Amaravati: మా రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునేలా చేస్తాం: CM చంద్రబాబు

by Gantepaka Srikanth |

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇవాళ అత్యంత కీలకమైన రోజని ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) అన్నారు.

Amaravati: మా రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునేలా చేస్తాం: CM చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇవాళ అత్యంత కీలకమైన రోజని ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) అన్నారు. అమరావతి(Amaravati) పున:నిర్మాణ సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. తాను చాలాసార్లు ప్రధానిని కలిశాను.. నిమిషాల కొద్ది మాట్లాడాను.. కానీ మొన్న కలిసినప్పుడు మాత్రం మోడీ కళ్లలో ఆవేదన చూశాను.. ఉగ్రదాడిలో అమాయకుల ప్రాణాలు పోయాయనే బాధ ఆయనలో కనిపించిందని చంద్రబాబు అన్నారు. ‘మోడీ గారు.. మేమంతా మీతో ఉన్నాం.. ఉగ్రదాడి(Terrorist Attack) విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సంపూర్ణంగా మద్దతిస్తాం’ అని చంద్రబాబు ప్రకటించారు. అంతేకాదు.. ప్రధాని మోడీ చేతుల్లో దేశం చాలా సేఫ్‌గా ఉందని అన్నారు. సరైన సమయంలో దేశానికి సరైన నాయకుడు ఉన్నాడనే భరోసా అందరిలోనూ కలుగుతోందని చెప్పారు. ఇంత కఠిన పరిస్థితుల్లో మోడీ ఇక్కడి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇప్పుడిప్పుడే వెంటిలేటర్‌ పైనుంచి ప్రధాని మోడీ(PM Modi) సాయంతో ఏపీ బయటపడుతోందని తెలిపారు. అంతేకాదు.. మోడీ నాయకత్వంలో భారత్ అన్ని రంగాల్లో దూసుకెళ్తోందని అన్నారు. కులగణన నిర్ణయం చారిత్రాత్మకమైనదని.. ఇది గేమ్ ఛేంజర్‌(Game Changer)గా మారబోతోందని వెల్లడించారు.

అమరావతి లాంటి ఉద్యమం చరిత్రలో ఎన్నడూ చూడలేదని అన్నారు. రైతులు ఎంతో పోరాటం చేశారు. వారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అన్నారు. వైసీపీ ప్రభుత్వం చిత్ర హింసలు పెట్టినా ఎక్కడా తలొగ్గలేదని కొనియాడారు. వైసీపీ విధ్వంస పాలనకు ఎదురొడ్డి.. ప్రాణాలకు తెగించి రైతులు పోరాటం చేశారని అన్నారు. అమరావతి ఒక నగరం కాదని.. ఐదుకోట్ల ప్రజల సెంటిమెంట్ అని అన్నారు. అందుకే ఇచ్చిన మాటకు కట్టుబడి మళ్లీ ప్రధాని మోడీ చేతుల మీదుగా పనులు పున:ప్రారంభం చేసుకుంటున్నామని తెలిపారు.

మూడేళ్లలో అమరావతి పున:నిర్మాణ పనులు పూర్తి చేస్తామని కీలక ప్రకటన చేశారు. కాలుష్య రహిత నగరంగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రణాళికాబద్ధమైన నగరంగా అమరావతి రూపాంతరం చెందబోతోందని అన్నారు. ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వపడేలా రాజధానిని నిర్మిస్తామని తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం 29 వేల మంది రైతులు 39 వేల ఎకరాల భూములు ఇచ్చారని.. ఎవరినీ అసంతృప్తికి గురిచేయబోమని ‘అమరావతి మా రాజధాని’ అని గర్వంగా చెప్పుకునేలా చేస్తామని అన్నారు.

Next Story