- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP News:మంత్రి పయ్యావులతో ఎమ్మెల్యే పరిటాల సునీత భేటీ.. కీలక అంశాలపై చర్చలు
ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌తో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ బుధవారం భేటీ అయ్యారు.

దిశ ప్రతినిధి, అనంతపురం: ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌తో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ బుధవారం భేటీ అయ్యారు. నగరంలోని పయ్యావుల నివాసానికి వెళ్లి.. పలు అంశాలపై చర్చించారు. ముందుగా ఎమ్మెల్యే సునీత నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో హంద్రీ-నీవా అధికారులతో సమావేశం నిర్వహించారు. జీడిపల్లి నుంచి పేరూరు ప్రాజెక్టుకు నీరందించే పనుల పురోగతి గురించి చర్చించారు. భూసేకరణ, కాలువలు, పంపు హౌస్‌లు, రిజర్వాయర్ల నిర్మాణానికి అవసరమైన నిధుల గురించి తెలుసుకున్నారు. సమగ్రమైన సమాచారంతో ఎమ్మెల్యే సునీతతో పాటు పరిటాల శ్రీరామ్ కూడా వెళ్లి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావులను కలిశారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలను వివరించారు. జీవో నెంబర్ 59 ప్రకారం జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పేరూరు ప్రాజెక్ట్ వరకు 54 కిలోమీటర్లు కాలువ తవ్వాల్సి ఉందన్నారు. గత ఐదేళ్లలో ఈ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. పెండింగ్ పనులు, 4 పంప్ హౌస్ ల నిర్మాణాలతో పాటు పుట్టకనుమ, సోమరవాండ్లపల్లి ప్రాజెక్ట్ ల నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు.
ఇందులో భూసేకరణ జరగాల్సి ఉందన్నారు. పేరూరు ప్రాజెక్టు కాలువ త్రవ్వకం కోసం చేసిన 266 ఎకరాల భూసేకరణ పరిహారం బిల్లులు 14 కోట్లు సీఎఫ్ఎంఎస్ లో అప్ లోడ్ చేశారని.. నిధులు విడుదల చేయాల్సి ఉందన్నారు. కాలువ భూసేకరణ కోసం 51 కోట్ల బడ్జెట్ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సీఎఫ్ఎంఎస్ పోర్టల్లో భూసేకరణ, కాలువ నిర్మాణం పనుల బిల్స్ అప్లోడ్ చేయడానికి హోల్డ్ ను తీసివేయాలన్నారు. పేరూరు కాలువ పనులు చేపట్టడానికి 2 వందల కోట్ల బడ్జెట్ కేటాయించి.. నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులకు సంబంధించి చర్చించారు. కాలువ లైనింగ్ పనుల పై రైతుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని.. వీటిని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. లైనింగ్ బదులు కాలువ వెడల్పు చేయాలని రైతులు కోరుతున్నట్టు వివరించారు. తప్పనిసరి పరిస్థితుల్లో లైనింగ్ చేయాల్సి వస్తే... కాలువ గట్లకు ఇరు వైపులా చేసి. క్రింది భాగం వదిలేయాలన్నారు. అలాగే నసనకోట ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలలో బాలికల జూనియర్ కాలేజీ మంజూరుకు ఫైనాన్సియల్ క్లియరెన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వారు చెప్పిన అన్ని అంశాలపై మంత్రి పయ్యావుల సానుకూలంగా స్పందించారు. సీఎం చంద్రబాబుతో పాటు సంబంధిత అధికారులతో చర్చించి త్వరలోనే సానుకూలమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.






