న‌మ్మి ఇస్తే న‌ట్టేటా ముంచారు.. హైదరబాద్‌ కేంద్రంగా హెచ్‌1బీ స్కామర్స్‌

అమెరికా అంటే ఉపాధి అవకాశాలకు స్వర్గసీమ.

Update: 2024-04-29 13:33 GMT

దిశ‌,వ‌రంగ‌ల్ బ్యూరో : అమెరికా అంటే ఉపాధి అవకాశాలకు స్వర్గసీమ. చట్టంను పక్కగా అమలు చేసే అమెరికాలో సైతం మన కేటుగాళ్లు నకిలీ సంస్థలను ఏర్పాటు చేసి అమాయక యువతను బురిడీ కొట్టిస్తున్నారు. ప్రతి ఏటా జరిగే హెచ్‌1బీ లాటరీల్లో నకిలీ పత్రాలతో ఫైల్‌ చేసి నిరుద్యోగ యువత నుంచి రూ. 6 లక్షల వరకు వసూలు చేసి ముఖం చాటేస్తున్నారు. అమెరికాలో ఇటీవల రెండు బోగస్‌ సంస్థల నిర్వాహాకాన్ని అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు పట్టుకున్నారు. రెండు నకిలీ సంస్థల తరుపున 137 హెచ్‌1బీ దరఖాస్తులను 2023లో లాటరీలో ఫైల్‌ చేయగా, వాటిని పట్టుకొని బ్లాక్‌ చేశారు. హైద‌రాబాద్ కేంద్రంగా అత్యంత సామీప్య‌మైన పేర్ల‌తో ఓ రెండు సంస్థలను ఏర్పాటు చేసిన ఘనులు ఆ రెండు సంస్థల ద్వారా వరంగల్‌, హైదరాబాద్‌, అమెరికాలో ఉంటున్న నిరుద్యోగుల నుంచి హెచ్‌1బీ కొసం ఒక్కొక్కరి నుంచి రూ. 6 లక్షల నుంచి పది లక్షల వరకు వసూలు చేశారు. లాటరీల్లో 37 మందికి హెచ్‌1బీ పిక్‌ కాగా, ఆ తర్వాత జరిగే ప్రాసెస్‌లో నకిలీ పత్రాలతో ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ రెండు సంస్థల నుంచి 137 హెచ్‌1బీ దరఖాస్తులను లాటరీలో ఫైల్ చేసిన‌ట్లుగా అధికారులు గుర్తించారు. ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించిన యూఎస్ సీఐఎస్‌ అధికారులు రెండు సంస్థలను బ్లాక్ లిస్టులో పెట్టారు.

హైద‌రాబాద్‌, వ‌రంగ‌ల్‌లో ముఠాలు..!

వరంగల్‌కు చెందిన ఇద్దరు హెచ్‌1బీ హోల్డర్లతో పాటుగా, హైదరబాద్‌కు చెందిన మరో ముగ్గురు ముఠాగా ఏర్పడి , నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెడుతున్నట్టుగా తెలిసింది. వీరిని నమ్మిన విజయవాడకు చెందిన ఓ మహిళ తన ఐడెంటీ పత్రాలను ఇవ్వడంతో, ఆమెకు తెలియకుండానే ఆమె పేరిట రెండు సంస్థలను నెలకొల్పి, ఆమె ఐడెంటీ పత్రాలు, సంతకాలతో 137 హెచ్‌1బీలను ఫైల్‌ చేశారు. ఇటీవల సదరు మహిళకు గ్రీన్‌ కార్డు జారీ చేసే సమయంలో రెండు నకిలీ సంస్థల విషయం వెలుగులోకి వచ్చింది. ఇంటర్వ్యూ చేసే సమయంలో సదరు మహిళకు చెందిన ఐడెంటీ కార్డును పరిశీలించి సెర్చ్‌ చేయగా, ఇమ్మిగ్రేషన్‌ అధికారులు బ్లాక్‌ చేసిన సంస్థలో ఆమె భాగస్వామిగా ఉన్నట్టు గుర్తించారు.

137 హెచ్‌1బీ దరఖాస్తుల్లో మహిళ సంతకం, ఐడెంటీ కార్డులుండడంతో ఆమె అవాక్క‌యింది. తనకు తెలియకుండానే పెద్ద రాకెట్‌ నడిపారంటూ ఆమె ఎంత ప్రాధేయపడినా యూస్‌సీఐఎస్‌ అధికారులు క‌నిక‌రించ‌లేదు. ఆమెకు గ్రీన్‌ కార్డు ఇవ్వకుండా నిరాకరించారు. ఆమెతో పాటుగా ఈ బోగస్‌ సంస్థ ఫైల్‌ చేసిన 37 హెచ్‌1బీ దరఖాస్తులను రిజెక్టు చేశారు. 37 మంది యువకుల జీవితాలను అమెరికాలో ఈ సంస్థ నాశనం చేసింది. వీరితో పాటుగా చాలా మందే ఇంకా బాధితులు అమెరికా, హైదరాబాద్‌, వ‌రంగ‌ల్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రతి ఏటా లాటరీని ఆసరాగా చేసుకొని ఈ ముఠా కోట్లలో సంపాదిస్తూ నిరుద్యోగ యువత భవిష్యత్తును అంధకారంలోకి పడేస్తున్న‌ట్లు స‌మాచారం.

బోగస్‌ గాళ్లు సేఫ్‌..

తనకు తెలియకుండా నకిలీ సంస్థలను నడిపిన కేటుగాళ్లు సేఫ్‌గా ఉండడం, బాధితురాలి కుటుంబాన్ని మనోవేదనకు గురిచేసింది. నమ్మి ఐడెంటీలను ఇస్తేఇంత పెద్ద మోసం చేశారంటూ వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మోసాలకు హైదరాబాద్‌, వరంగల్‌ కేంద్రంగా ఆఫీసులను నడుపుతూ ప్రతి ఏటా హెచ్‌1బీ లాటరీల సమయంలో 100 మంది యువకుల నుంచి తలా 6 లక్షల రూపాయలను తీసుకొని నకిలీ హెచ్‌1బీలను ఫైల్‌ చేస్తూ మోసం చేస్తున్నారని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొసమెరుపు ఏమిటంటే బ్లాక్ లిస్టులోని రెండు సంస్థలను మూసివేసిన ఘనులు మరో కొత్త సంస్థను డల్లాస్ లో సైబర్ ఫిల్ పేరిట మరో దుకాణం తెరిచిన‌ట్లు స‌మాచారం. మరోసారి యూత్ ను మోసం చేయడానికి సిద్ధమైనట్టు తెలిసింది. ఈ అక్రమార్కుల అడ్డగా ఉన్న హైదరాబాద్ , వరంగల్ లో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేసి అరికడితే నష్టం పోకుండా అడ్డుకోవచ్చు.

Similar News