ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది : TDP Leader Varla Ramaiah

by Disha Web Desk 21 |
ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది : TDP Leader Varla Ramaiah
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడి అరెస్టును ఖండిస్తూ స్వచ్చందంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్న ప్రజలపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలపై పోలీసులు తమ ప్రతాపం చూపిస్తున్నారు అని మండిపడ్డారు. ‘శాంతియుత నిరసనల్లో సైతం పాల్గొనద్దంటూ పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు రాకుండా అక్రమ గృహ నిర్భందాలు చేస్తున్నారు. శాంతియుత నిరసనలు చేస్తున్న ప్రజలపై కఠినమైన ఐపీసీ 307 లాంటి కఠినమైన సెక్షన్లతో కేసులు నమోదు చేస్తున్నారు. పోలీసులు కాలేజీ యాజమాన్యాలను బెదిరించి సెలవులు ప్రకటింపజేస్తున్నారు. రాష్ట్రంలో అక్రమ అరెస్టులు, కేసులు, గృహనిర్భందాలతో ప్రజలకు రాజ్యాంగం ప్రసాధించిన ప్రాధమిక హక్కులు ఉల్లంఘించబడుతున్నాయి’ అని వర్ల రామయ్య అన్నారు. ఈమేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికలకు ఆరు నెలల కూడా లేని సమయంలో ప్రతిపక్షాలు లేకుండా ఎన్నికలకు వెళ్లాలని సీఎం వైఎస్ జగన్ తహతహలాడుతున్నాడు అని విరుచుకుపడ్డారు.

అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్షాలను చెల్లాచెదరు చేయాలని చూస్తున్నాడు అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేసేందుకు పోలీసు శాఖను పావుగా వాడుకుంటున్నాడు అని మండిపడ్డారు. గత 10 రోజులుగా పోలీసులకు సెలవులు రద్దు చేసి వారిని స్టాండ్ బైలో పెట్టి రోడ్లపైనే ఉంచుతున్నారు అని ఆరోపించారు. మీ రాజకీయకక్ష కోసం పోలీసులను వాడుకుంటారా? అని నిలదీశారు. నారా లోకేశ్ అరెస్టుకు కూడ రంగం సిద్దమైందంటూ పోలీసులే ఫీలర్లు వదిలి భయభాంత్రలు సృష్టిస్తున్నారు అని మండిపడ్డారు. ప్రజలు పండుగ పూట దేవాలయాలకు వెళ్లి దేవుణ్ని దర్శనం చేసుకోవడానికి కూడా పర్మిషన్లు కావాలా? అని నిలదీశారు. వ్యాపారస్తులు షాపులు తెరచి వ్యాపారాలు చేసుకోవడానికి భయపడుతున్నారు. చంద్రబాబునాయుడి అరెస్టుతో ఉద్యోగులు సైతం నిర్ణయాలు తీసుకుని ఫైళ్లపై సంతకాలు పెట్టాలంటేనే భయపడుతున్నారు. ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్‌ను జగన్ మోహన్ రెడ్డి తన స్వార్ధం కోసం అల్లకల్లోలం చేస్తున్నాడు అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది సరైన పద్దతి కాదు అని అన్నారు. ప్రభుత్వ కేసులు వాదించడానికి అడ్వకేట్ జనరల్ ఉండగా కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి ఢిల్లీ నుంచి ముకుల్ రోహత్గీ తీసుకురావాల్సిన అవసరం ఏంటి? మీ స్వార్ధం కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేస్తారా? ఒక అమాయకుడి అరెస్టును నిర్ధారించడం కోసం కోట్లు ఖర్చు చేసి ఢిల్లీ నుంచి అడ్వకేట్లను తీసుకొస్తారా? అధికారమే శాశ్వతం అనుకుని విర్రవీగిన హిట్లర్, ముస్సోలినీ, ముషారఫ్ లే కాలగర్భంలో కలిసిపోయారు.మీరెంత జగన్? అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య హెచ్చరించారు.


Read More 2023 Telangana Legislative Assembly election News
For Latest Government Job Notifications
Follow us on Google News




Next Story