- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మందు బాటిల్స్ కేసుపై సీఎంకు భూమన చాలెంజ్
తిరుమలలో మద్యం బాటిళ్లు. టీడీపీ-వైసీపీ నేతల మాటల యుద్ధం.

దిశ, వెబ్ డెస్క్ : తిరుమలలో మందుబాటిల్స్ (Liquor Bottles In Tirumala) లభ్యమైన విషయంలో ఇప్పటికే కేసు నమోదైంది. వైసీపీకి (YCP) చెందిన కోటి అనే కార్యకర్తతో పాటు ఓ మీడియా ప్రతినిధిని పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. అయితే కోటి అనే వ్యక్తి టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర రెడ్డి (Karunakara Reddy) అనుచరుడు అని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. మద్యం బాటిళ్ల వివాదం వైసీపీ కుట్రగా పేర్కొంటూ విమర్శల వర్షాన్ని కురిపిస్తున్నారు. దీనిపై భూమన కరుణాకర రెడ్డి స్పందిస్తూ శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
కూటమి ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీస్తోందని భూమన ఆరోపించారు. మద్యం బాటిళ్లు లభ్యం అవ్వడం వెనుక వైసీపీ పాత్ర ఉందనేది అవాస్తవం అన్నారు. తప్పుడు కేసులు బనాయించి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీఎన్ఎస్ సెక్షన్ 152 కింద కేసు కట్టడం అత్యంత దారుణంగా అభివర్ణించారు. న్యాయమూర్తులు ఉన్నారు కాబట్టి తాము బతికిపోతున్నాం అన్నారు. లేదంటే వైసీపీ నేతలు, కార్యకర్తలు జైళ్లే ఆవాసాలుగా మారేవన్నారు.
ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రైవేటు సైన్యాన్ని నిర్వహిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. వారే మద్యం తాగి బాటిళ్లను అక్కడ పడేశారని ఆరోపణలను గుప్పించారు. 25 గోనె సంచుల నిండా మద్యం బాటిళ్లు బయటపడిన విషయం నిజం కాదా? అని ఆయన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మద్యం బాటిళ్లు వేసింది వైసీపీ కార్యకర్తనే అయితే.. దూరం నుంచి ఉన్న సీసీటీవీ ఫుటేజీ కాకుండా.. దగ్గరగా ఉన్న సీసీటీవీ ఫుటేజీ విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు.
అరెస్టు చేసినంత మాత్రానా వైసీపీ నేతల గొంతు ఆగదన్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించే ఏ విషయంపై అయినా ప్రశ్నిస్తామని భూమన స్పష్టం చేశారు. అక్కడ జరుగుతున్న నేరాలు, ఘోరాలను ప్రజలకు తెలియజేస్తాని ప్రకటించారు.






