జగదాంబ సెంటర్‌లో యువతిపై దాడి.. మహిళల భద్రతపై బాధితురాలు ఆవేదన వ్యక్తం

by Ramesh Naini |

జగదాంబ సెంటర్‌లో యువతిపై దాడి.. మహిళల భద్రతపై బాధితురాలు ఆవేదన వ్యక్తం
X

దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖపట్నం నగరంలోని జగదాంబ సెంటర్‌లో ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఆఫీస్‌కు వెళ్తున్న సమయంలో అపరిచిత వ్యక్తి తనను కొట్టి, బూతులు తిట్టి వెళ్లిపోయాడని బాధిత యువతి ఆరోపించింది. ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధితురాలి వివరాల ప్రకారం.. ఆమె జగదాంబ జంక్షన్ నుంచి ఆఫీస్‌కు నడుచుకుంటూ వెళ్తుండగా థియేటర్ సమీపంలో ఉన్న ‘రాజాసాబ్’ సినిమా పోస్టర్‌ను ఫోటో తీసింది. తాను ప్రభాస్ అభిమానినని, అందుకే పోస్టర్‌ను చిత్రీకరించానని తెలిపింది. ఈ క్రమంలో స్వామి మాల ధరించినట్లు కనిపించిన ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చి గట్టిగా అరవడం ప్రారంభించాడని చెప్పింది. మొదట అతను సమీపంలోని ఆటో డ్రైవర్లపై అరుస్తున్నాడని భావించి పట్టించుకోలేదని పేర్కొంది. అయితే కొద్దిసేపటికి అదే వ్యక్తి వచ్చి తన చెంపపై కొట్టాడని, నోటికొచ్చిన బూతులు తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడని బాధితురాలు వాపోయింది. దాడిలో తన కళ్లద్దాలు విరిగిపోయాయని తెలిపింది. అసలు తనను ఎందుకు కొట్టాడో కూడా తెలియదని ఆవేదన వ్యక్తం చేసింది.

అక్కడున్న వారు ఎవరూ స్పందించలేదు

దాడి సమయంలో అక్కడున్న వారు ఎవరూ స్పందించలేదని, ఇది తనను మరింత బాధించిందని ఆమె కన్నీటితో చెప్పింది. అనంతరం ఆఫీస్ సహచరులకు ఫోన్ చేయగా వారు వచ్చి తనను తీసుకెళ్లారని తెలిపింది. తరువాత పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వగా పోలీసులు స్పందించి జగదాంబ సెంటర్‌లో తనిఖీలు నిర్వహించారని, అయితే నిందితుడు దొరకలేదని పేర్కొంది. ఈ ఘటన రాష్ట్రంలో మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోందని బాధితురాలు వీడియోలో వ్యాఖ్యానించింది. సాటి భారత పౌరులుగా మహిళలకు అండగా నిలవాలని, ఇలాంటి దాడులకు పాల్పడే వ్యక్తులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది.

Next Story