- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కదనరంగంలో కమ్యూనికేషన్ కింగ్.. లోకేశ్ 3.0 అంచనాలు ఇవే!
తెలుగుదేశంలో సరికొత్త శకానికి నాంది పడింది. ఇన్నాళ్లూ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేశ్.. ఇప్పుడు 'జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్' అనే శక్తివంతమైన హోదాలో బాధ్యతలు చేపట్టారు...

దిశ, వెబ్ డెస్క్: తెలుగుదేశంలో సరికొత్త శకానికి నాంది పడింది. ఇన్నాళ్లూ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేశ్.. ఇప్పుడు 'జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్' అనే శక్తివంతమైన హోదాలో బాధ్యతలు చేపట్టారు. కేవలం చంద్రబాబు కుమారుడు అనే ముద్ర నుంచి పార్టీని క్షేత్రస్థాయి నుంచి నడిపించే సమర్థుడైన నాయకుడిగా లోకేశ్ ఎలా ఎదిగారు?. రాబోయే రోజుల్లో ఆయన పని తీరు ఎలా ఉండబోతోంది?. అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
యువగళం' పాదయాత్రకు ముందు...
లోకేశ్ రాజకీయ జీవితాన్ని 'యువగళం' పాదయాత్రకు ముందు, తర్వాత అని చెప్పుకోవచ్చు. 3,132 కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్రలో ఆయన కేవలం ప్రజల కష్టాలను వినడమే కాదు, పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. క్షేత్రస్థాయిలో ఏ గ్రామంలో ఏ కార్యకర్త గట్టిగా నిలబడుతున్నారో ఆయనకు ఇప్పుడు కొట్టిన పిండి. ఈ అనుభవం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయడంలో ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఇక లోకేశ్ పనితీరులో కార్పొరేట్ శైలి స్పష్టంగా కనిపిస్తుంది. డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం, ఐటీడీపీ (iTDP) ద్వారా సోషల్ మీడియాను అస్త్రంగా మార్చుకోవడం ఆయన ప్రత్యేకత. పని చేసేవారికే పదవులు, లేదంటే నిర్మొహమాటంగా పక్కన పెట్టడం అనే పద్ధతిని ఆయన అమలు చేస్తున్నారు. ఇది పార్టీలో జవాబుదారీతనాన్ని పెంచుతోంది.
ఆధునిక రాజకీయాల దిశగా..
ప్రస్తుతం లోకేశ్ 'TDP 3.0' పేరుతో పార్టీని ఆధునిక రాజకీయ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. పార్టీ కమిటీల్లో 33 శాతం యువతకు, మహిళలకు అవకాశం ఇవ్వాలన్న ఆయన ప్రతిపాదన అమలులోకి వస్తోంది. క్లస్టర్, యూనిట్ ఇన్-చార్జ్ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా పార్టీని ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పరిపాలనపై దృష్టి సారిస్తుంటే, పార్టీ వ్యవహారాల పూర్తి బాధ్యతను లోకేశ్ భుజాన వేసుకున్నారు. ఇది ఒక రకంగా చంద్రబాబుపై భారాన్ని తగ్గించడమే కాకుండా, సెకండ్ లైన్ లీడర్‌షిప్ విషయంలో క్యాడర్‌కు ఉన్న సందేహాలను పటాపంచలు చేసింది. ముఖ్యంగా కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారిని 'రెడ్ బుక్' ద్వారా గుర్తించి, వారికి న్యాయం చేస్తామన్న భరోసా ఇవ్వడం కార్యకర్తల్లో ఆయనపై నమ్మకాన్ని పెంచింది.
సవాళ్లు కూడా ఉన్నాయి!
పదవి పెరిగిన కొద్దీ బాధ్యతలు, సవాళ్లు కూడా పెరుగుతాయి. 2029 ఎన్నికల నాటికి పార్టీని మరింత శక్తివంతంగా మార్చడం, మిత్రపక్షాలతో సమన్వయం చేసుకోవడం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం లోకేశ్ ముందున్న ప్రధాన లక్ష్యాలు. మొత్తానికి నారా లోకేశ్ నియామకం అనేది కేవలం 'వారసత్వ' పదవి కాదు.. అది ఆయన పడ్డ కష్టానికి, కార్యకర్తల్లో సంపాదించుకున్న అంగీకారానికి లభించిన గుర్తింపు. ఇప్పుడు ఆయన ముందున్న ఏకైక లక్ష్యం.. అటు పరిపాలనలో మంత్రిగా, ఇటు పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తన మార్క్ చూపించడమే!






