- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైసీపీ నేత ఇంటి ఈత కొలనులో పడి యువకుడు మృతి
మాజీ ఎంపీ, వైసీపీ కీలక నేత మోదుగుల వేణుగోపాల రెడ్డి (YCP Leader Modugula Venugoapal Reddy) నివాసంలో విషాదం చోటుచేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : మాజీ ఎంపీ, వైసీపీ కీలక నేత మోదుగుల వేణుగోపాల రెడ్డి (YCP Leader Modugula Venugoapal Reddy) నివాసంలో విషాదం చోటుచేసుకుంది. గుంటూరు నగర పరిధిలోని ఆయన నివాసంలో ఉన్న ఈత కొలనులో పడి హర్షవర్ధన్ అనే యువకుడు మృతి (Youth Death) చెందడం కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. మృతుడు హర్షవర్ధన్ తన తల్లితో కలిసి గత కొంతకాలంగా మోదుగుల నివాసంలోనే పని చేస్తున్నాడు. ఈ క్రమంలో స్విమ్మింగ్ పూల్‌ను శుభ్రం చేయడానికి వెళ్లిన హర్షవర్ధన్, ప్రమాదవశాత్తూ అందులో జారిపడి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. గమనించిన తోటి సిబ్బంది వెంటనే అతడిని బయటకు తీసి, అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే హర్షవర్ధన్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిరుపేద కుటుంబానికి చెందిన యువకుడు పని చేస్తూ మరణించడంతో బాధిత కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న నల్లపాడు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈత కొలనులో పడటం వల్ల నీరు ఊపిరితిత్తుల్లోకి చేరి, ఊపిరాడక హర్షవర్ధన్ మరణించినట్లు పోలీసులు తమ ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది? దీని వెనుక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారని తెలుస్తోంది. మోదుగుల వేణుగోపాల రెడ్డి వంటి ప్రముఖ నేత ఇంట్లో ఈ ఘటన జరగడంతో స్థానికంగా ఇది చర్చనీయాంశంగా మారింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును లోతుగా విచారిస్తున్నారు.






