తేలిన లెక్క.. వ‌రంగ‌ల్‌ లోక్‌స‌భ బ‌రిలో 42 మంది అభ్యర్థులు

లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్రక్రియ‌లో మ‌రో కీల‌క ఘ‌ట్టం ముగిసింది.

Update: 2024-04-30 02:23 GMT

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్రక్రియ‌లో మ‌రో కీల‌క ఘ‌ట్టం ముగిసింది. సోమ‌వారం నామినేష‌న్ల ఉపసంహ‌ర‌ణ గ‌డువు ముగిసింది. ఎన్నిక‌ల బ‌రిలో నిలిచేందుకు నామినేష‌న్లు దాఖ‌లు చేసిన కొంత‌ మంది స్వతంత్ర అభ్యర్థులు సోమ‌వారం ఉపసంహ‌రించుకున్నారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి గాను మొత్తం 48 నామినేషన్లు దాఖలు కాగా, సోమ‌వారం ఆరుగురు అభ్యర్థులు విత్ డ్రా చేసుకున్నారు. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య 42గా ఉంది. మ‌హ‌బూబాబాద్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో 56 మంది నామినే‌ష‌న్ దాఖలు చేయగా.. 11 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మరో ఇద్దరు నామినేషన్లు ఉపసంహ‌రించుకున్నట్లు సమాచారం. అర్ధరాత్రి వరకు అధికారులు అధికారికంగా ప్రకటించకపోవడంతో బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య తేలలేదు. మానుకోట మినహ నామినేష‌న్ల ఉపసంహ‌ర‌ణ త‌ర్వాత అభ్యర్థులు ఎంత‌మంది బ‌రిలో ఉన్నారు? పోరు తీరు ఎలా ఉండ‌బోతోంద‌న్న దానిపై స్పష్టత వ‌చ్చిన‌ట్లైంది.

మూడు పార్టీల మ‌ధ్యే ప్రధాన పోటీ

రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ బీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మ‌ధ్య పోటీ ఉండ‌నుంది. వ‌రంగ‌ల్ కాంగ్రెస్ అభ్యర్థిగా క‌డియం కావ్య, బీఆర్ఎస్ అభ్యర్థిగా సుధీర్ కుమార్‌, బీజేపీ అభ్యర్థిగా అరూరి ర‌మేష్ బ‌రిలో ఉన్నారు. మానుకోట నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి పోరిక బ‌ల‌రాంనాయ‌క్‌, బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ మాలోతు క‌విత‌, బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ ప్రొఫెస‌ర్ సీతారాంనాయ‌క్ బ‌రిలో ఉన్నారు. గ‌తంలో ఎన్నడు లేనివిధంగా లోక్‌స‌భ‌కు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేష‌న్లు వేయ‌డం గ‌మ‌నార్హం. నోటాను మిన‌హాయిస్తే ఒక్కో ఈవీఎంల్లో 15మంది అభ్యర్థుల‌కు గుర్తుల‌ను కేటాయించ‌వ‌చ్చు. అయితే, ప్రస్తుతం బ‌రిలో నిలిచిన వారి సంఖ్య రెండు చోట్ల ఎక్కువ‌గా ఉండ‌టంతో ఈవీఎంలు పెర‌గ‌నున్నాయి. వ‌రంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో మూడు ఈవీఎంలు ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా మానుకోట‌లోనూ రెండు ఈవీఎంలు ఏర్పాటు చేయాల్సి రానుంది. బ‌రిలో నిలిచిన అభ్యర్థులపై స్పష్టత వ‌చ్చిన నేప‌థ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేయ‌నున్నాయి.

అభ్యర్థుల‌కు గుర్తుల కేటాయింపు..

ఎన్నికల సంఘం నిబంధనల మేరకే అభ్యర్థుల‌కు గుర్తులు కేటాయింపు చేశారు. సోమవారం మధ్యాహ్నం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్ ఆర్వో కార్యాల‌యాల్లో కేంద్ర సాధారణ ఎన్నికల పరిశీలకుల స‌మ‌క్షంలో రిటర్నింగ్ అధికారులు అభ్యర్థులకు సింబల్స్ (గుర్తుల) కేటాయించారు. రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీలకు ప్రత్యేకంగా ఎన్నికల సంఘం గుర్తులు, ఎన్నికల సంఘంతో గుర్తింపు పొందని, రిజిస్టర్ అవ్వని, ఇండిపెండెంట్ అభ్యర్థులకు తెలుగు అక్షరమాల ప్రామాణికంగా గుర్తులు కేటాయించ‌డం జ‌రిగింద‌ని వ‌రంగ‌ల్ లోక్‌స‌భ ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారిణి ప్రావీణ్య తెలిపారు. ఒకే గుర్తును ప్రతిపాదించిన ఇద్దరు అభ్యర్థులకు డ్రా పద్ధతిలో సింబల్ కేటాయించామని వెల్లడించారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News