపనపల్లికి చేరుకున్న సునీల్ కుమార్ ను స్థానిక జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ వెంట ఉన్న వైసీపీ నాయకులు కార్యకర్తలు కలిసి జనసేన కార్యకర్తలపై తిరుగుబాటు చేశారు.

ఈ నేపథ్యంలో పరస్పరం తీవ్రస్థాయిలో వాగ్వాదం చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు మాట్లాడుతూ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు ఏడాది క్రితం మా గ్రామంలో పర్యటించిన సందర్భంగా ప్రభుత్వ పథకాలు అందడం లేదని ప్రశ్నించినందుకు మాలో కొందరిపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికంతటికీ కారణం స్థానిక నాయకులే కాబట్టి వారిని మా గ్రామంలోకి అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా వైసీపీకి చెందిన కొంతమంది స్థానిక నాయకుల పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అయితే గొడవ జరుగుతుందని ముందస్తు సమాచారంతో చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి, పూతలపట్టు సీఐ సుదర్శన్ ప్రసాద్ తమ సిబ్బందితో ఆ గ్రామానికి చేరుకుని సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు. అయినా పరిస్థితి ఉధృతంగా మారడంతో కొంతమంది యువకులను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా వారి తీరులో మార్పు రాకపోవడంతో కేసులు పెట్టాల్సి వస్తుందని గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఎమ్మెల్యే ప్రచారం చేసుకోవడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కాకపోతే ఆయనతో పాటు వచ్చిన స్థానిక నాయకులే తమకు అభ్యంతరకరమని తీవ్రంగా ఆక్షేపించారు. ఈ దశలో వైసీపీ నాయకులకు స్థానిక జనసేన కార్యకర్తలకు మధ్య తీవ్రస్థాయిలో మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు పోలీసులు సర్దుబాటు చేయడంతో కథ సుఖాంతం అయింది.

Next Story