వైసీపీ అధికారులపై ఫిర్యాదుల పర్వం

అధికార వైసీపీకి భక్తులైన అధికారులపై కూటమి పక్షాలు గళం విప్పుతున్నాయి.

Update: 2024-05-08 02:25 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: అధికార వైసీపీకి భక్తులైన అధికారులపై కూటమి పక్షాలు గళం విప్పుతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఎటువంటి జంకు లేకుండా అధికార పార్టీ నేతల ఆదేశాలు పాటిస్తున్న కొందరు అధికారుల వైఖరి కూటమి పక్షాల అభ్యర్థులు, నేతలకు ఇబ్బందికరంగా తయారైంది. దీంతో ఇంతకాలం మౌనంగా వున్న కూటమి అభ్యర్థులు, నేతలు ఫిర్యాదులు చేయడంతో పాటు బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారు.

సీఎం రమేష్ ఇచ్చిన ధైర్యంతో..

అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ పై ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు స్వగ్రామంలో ఆయన అనుచరులు దాడికి దిగిన ఘటన ఏకంగా రాష్ర్ట డీజీపీ మార్పుకే దారి తీసింది. పోలీసు జీప్ లో పోలీసు రక్షణలో తనపై దాడి జరగడాన్ని సీఎం రమేష్ తీవ్రంగా పరిగణించడంతో బదిలీ తప్పలేదు. చివరకు ముఖ్యమంత్రి జగన్ సైతం అధికారులను ఇష్టానుసారం మార్చేస్తే ఎన్నికల సక్రమంగా జరుగుతాయనే నమ్మకం సన్నగిల్లుతుందని వ్యాఖ్యానించారు.

నర్సీపట్నం ఆర్డీవో చిన్ని కృష్ణపై అయ్యన్న ఫైర్

నర్సీపట్నం ఆర్డీవో చిన్ని కృష్ణపై మాజీ మంత్రి, నర్సీపట్నం టీడీపీ అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. మంగళవారం ఇందుకోసమే ప్రచారం మాని విశాఖ వచ్చిన ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పోస్టల్ బ్యాలెట్ లో పోలింగ్ లో అధికార పార్టీకి వంతపాడిన ఆర్డీవో పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

నార్త్ ఏసీపీ సునీల్‌ను మార్చండి

విశాఖ పోలీసు కమిషనరేట్ పరిధిలోని నార్త్ ఏసీపీ సునీల్ పెద్ద ఎత్తున అధికార పార్టీకి కొమ్ము కాస్తూ కూటమి పక్షాలను ఇబ్బందుల పాల్జేస్తుండడంతో ఫిర్యాదులు వెళ్లాయి. గతంలో అనకాపల్లి డీఎస్పీ గా ఉండగా గంజాయి స్మగ్లింగ్ కారును సీజ్ చేసి అదే కారును నిబంధనలకు విరుద్ధంగా వాడుకొంటూ సస్పెండ్ అయ్యారు. రాయలసీమకు చెందిన వ్యక్తి కావడంతో ప్రభుత్వంలో పైరవీలు చేసి కీలకమైన విశాఖలో పోస్ట్ సంపాదించి తమను ఇబ్బంది పెడుతున్నారని కూటమి నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తక్షణమే తప్పించాలని కోరారు.

పీడీ పాపునాయుడుపై ఫిర్యాదుల పరంపర

జీవీఎంపీ యూసీడీ పీడీ పాపు నాయుడుపై పలు ఫిర్యాదులు జిల్లా కలెక్టర్ తో పాటు ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల వెళ్లాయి. మంత్రి బొత్స అనుచరుడిగా ముద్ర పడిన పాపు నాయుడు వైసీపీ అభ్యర్థులకు అనుకూలంగా డ్వాక్రా సంఘాలతో పని చేయించడం వివాదాస్పదంగా మారింది. దానిపై విచారణ జరిగి క్రింది స్థాయి అధికారులను సస్పెండ్ చేశారు.

Similar News