డిజిటల్ సేవల్లో ఏపీఎస్‌ఆర్‌టీసీ ముందంజ.. జాతీయ స్థాయిలో అవార్డు

by Vemula.Srinu Prasad |

ప్రయాణికుల నమ్మకానికి మారుపేరుగా నిలిచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాన్ని దక్కించుకుంది. ..

డిజిటల్ సేవల్లో ఏపీఎస్‌ఆర్‌టీసీ ముందంజ.. జాతీయ స్థాయిలో అవార్డు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రయాణికుల(Passengers) నమ్మకానికి మారుపేరుగా నిలిచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) మరో ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాన్ని(National award) దక్కించుకుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, ప్రయాణికులకు అత్యాధునిక డిజిటల్ సేవల(Digital services)ను చేరువ చేస్తున్నందుకు గానూ ఈ అత్యున్నత అవార్డు వరించింది. రవాణా రంగంలో వినూత్న మార్పులు తీసుకొస్తున్న సంస్థగా ఏపీఎస్‌ఆర్టీసీ జాతీయ స్థాయిలో తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది.

రోల్ మోడల్‌గా ఏపీఎస్‌ఆర్టీసీ

గతంలోనే 2025 సంవత్సరానికి గానూ ‘పీఎస్ఈ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్’ అవార్డుకు ఎంపికైన ఏపీఎస్‌ఆర్టీసీ, తాజాగా ఆ పురస్కారాన్ని అందుకుంది. ముఖ్యంగా సంస్థలోని ‘యూనిఫైడ్ కమ్యూనికేషన్స్’(Unified Communications) విభాగంలో డిజిటల్ సామర్థ్యాన్ని పెంచడం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావడంలో చూపిన ప్రతిభకు ఈ గుర్తింపు లభించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో టెక్నాలజీ వినియోగంలో ఏపీఎస్‌ఆర్టీసీ రోల్ మోడల్‌గా నిలుస్తోందని ఈ అవార్డు నిరూపించింది.

పురస్కారం స్వీకరణ


హైదరాబాద్‌లో వైభవంగా జరిగిన ‘ఇండియా పీఎస్ఈ సమ్మిట్’ వేదికగా ఈ అవార్డు ప్రధానోత్సవం జరిగింది. ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ బాలసుబ్రమణ్యం తరఫున ఐటీ విభాగం చీఫ్ ఇంజనీర్ వై. శ్రీనివాసరావు ఈ పురస్కారాన్ని స్వీకరించారు. జాతీయ స్థాయి వేదికపై ఏపీఎస్‌ఆర్టీసీ పేరు మారుమోగడం పట్ల రవాణా రంగ నిపుణులు మరియు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

విజయం వెనుక వాళ్లే....

ఈ ఘనతపై వీసీ అండ్ ఎండీ బాలసుబ్రమణ్యం స్పందిస్తూ.. సంస్థ సాధించిన ఈ విజయం వెనుక అధికారులు, సూపర్వైజర్లు, సిబ్బంది యొక్క నిరంతర కృషి ఉందని కొనియాడారు. గతంలో ఎన్నో అవార్డులు అందుకున్న చరిత్ర ఉన్నప్పటికీ, మారుతున్న టెక్నాలజీ విభాగంలో ఈ అవార్డు రావడం సంస్థ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి అని ఆయన అభివర్ణించారు. మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థే ధ్యేయంగా ముందుకు సాగుతామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Next Story