ఆయుష్ వైద్యానికి కొత్త రూపు: రిజిస్ట్రేషన్, నియంత్రణకు మూడు ప్రత్యేక కమిటీలు!

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి (ఆయుష్) క్లినిక్‌లు, ఆసుపత్రుల రిజిస్ట్రేషన్, నియంత్రణ ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఆయుష్ వైద్యానికి కొత్త రూపు: రిజిస్ట్రేషన్, నియంత్రణకు మూడు ప్రత్యేక కమిటీలు!
X

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి (ఆయుష్) క్లినిక్‌లు, ఆసుపత్రుల రిజిస్ట్రేషన్, నియంత్రణ ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. “ఏపీ అలోపతి ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ సవరణ చట్టం-2026” అమలులో భాగంగా ఆయుష్ శాఖ మూడు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయుష్ డైరెక్టర్ (ఇంచార్జి) గోపాలకృష్ణ రొణంకి ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేశారు.

కమిటీల నిర్మాణం - బాధ్యతలు.. టెక్నికల్ కమిటీ

డా. పి. సాయి సుధాకర్ (అదనపు డైరెక్టర్), డా. టి. బుల్లయ్య (విజయవాడ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్), డా. పి. జగదీష్ (సూపరింటెండెంట్) ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీరు క్లినిక్‌ల రిజిస్ట్రేషన్‌కు అవసరమైన ఆపరేషనల్ గైడ్‌లైన్స్‌ను రూపొందిస్తారు. ముఖ్యంగా కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అమలులో ఉన్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి, కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ బెంచ్‌మార్క్ రేట్లను పరిగణనలోకి తీసుకుని నివేదిక ఇవ్వనున్నారు.

ఎక్స్‌పర్ట్ ప్యానెల్ కమిటీ

నిపుణుల కమిటీలో డా. జె.ఎల్.ఎన్. శాస్త్రి, డా. వేముల భాను ప్రకాష్, డా. బి. వెంకటేశ్వర్లు సభ్యులుగా ఉన్నారు. క్షేత్రస్థాయి అనుభవాల ఆధారంగా ఆయుష్ వైద్య రంగంలో సాంకేతిక సూచనలు, ప్రాయోగిక నియంత్రణ చర్యలపై ప్రభుత్వానికి సిఫార్సులు చేయనున్నారు.

స్టేక్‌హోల్డర్స్ కమిటీ

డా. మల్లు ప్రసాద్, డా. కె.వి. రమణరాజు, డా. కె.ఎస్. చలపతిరావు సభ్యులుగా ఈ కమిటీ ఏర్పాటైంది. చట్టం అమలులో ప్రైవేట్ ప్రాక్టీషనర్లకు ఎదురయ్యే సమస్యలు, వారి అభ్యంతరాలు మరియు ప్రజాభిప్రాయాలను ఈ కమిటీ క్రోడీకరిస్తుంది.

నాణ్యమైన సేవలే లక్ష్యం

ఈ కమిటీల ద్వారా రూపొందించబడే మార్గదర్శకాలు, నియమావళి ఆధారంగా రాష్ట్రంలో ఆయుష్ వైద్య సేవలకు పారదర్శక, నాణ్యతాపరమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందడంతో పాటు అనధికార వైద్య విధానాలను నియంత్రించడం సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు.

Next Story