కరువు సీమలో పసిడి పంట

by velandi.Saikiran |

జొన్నగిరి, పగిడిరాయి ప్రాంతాలు వజ్రాలకు ప్రసిద్ధి. అలాంటి వజ్రాల భూమిలో బంగారు గని పడటం విశేషం.

కరువు సీమలో పసిడి పంట
X

కరువు సీమలో పసిడి పంట

– కర్నూలు జిల్లా జొన్నగిరి ప్రాంతంలో పుష్కలంగా బంగారం నిల్వలు

– జియో మైసూర్‌ కంపెనీ ఆధ్వర్యంలో వెలికితీతకు చర్యలు

– వచ్చే నెలలో ఏపీలో తొలి ప్రైవేట్‌ బంగారు గనిని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

– ప్రత్యక్షంగా, పరోక్షంగా 850 మంది యువతకు ఉపాధికి అవకాశాలు

దిశ, ఏపీ బ్యూరో : దశాబ్దాల కాలంగా ప్రభుత్వ రంగ సంస్థలకే పరిమితమైన బంగారు గనుల తవ్వకాల్లోకి ఇప్పుడు ప్రైవేట్‌ రంగం అడుగుపెట్టింది. వచ్చే నెలలో కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి వద్ద ఈ ప్రతిష్టాత్మక ప్రైవేట్‌ బంగారు గనిని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. భారతదేశంలో బంగారు తవ్వకం రంగంలోకి ప్రైవేటు రంగం చేపట్టిన ఒక ప్రధాన ముందడుగుగా ఈ ప్రాజెక్టు నిలవనుంది.

కరువు సీమలో పసిడి పంట పండనుంది. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని ఆ మూడు గ్రామాలకు బంగారు కల సంతరించుకోనుంది. నిరుద్యోగంతో అల్లాడుతున్న యువతకు ఉపాధి దొరకనుంది. తుగ్గలి మండలంలోని జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి గ్రామాల పరిధిలో ఈ బంగారు గని విస్తరించి ఉంది. ఇక్కడ బంగారు నిలవలను గుర్తించిన ప్రభుత్వం ‘జియో మైసూర్‌ సర్వీసెస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌’ అనే ప్రైవేట్‌ కంపెనీకి వాటిని వెలికి తీసేందుకు అనుమతులిచ్చింది. ఇందులో డెక్కన్‌ గోల్డ్‌ మైన్స్‌ లిమిటెడ్‌ (డీజీఎంఎల్‌)కు వాటా ఉంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మే నెలలో భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేటు బంగారు గని ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమవుతోంది.

జొన్నగిరి ప్రాజెక్ట్‌ విశేషాలు..

ఈ ప్రాజెక్టును ‘జియో మైసూర్‌ సర్వీసెస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌’ అభివృద్ధి చేస్తోంది. వాస్తవానికి 2006లోనే మైనింగ్‌ అనుమతులు పొందినప్పటికీ, ఆ ప్రాంతంలోని బంగారు నాణ్యతను అంచనా వేయడానికి, వాణిజ్య పరమైన సాధ్యాసాధ్యాలను నిర్ధారించడానికి కంపెనీకి 19 సంవత్సరాలు పట్టింది. ఈ కాలంలో ఖనిజ ధాతువును శుద్ధి చేయడానికి, నాణ్యతను నిర్ధారించడానికి ఒక మినీ ప్లాంట్‌ను నిర్మించారు. ఆ తర్వాత పూర్తిస్థాయి ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించారు. ఈ బంగారు నిక్షేపాలున్న గని సుమారు 598 హెక్టార్ల విస్తీర్ణంలో జొన్నగిరి, ఎర్రగుడి–పగిడిరాయి గ్రామాల పరిధిలో విస్తరించి ఉంది. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ. 400 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారు. 15ఏళ్ల పాటు ఏడాదికి సుమారు 1,000 కిలోల (1 టన్ను) స్వచ్ఛమైన బంగారాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2027 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 600కేజీల బంగారం ఉత్పత్తి చేయాలని టార్గెట్‌ పెట్టుకున్నారు. ప్రస్తుతం గనిలో 13.1 టన్నులు నిల్వలున్నట్లు ధ్రువీకరించారు. అన్వేషణ ప్రకారం ఇది 42.5 టన్నుల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. జొన్నగిరి కేవలం బంగారానికే కాదు, ప్రాచీన కాలం నుండి వజ్రాలకు కూడా ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రాంతం.

బంగారు గనులు అంటే ఏమిటి?

భూమి పొరల్లో బంగారం నేరుగా బిస్కెట్లు లేదా ఆభరణాల రూపంలో దొరకదు. కోట్లాది సంవత్సరాల క్రితం భూగర్భంలో జరిగిన భౌగోళిక మార్పుల వల్ల బంగారం ఇతర ఖనిజాలతో కలిసి ధాతువు(ఓర్‌) రూపంలో రాళ్ళలో నిక్షిప్తమై ఉంటుంది. ఇలా పసిడి నిల్వలు అధికంగా ఉన్న రాళ్ళ పొరలను గుర్తించి, వాటిని వెలికితీసే ప్రాంతాలనే బంగారు గనులు అంటారు.

పసిడి ప్రాసెసింగ్‌ ఇలా..

