విశాఖ కైలాసగిరిపై సరికొత్త అట్రాక్షన్.. 65 అడుగుల భారీ ‘త్రిశూలం’ ఏర్పాటు

by Ramesh Naini |

పర్యాటక కేంద్రమైన విశాఖపట్నంలోని కైలాసగిరిపై మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది.

విశాఖ కైలాసగిరిపై సరికొత్త అట్రాక్షన్.. 65 అడుగుల భారీ ‘త్రిశూలం’ ఏర్పాటు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పర్యాటక కేంద్రమైన విశాఖపట్నంలోని కైలాసగిరిపై మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. పర్యాటకులను విశేషంగా ఆకర్షించేందుకు వీఎంఆర్‌డీఏ (VMRDA) సుమారు రూ.2.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ‘త్రిశూల్‌ ప్రాజెక్టు’ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన 65 అడుగుల భారీ త్రిశూలాన్ని శనివారం రాష్ట్ర మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్‌, విశాఖ ఎంపీ శ్రీభరత్‌లు ఘనంగా ప్రారంభించారు.

త్రిశూలం ప్రత్యేకతలు ఇవే..

ఈ త్రిశూలం మొత్తం ఎత్తు 65 అడుగులు. దీనికి అమర్చిన శివుని ఢమరుకం 10 అడుగుల ఎత్తు, 18 అడుగుల వెడల్పుతో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. సుమారు రూ. 2.5 కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ భారీ త్రిశూలాన్ని పూణేకు చెందిన ప్రత్యేక శిల్పులు ఎంతో నైపుణ్యంతో తీర్చిదిద్దారు. పగటిపూట మాత్రమే కాకుండా రాత్రి సమయంలోనూ పర్యాటకులను ఆకర్షించేలా త్రిశూలం లోపల ప్రత్యేక ఎల్‌ఈడీ (LED) దీపాలను అమర్చారు. చీకట్లో ఈ విద్యుత్ కాంతులు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తాయి. సముద్ర తీర ప్రాంతం కావడంతో విశాఖలో తరచూ వచ్చే తుపాన్లు, ప్రచండ గాలులను సైతం తట్టుకుని నిలబడేలా అత్యంత పటిష్టంగా దీని నిర్మాణం చేపట్టారు.

ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ వేపాడ చిరంజీవి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణు కుమార్‌రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్‌, పంచకర్ల శ్రీనివాస్‌, లోకం మాధవి, వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌ ప్రణవ్‌ గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. కైలాసగిరిపై ఇప్పటికే శివపార్వతుల భారీ విగ్రహాలు ఉండగా, తాజాగా ఈ నూతన త్రిశూల ఏర్పాటుతో పర్యాటకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Next Story