అభ్యర్థుల ఖర్చులపై నిఘా...!

పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోటీలో ఉన్న అభ్యర్థుల ప్రచార ఖర్చు లపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది.

Update: 2024-05-08 02:13 GMT

దిశ, హుజూరాబాద్ రూరల్ : పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోటీలో ఉన్న అభ్యర్థుల ప్రచార ఖర్చు లపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. ఎన్నికల సంఘం అభ్యర్థుల పరిమితిని రూ.95లక్షలుగా నిర్ణయించింది. నామినేషన్ వేసిన నాటి నుంచి ఫలితాలు వచ్చే వరకు ఈసీ నియమించిన పరిశీలకులు ఎప్పటికప్పుడు నిఘా పెడుతూ లెక్కిస్తున్నారు. అభ్యర్థి తన ఎన్నికల ప్రచారం కోసం ఖర్చు పెడుతున్న డబ్బుకు నిబంధనలకు అనుగుణంగా లెక్కిస్తున్నారు. సమావేశాలు, ర్యాలీలు, ప్రకటనలు, వాల్ పోస్టర్లు, కరపత్రాలు, ఫ్లెక్సీలు, వాహనాలకు సంబంధించి తదితర వాటి వ్యయాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది.

మార్కెట్ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్న దృష్ట్యా ఖర్చులను అంచనా వేయడానికి ఎన్నికల కమిషన్ ధరల ద్రవ్యోల్బణాన్ని సూచికగా తీసుకుంటున్నట్లు తెలిసింది. పోటీలో ఉన్న అభ్యర్థి ఏదైనా ప్రాంతీయ బ్యాంకు ఖాతా తెరిచి దాని ద్వారా లావాదేవీలు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన 30 రోజుల్లోపు అభ్యర్థులు తమ ఖర్చు వివరాలను బిల్లులతో సహా అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది. లేదంటే అభ్యర్థిపై వేటు పడే అవకాశం ఉంది.

పక్కాగా నజర్..

ఎన్నికలలో పారదర్శకత ఉండేందుకు ఎన్నికల కమిషన్ అభ్యర్థులు చేస్తున్న ఖర్చుపై పక్కాగా నిఘా పెట్టింది. ప్రతిరోజు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎక్కడెక్కడ ప్రచారాలు నిర్వహిస్తున్నారు.? ఎంత ఖర్చు చేస్తున్నారనే దానిపై ఎప్పటికప్పుడు ఈసీ వ్యయ పరిశీలనతో పాటు కేంద్రం, రాష్ట్ర ఎన్ ఫోర్స్‌మెంట్, ఫ్లైయింగ్ స్క్వాడ్, నిఘా బృందాలు, వీడియో సర్వే లైన్స్ బృందాలు, సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తున్నాయి. అలాగే అభ్యర్థుల ఖర్చులను పరిశీలించేందుకు ఆడిట్ బృందాలను కూడా ఏర్పాటు చేసింది. ఆయా పార్టీల అభ్యర్థులు నిర్వహించే సభ లతోపాటు ర్యాలీలు, రోడ్డు షోలలో ఖర్చు చేసే ప్రతి రూపాయి ఖర్చును లెక్కిస్తారు. ఎన్నికల కమిషన్ ఇంత తతంగం చేస్తున్నా ఎన్నికలంటే విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి ఓటర్లను మభ్యపెడుతూ తమ వైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు శతవిధాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అభ్యర్థులు ఖర్చులపై పరిణితి కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నారనే విషయంపై ఎన్నో అనుమానాలు ఉన్నా ఎన్నికల కమిషన్ లోతుగా పరిశీలన చేయలేక పోతుందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

పరిమితి దాటుతున్న ఖర్చు..

ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థులు వ్యయానికి సంబంధించిన నియమాలను పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సంఘం విధించిన నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. ఈతరం రాజకీయ నాయకులు మరో అడుగు ముందుకేసి ఓటుకు రేటు నిర్ణయిస్తున్నారు. స్వచ్ఛందంగా వినియోగించుకోవాల్సిన ఓటు అనే ఆయుధాన్ని రాజకీయ పార్టీలు అంగట్లో సరుకులాగా మార్చేస్తున్నాయి. అభ్యర్థి ఖర్చు నిర్దేశించిన పరిమితికి మించి ఉంటే అది 1961 ఎన్నికల నియామవళి నిబంధన 90ను ఉల్లంఘించినట్లే. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 123(6) ప్రకారం అక్రమంగా వ్యయ్యం చేసినట్లు గుర్తిస్తారు. గత పార్లమెంట్ ఎన్నికల వ్యయాన్ని పోలిస్తే ఈసారి 50శాతం పెరిగినట్టు అభ్యర్థులు ఖర్చు చేస్తున్న దాన్ని బట్టి చూస్తే తెలుస్తుందని పరిశీలకులు పేర్కొంటున్నారు.

Similar News