- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంధన సమస్య: సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు అలర్ట్
రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ఇంధన (పెట్రోల్, డీజిల్) కొరత సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్‌గా దృష్టి సారించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ఇంధన (పెట్రోల్, డీజిల్) కొరత సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్‌గా దృష్టి సారించారు. ఇంధన కొరతతో వాహనదారులు, అన్నదాతలు పడుతున్న ఇబ్బందులపై ఆయన స్పందించడంతో అధికారులు అప్రమత్తమై దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
నందిగామలో తగ్గిన ఇబ్బందులు.. రైతుల ఆవేదన
గత నాలుగు రోజులుగా నందిగామలో ఇంధనం లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. సీఎం ఆదేశాలతో సోమవారం పలు బంకులకు పెట్రోల్, డీజిల్ చేరుకోవడంతో వాహనదారులు భారీగా క్యూ కట్టారు. సాయంత్రానికి అన్ని బంకులకు స్టాక్ చేరుతుందని అధికారులు అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. అయితే, వ్యవసాయ పనుల నిమిత్తం క్యాన్లలో డీజిల్ కావాలంటే వీఆర్వో అనుమతి పత్రం తీసుకురావాలని అధికారులు షరతు పెట్టడంపై రైతులు మండిపడుతున్నారు. అత్యవసర సమయంలో వీఆర్వోల చుట్టూ ఎలా తిరగాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రవాణా సేవలు ఆగకూడదు: మంత్రి మండిపల్లి
ఇంధన సరఫరాలో తాత్కాలిక అంతరాయాలు ఉన్నప్పటికీ రవాణా సేవలు ఎక్కడా నిలిచిపోకూడదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, రవాణా సంస్థలు, ప్రైవేట్ ఆపరేటర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కొనసాగుతున్న ఇంధన కష్టాలు..
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పరిస్థితి ఇంకా చక్కబడలేదు. మార్కాపురం (యర్రగొండపాలెం), బాపట్ల (చీరాల, పర్చూరు) తదితర ప్రాంతాల్లో స్టాక్ లేక బంకులు మూతపడ్డాయి. విజయవాడలోని ఆటోనగర్, బెంజిసర్కిల్ తదితర ప్రాంతాల్లో బంక్ నిర్వాహకులు వాహనాలకు పరిమితంగానే పెట్రోల్ పోస్తుండటంతో దూరప్రాంతాలకు వెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవసరానికి మించి ఇంధనం కోసం ఎగబడవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. తిరుపతి జిల్లాలో తీవ్ర డీజిల్ కొరత ఏర్పడింది.
అక్రమాలకు పాల్పడితే చర్యలు: అనంతపురం కలెక్టర్ ఆనంద్
ప్రజలు ఆందోళన చెందవద్దని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ కోరారు. ఇంధన లభ్యతపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, వదంతులు వ్యాప్తి చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. స్టాక్ ఉంచుకుని బోర్డులు పెడితే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని, తహసీల్దార్లతో బంకుల తనిఖీలు చేయిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అత్యవసర వాహనాలకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.






