అమరావతిలో ఉద్రిక్తత.. కళ్లకు గంతలు కట్టుకుని నల్లబెలూన్లతో రైతుల నిరసన

by Disha Web Desk |
అమరావతిలో ఉద్రిక్తత.. కళ్లకు గంతలు కట్టుకుని నల్లబెలూన్లతో రైతుల నిరసన
X

దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆర్-5జోన్ పేరుతో సీఆర్డీఏ పరిధిలో 50,793 మంది మహిళలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించడాన్ని నిరసిస్తూ రాజధాని రైతులు ఆందోళనకు దిగారు. ఆర్‌-5 జోన్‌ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీకి వ్యతిరేకంగా శుక్రవారం రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడి, మందడం, కృష్ణాయపాలెం, తదితర గ్రామాల్లో రైతులు, మహిళలు ఆందోళన చేపట్టారు. పేదలకు పట్టాల పేరుతో మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వెలగపూడిలోని దీక్షా శిబిరం వద్ద రైతులు నల్లబెలూన్లు, నల్ల జెండాలను ఎగురవేసి నిరసన తెలిపారు. అంతేకాదు కళ్లకు నల్లటిగంతలు కట్టుకుని నిరసన గళం వినిపించారు. తుళ్లూరులో ఇళ్లు, దుకాణాలపై నల్ల జెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు. సీఎం జగన్‌ మొండి వైఖరిని నశించాలని... అమరావతిని విచ్ఛిన్నం చేసే సీఎం గో బ్యాక్‌, రాజధాని ద్రోహులు గో బ్యాక్‌ అంటూ పెద్ద ఎత్తున నినదించారు.

భారీగా పోలీసుల మోహరింపు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. నిరసనకారులు బయటకు రాకుండా భారీగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు 3 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

బాలకోటయ్య అరెస్టు

అమరావతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు విజయవాడ, ఇటు కంచికచర్ల పోలీసులు వెంబడించి అరెస్ట్ చేశారు. రాత్రి ఒంటి గంటకు ఆయన స్వగ్రామమైన కంచికచర్లలో పోలీసులు నిర్బంధించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీరుపై బాలకోటయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్ని కట్టడి చేసి సభలు నిర్వహిస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని మండిపడ్డారు.అమరావతిలో ఆకు కదిలితే సీఎం వైఎస్ జగన్ భయపడిపోతున్నారని అన్నారు. రాజధాని రైతుల్ని మోసం చేసినట్లే ప్రస్తుతం పట్టాల పేరుతో నిరుపేదలను మోసం చేస్తారని ఆరోపించారు. రాజధానిలో కంప చెట్లు తొలగించేందుకు, గడ్డి పరక పని చేసేందుకు మనసు రాని ముఖ్యమంత్రి లబ్ధిదారుల పట్ల ప్రేమ చూపటం దుర్మార్గం అని బాలకోటయ్య తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ఇవి కూడా చదవండి: Amaravati: సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు


Next Story

Most Viewed