బంగారాన్ని గని నుండి వెలికితీసి, మన చేతికి వచ్చే ఆభరణంగా మార్చడం వెనుక ఒక పెద్ద శాస్త్రీయ ప్రక్రియ ఉంటుంది. జొన్నగిరిలో ‘ఓపెన్‌ పిట్‌’ పద్ధతిలో రాళ్ళను తవ్వి తీస్తారు. అంటే భూమి ఉపరితలం నుండి లోతుగా గుంతలు తవ్వుకుంటూ వెళ్తారు. గనుల నుండి తీసిన పెద్ద పెద్ద రాళ్ళను భారీ యంత్రాల (క్రషింగ్‌–గ్రైండింగ్‌) ద్వారా పిండిలా మారుస్తారు. అనంతరం లీచింగ్‌ ప్రక్రియలో ఈ పొడిని కెమికల్స్‌ (ముఖ్యంగా సైనైడ్‌ ద్రావణం) కలిపిన నీటిలో ఉంచుతారు. ఈ రసాయనం రాళ్ళలోని బంగారాన్ని తనలో కరిగించుకుంటుంది. దీనిని ‘కార్బన్‌–ఇన్‌–లీచ్‌’ ప్రక్రియ అని కూడా అంటారు. ద్రావణంలో కరిగి ఉన్న బంగారాన్ని విద్యుత్‌ (ఎలక్ట్రోవిన్నింగ్‌) ప్రక్రియ ద్వారా వేరు చేసి, ముడి బంగారంగా మారుస్తారు. ఆ తర్వాత స్మెల్టింగ్‌–రిఫైనింగ్‌ ప్రక్రియ ద్వారా ఆ ముడి బంగారాన్ని అధిక ఉష్ణోగ్రత వద్ద కరిగించి, అందులోని ఇతర మలినాలను తొలగిస్తారు. చివరగా 99.9 శాతం స్వచ్ఛమైన గోల్డ్‌ బిస్కెట్లు తయారవుతాయి.

ఏటా ఎనిమిది వందల టన్నుల బంగారం దిగుమతి..

భారతదేశం ఏటా సుమారు 800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. మన దేశంలో ప్రస్తుతం కర్ణాటకలోని హట్టి గోల్డ్‌ మైన్స్‌ మాత్రమే ప్రధాన ఉత్పత్తిదారుగా ఉంది. ఈ తరుణంలో ఏపీలోని జొన్నగిరి గని అందుబాటులోకి రావడం వల్ల దిగుమతులపై భారం తగ్గడమే కాకుండా, స్థానికంగా వందలాది మందికి ఉపాధి లభించనుంది. రాయలసీమ గడ్డపై మళ్ళీ పసిడి సిరి మెరవబోతుండటం రాష్ట్ర పారిశ్రామిక రంగానికి ఒక మైలురాయిగా నిలవనుంది.

వజ్రాల భూమిలో బంగారు గని..

జొన్నగిరి, పగిడిరాయి ప్రాంతాలు వజ్రాలకు ప్రసిద్ధి. అలాంటి వజ్రాల భూమిలో బంగారు గని పడటం విశేషం. ప్రతి ఏటా తొలకరి వర్షాలు పడగానే ఇక్కడ వజ్రాలు బయటపడతాయి. దీంతో రైతులు, రైతు కూలీలు అక్కడికి చేరుకుని వజ్రాల వేట ప్రారంభిస్తారు. ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి చద్దిగట్టుకుని వచ్చి మరి జొన్నగిరి పొలాల్లో వజ్రాల వేట సాగిస్తారు. ఏ ఒక్క చిన్న వజ్రం దొరికినా తమ బతుకు బాగుపడుతుందని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఇలా అదృష్టాన్ని పరీక్షించుకున్న వారిలో చాలా మందికి వజ్రాలు దొరకడం ఏటా చూస్తూనే ఉన్నాం. అయితే ఆ దొరికిన వజ్రాలను రైతుల నుంచి గుర్తు చప్పుడు కాకుండా కొంతమంది వ్యాపారులు అతి చౌకగా కొనుగోలు చేస్తున్నారు. అనంతపురం జిల్లా గుత్తికి చెందిన కొంతమంది వ్యాపారులు రైతులకు దొరికిన వజ్రాలను కొనుగోలు చేస్తున్నారు. అలాంటి వజ్రాల భూమిలో ఇప్పుడు బంగారు నిల్వలు వెలికి తీయడం విశేషంగా చెప్పవచ్చు. అందుకే ఇప్పుడు ఈ ప్రాంత వాసులు తమది వజ్రాల భూమే కాదు బంగారు భూమి అని కూడా గర్వంగా చెప్పుకుంటున్నారు.

ఉపాధి, మౌలిక సదుపాయాలు..

ఈ ఫ్యాక్టరీ 350 మందికి ప్రత్యక్ష ఉపాధిని, మరో 500 మందికి పరోక్ష ఉపాధిని కల్పిస్తుంది. దీని నీటి అవసరాలను తీర్చడానికి హంద్రీనీవా కాలువ నుండి ఫ్యాక్టరీ ప్రాంగణం వరకు 18 కిలోమీటర్లు పైప్‌లైన్‌ను నిర్మించారు.

Next Story