స్టిక్కరింగ్ తో బెల్ట్ షాపులకు మద్యం సరఫరా

మద్యం వ్యాపారులు నిబంధనలను తుంగలో తొక్కి సిండికేట్ ఏర్పడి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు.

Update: 2022-12-09 15:25 GMT

దిశ, వర్థన్నపేట : మద్యం వ్యాపారులు నిబంధనలను తుంగలో తొక్కి సిండికేట్ ఏర్పడి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. మద్యం వ్యాపారుల కనుసన్నుల్లోనే జోరుగా నడుస్తున్నాయి. రిటైల్ షాపుల్లో ఎమ్మార్పీకి మించి అమ్మకాలు జరుగుతున్నాయి. వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎక్సైజ్ శాఖ పరిధిలోని సంగెం మండలం లోగల శ్రీ సాయి వైన్స్, పర్వతగిరి మండల కేంద్రంలోని భద్రకాళి వైన్స్ హన్మకొండ జిల్లా అయినవోలు మండల కేంద్రంలోని మల్లికార్జున వైన్స్ ఖీలా వరంగల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నడుస్తుంది. ఒక్కొక్క వైన్ షాప్ పరిధిలో 80 నుండి 100 బెల్టు షాపులు గ్రామాల్లో నిబంధనలు విరుద్ధంగా నడుపుతున్నారు. వైన్ షాప్ యజమానులు ఎక్సైజ్ శాఖ అధికారులు అండదండతోనే ఇష్టారీతిన వ్యవహరిస్తు ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు మించి అమ్మకాలు జరుపుకున్నారు.

స్టిక్కరింగ్ తో బెల్ట్ షాపులకు రవాణా

సంగెం మండల పరిధిలోని శ్రీ సాయి వైన్స్ పర్వతగిరి మండల కేంద్రంలోని భద్రకాళి వైన్స్ అయినవోలు మండల కేంద్రంలోని మల్లికార్జున వైన్స్ మద్యం వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కాకుండా ఇష్టారాజ్యంగా ధరలు పెంచి బహిరంగంగా విక్రయాలు సాగిస్తున్నారు. ఫుల్ బాటిల్ పై 20 నుంచి 30, హాఫ్ బాటిల్ పై 10 నుంచి 20, క్వార్టర్ సీసా పై 10 నుంచి 15 వరకు రేట్లు నిర్ణయించి మద్యం ప్రియుల జెబులు గుల్ల చేస్తున్నారు. బీరుపై 10 నుంచి 20 అధికంగా వసూలు చేస్తున్నారు.

అలాగే నిబంధన విరుద్ధంగా ప్రత్యేకంగా మధ్య సీసాలపై స్టిక్కర్లు వేసి బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారు. ఒక వైన్ షాప్ కింద 100 బెల్టు షాపులో నడిపిస్తూ మద్యం బాటిళ్ళను ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. మద్యం షాపు నిర్వాహకులు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు 20 రూపాయలు కలిపి బెల్ట్ షాపులకు సరఫరా చేస్తుంటే, బెల్ట్ షాప్ నిర్వాహకులు మద్యం వ్యాపారు నిర్ణయించిన ధరపై 20 రూపాలు అధికంగా వసూలు చేస్తూ మొత్తంగా ఇద్దరు కలిసి ఒక బాటిల్ పై 40 రూపాయలు పెంచి బెల్ట్ షాపుల్లో అమ్మకాలు జరుపుతున్నారు. గ్రామాల్లో రాత్రింబవళ్లు విచ్చలవిడిగా మధ్య అమ్మకాలు జరుగుతున్నప్పటికీ ఎక్సైజ్ శాఖ అధికారులు నిమ్మకు నెరెత్తినట్లు వ్యవహరించడం పట్ల అంతర్యం ఏమిటో తెలియడం లేదని పలువురు గుసగుసలాడుతున్నారు.

వైన్ షాపుల్లో మద్యం కల్తీ జరుగుతుందో

సంగెం మండలం శ్రీ సాయి వైన్స్ అయినవోలు మండలం మల్లికార్జున వైన్స్ లో మద్యం కల్తీ జరుగుతుందని మందుబాబులు ఆరోపిస్తున్నారు. ఎక్కువ ధర కలిగిన మద్యం సీసాలో నీళ్లతో పాటు చీఫ్ లిక్కర్ నింపుతూ కల్తీ దందా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లిక్కర్ కంపెనీ నుంచి నాణ్యతతో వస్తున్న అధిక ధర కలిగిన మద్యం సీసాలను కల్తీ చేస్తున్నారంటూ ఆరోపణలు రావడం గమనార్హం. ఈ సీసాల మూత ఒడుపుతో తీసే ప్రాక్టీస్ ఉన్న వ్యక్తులను మద్యం షాపులో వర్కర్లుగా పెట్టుకొని ఈ దందాకు తెరలేపుతున్నట్లు తెలుస్తుంది. సీసాలోని కొంత మద్యాన్ని పక్కనపెట్టి ఆస్థానంలో తక్కువ ధర కలిగిన చీప్ లిక్కర్ను మిక్స్ చేస్తున్నరంటూ ప్రజలు బాటంగానే చెప్పుకుంటున్నారు. వాసన రాకుండా నీళ్లు కలుపుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

ఎక్సైజ్ శాఖ అధికారులు దృష్టి పెట్టేదెప్పుడు

మద్యం వ్యాపారులు ప్రభుత్వ నిర్ణయించిన రేట్లకు మించి అమ్మకాలు కొనసాగిస్తున్న ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడుస్తున్నప్పటికీ అటువైపు కన్నెత్తి చూడకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బెల్ట్ షాప్ నిర్వాహకులు చెప్పినట్టే ఎక్సైజ్ శాఖ అధికారులు వ్యవహరించడం పరిపాటిగా మారింది. ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్ణయించిన వైన్ షాప్ నుండి మాత్రమే బెల్ట్ షాప్ నిర్వాహకులు మద్యం బాటిల్ తెచ్చుకోవాలనే నిబంధనలను కఠిన తరం చేసి మరి బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నారు. లేని యెడల బెల్ట్ షాపులపై దాడులు చేసి పంచనామా చేయకుండా మద్యాన్ని తమ సొంతానికి వాడుకుంటున్నరనే ఆరోపణాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సంఘటన వర్ధన్నపేట ఎక్సైజ్ శాఖ పరిధిలో జరిగినట్లు సమాచారం. ఎక్సైజ్ శాఖ అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలని పలువురు బాటంగానే చర్చించుకుంటున్నారు.

Similar News