రూ. 3,000 వరకు ధరలు పెంచిన హీరో మోటోకార్ప్!

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన వాహనాల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది..Latest Telugu News

Update: 2022-06-23 13:11 GMT

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన వాహనాల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. విడి భాగాల ధరలు క్రమంగా పెరుగుతుండడంతో పాటు మొత్తం ద్రవ్యోల్బణ ప్రభావాన్ని అధిగమించేందుకు మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను రూ. 3,000 వరకు పెంచుతున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. వాహనాల తయారీలో ఉత్పత్తి వ్యయం కూడా భారంగా మారిందని, అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో పెంపు నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. పెంచిన ధరలు జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయని, ఈ పెంపు ఎంపిక చేసిన మోడల్, ప్రాంతాన్ని బట్టి ఉంటుందని పేర్కొంది. అయితే, ఏ మోడల్ బైకుపై ఎంత మొత్తం పెంపు ఉంటుందనే విషయంలో కంపెనీ స్పష్టత ఇవ్వలేదు. ద్రవ్యోల్బణ పరిస్థితుల వల్ల ముడి సరుకు ఖర్చులు పెరగడంతోనే ధరలు పెంచామని కంపెనీ వివరించింది.

కాగా, గత కొన్ని వారాలుగా వాహనాల ఉత్పత్తి వ్యయం పెరిగిన నేపథ్యంలో పలు కంపెనీలు వాహనాల ధరలు పెంచాయి. ఇప్పటికే దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకి ఏప్రిల్‌లో ధరలను పెంచింది. ఇప్పుడు హీరో మోటోకార్ప్ ధరలు పెంచడంతో మరిన్ని కంపెనీలు ఇదే బాటలో కొనసాగవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Similar News