పొత్తు పొడిచింది: వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసే ఎన్నికలకు వెళ్తాం: పవన్ కల్యాణ్

by Disha Web Desk 21 |
పొత్తు పొడిచింది: వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసే ఎన్నికలకు వెళ్తాం: పవన్ కల్యాణ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసే ఎన్నికలకు వెళ్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇది మా ఇద్దరి భవిష్యత్ కోసం కాదు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. వైసీపీని ధీటుగా ఎదుర్కోవాలంటే పొత్తు తప్పదు అని పవన్ కల్యాణ్ ప్రకటించారు. తమ మధ్య ఈ ములాఖత్ చాలా కీలకం అని పవన్ కల్యాణ్ ప్రకటించారు. 2024లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయి అని పవన్ కల్యాణ్ ప్రకటించారు. కలిసొచ్చే పార్టీలను కూడా కలుపుకుని పోటీ చేస్తాం అని పవన్ కల్యాణ్ ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్నది తన లక్ష్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగోవాలన్నదే తన ఆకాంక్ష అని పవన్ కల్యాణ్ ప్రకటించారు.వైఎస్ జగన్‌కు కేవలం ఆరు నెలలు మాత్రమే ఉందని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఈ ఆరు నెలల్లో వైసీపీ నాయకులు పద్ధతి మార్చుకోవాలని సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జనసేన-టీడీపీ కలిసే పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

బీజేపీ కలిసి వస్తుందనే నమ్మకం ఉంది

ఈ అంశంలో బీజేపీ కలిసి వస్తుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే బీజేపీ అధిష్టానం వద్ద తాను ఈ పొత్తుల అంశాన్ని తీసుకువెళ్లినట్లు తెలిపారు. అయితే రాష్ట్రంలో జరుగుతున్న ప్రతీది ప్రధాని నరేంద్రమోడీకి కేంద్ర నాయకత్వానికి తెలుసు అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. తన సినిమాలు ఆడనివ్వడం లేదు, తనను అడ్డుకుంటున్నారు.. రాష్ట్రంలో దోపిడీ పాలన జరుగుతుంది అనేది ప్రధాని నరేంద్రమోడీకి తెలుసునని చెప్పుకొచ్చారు. అయితే తాను అవి గుర్తుకు తెచ్చి వారి సమయాన్ని వృద్ధా చేయదలచుకోలేదని అన్నారు. సరైన సమయంలో బీజేపీ అధిష్టానం తమ పొత్తుకు సహకరిస్తుంది అని పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.తాను ఎన్డీఏలో ఉన్నానని అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన,బీజేపీ కలిసే వెళ్లాలన్నది తన అభిప్రాయమన్నారు. ఇదే అంశాన్ని తాను కేంద్ర ప్రభుత్వం దగ్గరకూడా పెట్టినట్లు తెలిపారు. వైసీపీ అరాచకత్వాన్ని దోపిడీలను ఎదుర్కోవాలంటే విడివిడిగా పోటీ చేస్తే సరిపోదని కాబట్టి టీడీపీ,బీజేపీ,జనసేనతో కలిసి వెళ్తే మంచిదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. లేని పక్షంలో మరో రెండు దశాబ్ధాలపాటు ఈ అరాచక పాలన కొనసాగుతుందని పవన్ కల్యాణ్ అన్నారు.

నాడు చంద్రబాబు, మోడికి మద్దతిచ్చా

నాలుగున్నరేళ్ల కాలంలో రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అరాచక పాలనలో భాగంగానే చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారని పవన్ కల్యాన్ ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడును రిమాండ్‌కు తరలించడం బాధాకరమన్నారు. ఇందులో భాగంగా తన సానుభూతి తెలియజేసేందుకే తాను చంద్రబాబును కలిసినట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడుకు, తనకు రాష్ట్రం బాగుండాలి, దేశ సమగ్రత చాలా బాగుండాలన్నదే తమ లక్ష్యం అని చెప్పుకొచ్చారు. జనసేన పార్టీని స్థాపించింది కూడా రాష్ట్ర భవిష్యత్ కోసమేనని తెలిపారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి న్యాయం చేయలేకపోయిందని అన్నారు. అందులో భాగంగానే సగటు మనిషిగా తాను జనసేన పార్టీని ఏర్పాటు చేసి ఆ సభలో తన ఆవేదనను వెళ్లగక్కినట్లు పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. అయితే రాష్ట్ర భవిష్యత్ కోసం నాడు నరేంద్రమోడీకి సంపూర్ణ మద్దతు తెలిపినట్లు తెలిపారు. దేశానికి బలమైన నాయకుడు కావాలనే ముఖ్య ఉద్దేశంతో తాను మోడీకి మద్దతుగా నిలిచినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. ముంబైలో ఉగ్రదాడి, పార్లమెంట్‌పై దాడిల నేపథ్యంలో దేశానికి బలవంతమైన నాయకుడు కావాలని తాను ఎదురుచూశానని ఆ నాయకత్వం నరేంద్రమోడీలో కనిపించిందన్నారు. నాడు బీజేపీకి మద్దతు తెలిపినందుకు తనను చాలా మంది వ్యతిరేకించారన్నారు. అయినప్పటికీ తాను వెనుకడుగు వేయలేదని చెప్పుకొచ్చారు. తాను పవన్ కల్యాణ్ పిలిస్తేనే తాను ఢిల్లీ వెళ్లానని చెప్పుకొచ్చారు. నవ్యాంధ్రప్రదేశ్‌కు బలమైన నాయకుడు కావాలనే ఉద్దేశంతోనే తాను చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నిలిచినట్లు వెల్లడించారు. విజన్ 2020 పేరుతో చంద్రబాబు వెళ్లడాన్ని తాను స్వాగతించినట్లు పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు అనుభవం,శక్తిసామర్థ్యాలు వెలకట్టలేనివి అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ నా లక్ష్యం

ప్రశ్నిస్తే వైసీపీ ప్రభుత్వం తట్టుకోలేకపోతుందని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతే ఎలా అని పవన్ కల్యాణ్ నిలదీశారు. ఏపీ సరిహద్దుల్లో తనను అడ్డుకుంటున్నారని ..ర్యాలీలకు అనుమతి లేదని ఇక ప్రజాస్వామ్యం ఏముందని పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ అరాచక పాలనను అంతమెుందించేందుకే తాను వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చనివ్వనని తాను ప్రకటించినట్లు తెలిపారు. వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చనివ్వను అని ప్రకటించడానికి కూడా వైసీపీయే కారణం అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. లేకపోతే తాను నేడు లోకేశ్, బాలకృష్ణ మధ్యలో తాను ఉండేవాడిని కాదన్నారు. వ్యక్తిగతంగా కలిసేవాడినని చెప్పుకొచ్చారు. కానీ వైసీపీ పాలనలో జరుగుతున్న దోపిడీని భరించలేక తాను వైసీపీవిముక్త ఆంధ్రప్రదేశ్‌కు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. గుజరాత్ ముంద్రా పోర్టులో టాస్క్ ఫోర్స్‌ పోలీసులు డ్రగ్స్‌ను సీజ్ చేస్తే దాని మూలాలు విజయవాడలోని సత్యనారాయణపురంలో ఉన్నట్లు తేలిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఈకేసులో ఇప్పటి వరకు నిందితులను ఎందుకు పట్టుకోలేదని పవన్ కల్యాణ్ నిలదీశారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ కేవలం రాజకీయ ప్రతీకార చర్య అని తెలిపారు.

Next Story