- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు భాషా వికాసం.. సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణే లక్ష్యంగా ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు (Prapancha Telugu Maha Sabhalu) గుంటూరు వేదికగా అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. జనవరి 3 నుంచి 5 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ మహాసభలకు ‘అనురాగ సంగమం’ అని నామకరణం చేశారు.
అమరావతి తీరాన
జాతీయ రహదారి-16 పక్కన ఉన్న సాయి బొమ్మిడాలనగర్ (Sri Sathya Sai Spiritual City) ఈ చారిత్రాత్మక వేడుకలకు వేదిక కానుంది. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో సర్వాంగ సుందరంగా సిద్ధమైన ప్రాంగణంలో.. 10 ఎకరాలను ప్రధాన వేదికల కోసం, మరో 10 ఎకరాలను పార్కింగ్ కోసం కేటాయించారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ అధ్యక్షతన ప్రధాన సమన్వయకర్త పి. రామచంద్రరాజు పర్యవేక్షణలో ఏర్పాట్లు ముమ్మరంగా పూర్తయ్యాయి.
దిగ్గజాల రాక..
ఈ మహాసభలకు ప్రపంచవ్యాప్తంగా 52 దేశాల నుంచి ప్రతినిధులు, వివిధ రాష్ట్రాలలోని తెలుగు సంఘాల నాయకులు హాజరుకానున్నారు. జనవరి 4న మారిషస్ అధ్యక్షుడు ధరమ్ గోకుల్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారని నిర్వాహకులు తెలిపారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితర ప్రముఖులు వివిధ సెషన్లకు గౌరవ అతిథులుగా హాజరుకానున్నారని పేర్కొన్నారు.
మహనీయుల పేర్లతో వేదికలు
తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుల పేర్లతో వేదికలు, ద్వారాలను నిర్వాహకులు తీర్చిదిద్దారు. ఇందులో ఎన్టీఆర్ పేరిట ప్రధాన వేదికను ఏర్పాటు చేశారు. దాదాపు 5 వేల మంది కూర్చునేందుకు వీలుగా సీటింగ్ ఏర్పాటు చేశారు. కవి సమ్మేళనాల నిర్వహణ కోసం జాషువా-కరుణశ్రీ వేదిక, అవధానాల కోసం కొప్పరపు కవుల వేదిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం తూము నరసింహదాసు వేదికను అందుబాటులోకి తెస్తున్నారు. సంగీత కార్యక్రమాల కోసం పాడనా తెలుగు పాట పేరిట ఘంటసా-ఎప్పీ బాలు వేదికను నిర్వాహకులు రూపుదిద్దారు. అదే విధంగా రామోజీరావు ప్రదర్శనల ప్రాంగణంలో పుస్తక ప్రదర్శనలు, హస్తకళలు, తెలుగు వైభవం కొలువుదీరనున్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు.
ద్వారాలకు ప్రముఖుల పేర్లు
మహాసభల ద్వారాలకు సినారె, దాశరథి, దాసరి నారాయణరావు వంటి ప్రముఖుల పేర్లు పెట్టగా, భోజన శాలలకు అన్నపూర్ణగా పేరొందిన డొక్కా సీతమ్మ, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య పేర్లను పెట్టారు.
సహస్ర కవితా నీరాజనం - పురస్కారాలు
తెలుగు సాహితీ సౌరభాన్ని వెదజల్లేలా వెయ్యిమంది కవులతో ‘సహస్ర కవితా నీరాజనం’ నిర్వహించనున్నామని నిర్వాహకులు ప్రకటించారు. అలాగే, భాషా సేవలో తరించిన వారికి 80 పూర్ణకుంభ పురస్కారాలు, 40 విశిష్ట పురస్కారాలు, పలువురు సీనియర్లకు జీవన సాఫల్య పురస్కారాలను ప్రధానం చేయనున్నారని వెల్లడించారు.
మూడు రోజుల పాటు సుమారు 25,000 మందికి పైగా తెలుగు భాషాభిమానులు పాల్గొంటారని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ మహాసభలు తెలుగు జాతి ఐక్యతకు, భాషా వికాసానికి కొత్త దిశానిర్దేశం చేయనున్నాయి.






