అల్లూరి జిల్లా | పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత

by Thanuru Gopichand |

రోజురోజుకూ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు (Temperature) తగ్గు ముఖం పడుతున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గి ఒక్కసారిగా వాతావరణం చల్లబడుతోంది.

అల్లూరి జిల్లా | పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత
X

దిశ, వెబ్ డెస్క్ : రోజురోజుకూ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు (Temperature) తగ్గు ముఖం పడుతున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గి ఒక్కసారిగా వాతావరణం చల్లబడుతోంది. దీంతో గజగజా వణికిపోవడం ప్రజల వంతవుతోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఎముకలు కొరికే చలితో ప్రజలు బిక్క చచ్చిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. చలి పులి పంజా బారిన పడకుండా ప్రజలు చలి మంటలను కాచుకుంటూ ఉపశమనం పొందున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి పెరుగుతూనే ఉంది. దట్టమైన మంచు తెరలు కమ్ముకొని దారులు సైతం కనిపించని పరిస్థితి నెలకొంది. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఎండ మాటే ఉండడం లేదని ఏజెన్సీవాసులు అంటున్నారు. అత్యవసరం అయితే బయటకు వచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు. అల్లూరి జిల్లాలో (Alluri District) అయితే మరీ తక్కువ ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. 4 డిగ్రీల కంటే తక్కువకు ఉష్ణోగత్రలు పడిపోతూ ఏజెన్సీ వాసులను వణికించేస్తున్నాయి.

వాతావరణ శాఖ ప్రకారం అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలోని మినములూరులో రాష్ట్రంలోనే అత్యల్పంగా 4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తరువాత అరకులో 4.6 డిగ్రీల ఉష్ణోగ్రత, పాడేరులో 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. ఇంతటి చలి వాతావరణంలో మన్యంవాసులు అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నారు. ఇండ్లలో కూడా వాతావరణం వెచ్చగా ఉండేలా చూసుకుంటున్నారు. అదే విధంగా చలి నుంచి రక్షణ పొందేందుకు వెచ్చటి దుస్తులను ధరిస్తున్నారు. పొగ మంచు దట్టంగా కురుస్తున్న నేపథ్యంలో వాహనదారులు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. వాహనాల హెడ్ లైట్లను వేసుకొని నిదానంగా ప్రయాణించాలని స్పష్టం చేస్తున్నారు. లేదంటే పొగమంచు తేరుకున్న తరువాత ప్రయాణాలను సాగించాలని చెబుతున్నారు. అదే విధంగా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని తెలియజేస్తున్నారు. జలుబు, జ్వరం వంటివి ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు.

Next Story