ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి ఇది ఒక చారిత్రాత్మక మైలురాయి : సీఎం చంద్రబాబు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-03 06:36:59  IST  )

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో.. ప్రధాని నరేంద్రమోదీ కీలక వాణిజ్య ఒప్పందాన్ని విజయవంతంగా పూర్తిచేయడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి ఇది ఒక చారిత్రాత్మక మైలురాయి : సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో.. ప్రధాని నరేంద్రమోదీ కీలక వాణిజ్య ఒప్పందాన్ని విజయవంతంగా పూర్తిచేయడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ పై అమెరికా విధించిన 25 శాతం టారిఫ్ లను 18 శాతానికి తగ్గించడంతో ఇర దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు.

ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అమెరికాతో ప్రధాని మోదీ ట్రేడ్ డీల్ సక్సెస్.. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని కొనియాడారు. అమెరికాతో ఈ కీలక వాణిజ్య ఒప్పందాన్ని విజయవంతంగా పూర్తిచేసిన ప్రధాని మోదీకి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. సుంకాలను 18 శాతానికి తగ్గించడం దూరదృష్టితో తీసుకున్న నిర్ణయమని పేర్కొన్నారు. ఇది ప్రపంచంలోని రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తూ, ప్రపంచ ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రధానమంత్రి నాయకత్వంలో భారత్.. గ్లోబల్ ఆర్థిక శక్తిగా తన స్థానాన్ని మరింత బలపరుస్తుందన్నారు. ఈ ఒప్పందం భారత ఎగుమతులకు పోటీ సామర్థ్యాన్ని పెంచి, యువతకు, రైతులకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని వారికి విస్తృత అవకాశాలు కల్పించనుందని సీఎం చంద్రబాబు ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.

ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. ప్రధాని మోడీ దిశానిర్దేశం

Next Story