ఏపీలో మొదలైన చదువుల విప్లవం దేశానికి దిశ చూపుతోంది.. సీఎం జగన్

by Dishafeatures2 |
ఏపీలో మొదలైన చదువుల విప్లవం దేశానికి దిశ చూపుతోంది.. సీఎం జగన్
X

దిశ, డైనమిక్ బ్యూరో : పేదరికం కారణంగా నా పేదల చదువులు ఎంత మాత్రం ఆగరాదన్న లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తోంది. ఉజ్వల భవిష్యత్తుకు చదువులే పునాది. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఉన్నత చదువులు అందించడమే ధ్యేయంగా జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్నాం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు వేదికగా 2023 విద్యా సంవత్సరంలో జనవరి మార్చి త్రైమ్రాసికానికి సంబంధించి 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 703 కోట్ల నిధులను సీఎం జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా కొవ్వూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. గత నాలుగేళ్లలో కేవలం విద్యార్థుల ఉన్నత చదువుల కోసమే రూ. 14,912 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.

గత టీడీపీ ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచిన రూ. 1,778 కోట్లను కూడా మన ప్రభుత్వంలో చెల్లించామని సీఎం జగన్ వివరించారు. రాబోయే రోజుల్లో ఏపీలో మొదలైన చదువుల విప్లవం దేశానికి దశ దిశ చూపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పిల్లల చదువులపై చేస్తున్న ఖర్చు మానవ వనరులపై చేస్తున్న పెట్టుబడి అని దీంతో రాష్ర్ట సర్వతోముఖాభివృద్ధికి సాధ్యపడుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. పిల్లలు చదువుకుంటే భావితరాలు బాగుపడతాయని సమాజంలో వివక్ష పోవాలన్నా పేదరికం పోవాలన్నా చదవే గొప్ప అస్త్రంగా పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా నిరుపేదలు సామాజికంగా ఎదిగి ఆర్థికంగా బలపడాలన్నదే తన లక్ష్యమని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.

ప్రతి కుటుంబం నుంచి ఒక సత్యనాదెళ్ల రావాలి

ప్రతి పేద విద్యార్థి ఆర్థిక పరమైన కారణాలతో ఉన్నత చదువులకు దూరం కాకూడదనే లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందని, రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుంచి ఒక సత్య నాదెళ్ల రావాలని తాను కోరుకుంటున్నట్లు సీఎం జగన్‌ పేర్కొన్నారు. దీని కోసం విద్యార్థులు ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేలా చదువుల్లో రాణించాలని సూచించారు. ప్రతిభ ఉన్న ప్రతి విద్యార్థికి తోడుగా ఉంటామని సీఎం జగన్ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం చదువులపై చేస్తున్న ఖర్చుతో రాష్ర్ట ఆర్థిక వ్యవస్థ మునిగిపోతోందంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని కానీ తాను మాత్రం విద్యార్థుల చదువుల కోసం చేస్తున్న ఖర్చును హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ గా భావిస్తున్నానని ఇదే నా రాష్ట్రానికి భవిష్యత్తులో అండగా నిలుస్తుందని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు.

పేద ప్రజలే నాకు అండ

గత టీడీపీ ప్రభుత్వానికి ప్రస్తుత మన వైసీపీ ప్రభుత్వానికి అదే రాష్ట్రం.. అదే బడ్జెట్ ఉందని కానీ గత చంద్రబాబు పాలనలో ప్రభుత్వ ఖజానాను పెత్తందారులు దోచుకుంటే.. మన ప్రభుత్వంలో ఆ డబ్బును పేదల ఖాతాల్లోకి వేస్తూ వారికి భరోసా కల్పిస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. ఒక్క మీ జగన్‌ను ఎదుర్కొనేందుకు తోడేళ్లంతా ఏకమవుతున్నారని...మరో సారి రాష్ర్టంలో పెత్తందారీ ప్రభుత్వం తేవాలని తహతహలాడుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికలు పేదవాడికి పెత్తందార్లకు మధ్య జరిగే క్లాస్‌ వార్‌ అని ఈ క్లాస్ వార్ లో తనకు పేద ప్రజలే అండ అని వ్యాఖ్యానించారు. గత పాలకులు గజదొంగల ముఠాగా ఏర్పడి అప్పట్లో రాష్ట్రాన్ని దోచుకున్నారని కానీ మన పేదల ప్రభుత్వంలో ఈ డబ్బు పేదల ఖాతాల్లోకి వెళుతుంటే ఓర్చుకోలేక కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఎల్లో మీడియా చంద్రబాబు అండ్ కో, దుష్టచతుష్టయం, గజ దొంగల ముఠా కుట్రలకు ఆజ్యం పోస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ పేరుతో ఎన్ని వేల కోట్లు తిన్నారో చంద్రబాబు చెప్పగలరా అని ప్రశ్నించారు. కానీ మన ప్రభుత్వం ఆ స్థానంలో లంచాలు, వివక్ష లేని సచివాలయ, వాలంటీర్ వ్యవస్థను తెచ్చి ప్రతి పథకాన్ని ప్రజల గడప వద్దకే చేరుస్తోందని సీఎం జగన్ వివరించారు. ఈ తేడా ప్రజలు ఎప్పుడు మరచిపోరాదని మన ప్రభుత్వంలో మంచి జరిగిందని భావించిన ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.

డిజిటల్ విద్య దిశగా అడుగులు

రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ విద్యదిశగా అడుగులు వేస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్ తో కూడిన ఉచిత ట్యాబ్లు అందించినట్లు తెలిపారు. నాడు - నేడు ద్వారా ఇప్పటికే అభివృద్ధి చేసిన పాఠశాలల్లో 6వ తరగతి పైన ప్రతి క్లాస్ రూమ్ లో ఉండేలా 30,213 ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్, 10,038 ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లలో స్మార్ట్ టీవీలు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ బడులు కార్పొరేట్ బడులతో పోటీపడటం కాదు, కార్పొరేట్ బడులే ప్రభుత్వ బడులతో పోటీపడాలి అన్న లక్ష్యంతో విద్యావ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చినట్లు సీఎం వైఎస్ జగన్ తెలిపారు.


Next Story

Most Viewed