ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిపై వేటు

90
Prasad

దిశ, స్పోర్ట్స్: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కార్యదర్శి వి. దుర్గాప్రసాద్ అధికారాల్లో కోత విధిస్తూ అంబుడ్స్‌మెన్ జస్టిస్ జి. క్రిష్ణమోహన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై ఏసీఏ కార్యదర్శి హోదాల్లో ఎలాంటి కార్యక్రమాల్లో అతడు పాల్గొనకూడదని.. ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ ఇంచార్జి కార్యదర్శిని నియమించుకోవాలని అంబుడ్స్‌మెన్ ఆ ఉత్తర్వుల్లో పాల్గొన్నారు. కృష్ణాజిల్లా క్రికెట్ అసోసియేషన్ (కేడీసీఏ) దాని అనుబంధ క్లబ్స్‌లో లోధా కమిటీ సంస్కరణలు అమలు చేయడంలో సమస్యలు ఉన్నాయని.. ఇక్కడ వాటిని అమలు చేయలేమని గతంలో వి. దుర్గా ప్రసాద్ ఏసీఏ అపెక్స్ కౌన్సిల్‌ను సంప్రదించారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బీసీసీఐ, దాని అసోసియేషన్ల పరిధిలోని అన్ని సంస్థలు తప్పకుండా లోధా సంస్కరణలు అమలు చేయాల్సి ఉన్నది. కానీ కేడీసీఏ జాయింట్ సెక్రటరీగా ఉన్న వి దుర్గా ప్రసాద్ అమలు చేయడం లేదని జిల్లా ఉపాధ్యక్షుడు వి. ప్రభు ప్రసాద్ అపెక్స్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును అంబుడ్స్‌మెన్‌కు పంపించగా.. సంస్కరణలు అమలు చేయాలని అప్పటి వరకు ఎన్నికలు నిలిపివేయాలని ఆదేశించారు. అయితే వి.దుర్గా ప్రసాద్ అంబుడ్స్‌మెన్‌కు ఏమి అధికారం ఉందని ప్రశ్నిస్తూ.. ఎన్నికల నిర్వహణకు పూనుకున్నారు. దీంతో క్రమశిక్షణ ఉల్లంఘన కింద దుర్గాప్రసాద్‌కు కార్యదర్శిగా ఉన్న అధికారాలన్నింటినీ తీసేస్తూ అంబుడ్స్‌మెన్ ఉత్తర్వులు జారీ చేసింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..