అనంతపురంలో విషాదం.. స్విమ్మింగ్‌ పూల్‌లో మునిగి వైద్య విద్యార్థి మృతి

by Ramesh Naini |

అనంతపురం జిల్లా గార్లదిన్నెలో తీవ్ర విషాదం నెలకొంది. సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఓ వైద్య విద్యార్థి స్విమ్మింగ్‌ పూల్‌లో మునిగి ప్రాణాలు కోల్పోయాడు.

అనంతపురంలో విషాదం.. స్విమ్మింగ్‌ పూల్‌లో మునిగి వైద్య విద్యార్థి మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: అనంతపురం జిల్లా గార్లదిన్నెలో తీవ్ర విషాదం నెలకొంది. సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఓ వైద్య విద్యార్థి స్విమ్మింగ్‌ పూల్‌లో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న ఐదుగురు విద్యార్థులు మంగళవారం ఈత కొట్టడానికి గార్లదిన్నెలోని ఒక ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లారు. అందరూ కలిసి ఈత కొడుతుండగా, ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన మోహన్ (20) అనే విద్యార్థి ప్రమాదవశాత్తు పూల్‌లో లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మునిగిపోయాడు.

కేసు నమోదు.. దర్యాప్తు

లోతును గమనించని మోహన్ ఊపిరాడక నీటిలోనే ప్రాణాలు విడిచినట్లు సమాచారం. తోటి విద్యార్థులు వెంటనే స్పందించినప్పటికీ ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న గార్లదిన్నె పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు ప్రకాశం జిల్లా మార్కాపురం వాసిగా గుర్తించిన పోలీసులు, ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వైద్య విద్యార్థి మృతితో అనంతపురం మెడికల్ కాలేజీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story