- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరుస్తూ విజయనగరం (Vizianagaram) జిల్లాలోని భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం (Bhogapuram Greenfield International Airport) ఆదివారం చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. ఢిల్లీ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా వ్యాలిడేషన్ (Trail Run) విమానం ఉదయం 11 గంటల సమయంలో రన్‌వేపై సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ప్రత్యేక విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇతర ఉన్నతాధికారులతో కలిసి విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే వాటర్ సెల్యూట్‌తో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) హర్షం వ్యక్తం చేస్తూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ విజయం ఏపీ విమానయాన రంగంలో సరికొత్త మైలురాయి అని ఆయన తన పోస్టులో అభివర్ణించారు. 2014-19 ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టుకు బీజం పడిందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో నేడు ఇది సాకారమవుతోందని ఆయన పేర్కొన్నారు.
జూన్ నాటికి పూర్తి స్థాయిలో...
సుమారు 2,203 ఎకరాల్లో రూ. 4,592 కోట్ల భారీ వ్యయంతో జిఎంఆర్ (GMR) సంస్థ ఈ విమానాశ్రయాన్ని అత్యంత అత్యాధునిక సాంకేతికతతో నిర్మిస్తోంది. ఇప్పటికే దాదాపు 95 శాతానికి పైగా పనులు పూర్తికాగా, 3.8 కిలోమీటర్ల పొడవైన రన్‌వేపై భారీ విమానాలు కూడా సులభంగా రాకపోకలు సాగించగలవు. ఈ విమానాశ్రయానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును ప్రభుత్వం ఖరారు చేసింది. జూన్ 2026 నుంచి పూర్తిస్థాయి వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయని, ఇది ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చడమే కాకుండా వేలాది మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది. ఐటీ పార్కులు, ఏవియేషన్ హబ్‌ల ఏర్పాటుతో విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాలు అంతర్జాతీయ స్థాయిలో పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందనున్నాయని పేర్కొంది.






