రైతులను మోసం చేస్తే చర్యలు తప్పవు : మంత్రి పార్థసారథి

by Thanuru Gopichand |

రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి (Minister Kolusu Parthasarathy) హెచ్చరించారు.

రైతులను మోసం చేస్తే చర్యలు తప్పవు : మంత్రి పార్థసారథి
X

దిశ, వెబ్ డెస్క్ : రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి (Minister Kolusu Parthasarathy) హెచ్చరించారు. కృష్ణా జిల్లా కరకంపాడులో (Karakampadu) మంత్రి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయట్లేదుని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దాని వల్ల తామంతా ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. దళారుల దోపిడీకి గురై నష్టపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని మంత్రి పార్థసారథి ముందు తమ గోడును వెల్లబోసుకున్నారు. దీంతో మంత్రి రైతుల పక్షాన స్పందించారు. వెంటనే కలెక్టర్, డీఎంలకు ఫోన్ చేసి వారితో మాట్లాడుతూ అసలు రైతు కేంద్రాల ద్వారా ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. రైతుల ఇబ్బందులను తేలికగా తీసుకోవడం సరికాదన్నారు. వారితో మోసపూరితంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి కొలుసు పార్థసారథి హెచ్చరించారు. తక్షణమే ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకొని.. రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా చూడాలని ఆదేశించారు. ఇప్పటి వరకు రూ.1250కి కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా ప్రైవేట్ వ్యాపారస్తులు తప్పనిసరిగా రూ.1550 చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధరలో, తూకంలో ఎటువంటి పొరపాట్లు దొర్లకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. రైతులకు మార్గదర్శనం చేస్తూ వారి పంటకు గిట్టుబాటు ధర దక్కేలా అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. కరకంపాడు రైతులు స్పందిస్తూ తక్షణ స్పందన, దృఢమైన నిర్ణయాలతో మంత్రి తమకు న్యాయం చేశారన్నారు. తమ కోసం తక్షణమే స్పందించి చర్యలు తీసుకున్నందుకు మంత్రి కొలుసు పార్థసారథికి ధన్యవాదాలను తెలియజేశారు.

Next Story