రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై ఆరోపణలు.. జనసేన విచారణ కమిటీ

by Thanuru Gopichand |

కొద్ది రోజుల ముందే జనసైనికులను హెచ్చరించిన జనసేనాని. అంతలోనే తెరపైకి వచ్చిన వివాదం.

రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై ఆరోపణలు.. జనసేన విచారణ కమిటీ
X

దిశ, వెబ్ డెస్క్ : రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ (Arava Sridhar) తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని.. పెళ్లి పేరుతో మోసం చేశాడని ఓ ప్రభుత్వ ఉద్యోగిని ఆరోపణలు చేసింది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వార్తా కథనాల్లో కూడా ప్రసారం అవుతున్నాయి. ఈ క్రమంలో జనసేన పార్టీకి నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. అయితే నిజానిజాలను తేల్చేందుకు జనసేన పార్టీ నిర్ణయించింది. అందుకోసం విచారణ కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు జనసేన (Janasena) అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ (P Hariprasad) పేరిట ఓ ప్రకటన వెలువడింది. రైల్వే కోడూరు (Railway Koduru) ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ప్రసార మాధ్యమాలలో వచ్చిన వార్తలు, ఒక మహిళ చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించిందని ఆ ప్రకటనలో హరిప్రసాద్ పేర్కొన్నారు. ఈ అంశంపై ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించినట్లు తెలిపారు. టి.శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, టిసి వరుణ్ కమిటీ సభ్యులుగా ఉన్నట్లు చెప్పారు. వారి ముందు అరవ శ్రీధర్ హాజరై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. కమిటీ సదరు ఆరోపణలపై నిజానిజాలు విచారించి తుది నివేదికను అందిస్తుందని ప్రకటించారు. నివేదిక పరిశీలించి, తుది నిర్ణయం వెలువడే వరకు అరవ శ్రీధర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.

ఇటీవలే హెచ్చరించిన జనసేనాని!!

జనవరి 22న అమరావతిలో పార్టీ నాయకులతో జరిగిన సమావేశానికి జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan kalyan) హాజరయ్యారు. వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో వ్యక్తుల మధ్య జరుగుతున్న ఘర్షణలు, ఆర్థిక లావాదేవీలు, మానసిక బలహీనతలు, వ్యక్తిగత కుల విభేదాలను జనసేనకు ఆపాదించడానికి కిరాయి వ్యక్తులు, మాధ్యమాలు కలిసి కుయుక్తులు పన్నుతున్నాయని పవన్ అన్నారు. ముఖ్యంగా వివాహేతర సంబంధాల రచ్చను కూడా పార్టీపై రుద్దాలని మార్గాలను అన్వేషిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి ప్రచారాలను తీవ్రంగా ఖండించవలసి ఉందని పార్టీ నేతలకు సూచించారు. ఆయన చెప్పి వారం కూడా గడవక ముందే రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వేధింపుల ఆరోపణలు రావడంతో పార్టీ శ్రేణుల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

Next Story