గార్ల ఏజెన్సీలో య‌థేచ్ఛగా బైరైటీస్ మైనింగ్‌

మ‌హ‌బూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని శేరిపురం, పోచారం రిజర్వ్‌ ఫారెస్ట్‌లోని కంపార్ట్‌మెంట్‌ 12,13,11లో సుమారు 1300 ఎకరాల్లో విస్తరించి ఉన్న బైరైటీస్ గ‌నుల్లో ఇష్టారాజ్యంగా త‌వ్వకాలు జ‌రుగుతున్నాయి.

Update: 2024-05-21 02:09 GMT

దిశ‌, గార్ల: మ‌హ‌బూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని శేరిపురం, పోచారం రిజర్వ్‌ ఫారెస్ట్‌లోని కంపార్ట్‌మెంట్‌ 12,13,11లో సుమారు 1300 ఎకరాల్లో విస్తరించి ఉన్న బైరైటీస్ గ‌నుల్లో ఇష్టారాజ్యంగా త‌వ్వకాలు జ‌రుగుతున్నాయి. మండలం పరిధిలోని కోట్యా నాయక్ తండా, బాలాజీ తండా, పాత పోచారం, నగరం బెరైటీస్ వందల ఎకరాల్లో గనుల నిలువలు ఉన్నాయి. బాలాజీ తండా రెవెన్యూ పరిధిలోని 57, 58 సర్వే నంబరులో ఫారెస్ట్, ప్రభుత్వ ప్రైవేటు భూములు సుమారు 800 వందల ఎకరాల్లో బైరైటీస్ గనులు విస్తరించి ఉన్నాయి. అయితే అందులోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో బైరైటీస్ ముడి ఖనిజం పై కన్నేసిన కొంతమంది బడాబాబులు వందలాది ఎకరాల్లో అక్రమ మైనింగ్‌లు జరిపి అనేక ఏళ్లుగా యథేచ్ఛగా అక్రమంగా రాత్రి వేళల్లో బైరైటీస్ ను తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గనులను లీజుకు ఇవ్వగా నాలుగు దశాబ్ధాల పాటు ఆంధ్రాకు చెందిన ఓ మైనింగ్‌ కంపెనీ బైరైటీస్ గనుల లీజు పత్రాలు పొంది యథేచ్ఛగా బైరైటీస్ గనుల తవ్వకాలు నిర్వహించింది. అనుమ‌తుల‌కు మించి త‌వ్వకాలు జ‌రిపి అక్రమంగా ఆంధ్రప్రదేశ్ మీదుగా అంత‌ర్జాతీయ మార్కెట్‌కు త‌ర‌లించిన‌ట్లు ఆరోప‌ణ‌లున్నాయి. అదేవిధంగా బాలాజీతండా రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 99లో మరో 67ఎకరాల లీజుతో తవ్వకాలు సాగించి కోట్ల విలువ చేసే ఖ‌నిజాన్ని త‌ర‌లించికుపోయిన‌ట్లు ఆరోప‌ణ‌లున్నాయి. అయినా అధికార యంత్రాంగం మాత్రం బైరైటీస్ గనుల అక్రమ తరలింపునకు అడ్డుకట్ట వేయలేకపోతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

త‌వ్వకాలపై నిషేధం ఉన్నా ఆగ‌ని దందా.!

1965 నుంచి ఈ గనుల లీజు పొందిన ప్రైవేటు కంపెనీ తర్వాత ప్రత్యేక మినహాయింపులు పొంది 2009 వరకు తవ్వకాలు కొనసాగించింది. తర్వాత గార్ల బైరైటీస్ తవ్వ కాలు జరుగుతున్న ప్రాంతం రిజర్వ్‌ ఫారెస్ట్ పరిధిలో ఉందని అనుమతులను రద్దు చేయాలని ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌ కోరడంతో సుప్రీం కోర్టు జాయింట్‌ సర్వేకు తీర్పు ఇచ్చింది. దీంతో మండ‌లంలోని బైరైటీస్ త‌వ్వకాల‌కు బ్రేక్ ప‌డింది. అయితే అధికారికంగా బ్రేక్ ప‌డినా అన‌ధికారికంగా మాత్రం త‌వ్వకాలు కొన‌సాగుతున్నాయి. రాత్రివేళ‌ల్లో త‌వ్వకాలు, ర‌వాణా జ‌రుగుతున్నా అధికారులు మాత్రం ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. బైరైటీస్ కు అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉండ‌టంతో ఇటీవ‌ల కాలంలో త‌వ్వకాలు జోరుగా సాగుతున్నాయి. బైరైటీస్ టన్ను ఖనిజం అంత‌ర్జాతీయ మార్కెట్‌లో రూ.10 నుంచి 12 వేల వ‌ర‌కు ఉంటుంద‌ని తెలుస్తోంది. పెట్రోల్ ట్యాంకుల నిర్మాణం, ప‌రిక‌రాల నిర్మాణం, క‌ల‌ర్ల త‌యారీలోనూ బైరైటీస్ ను వినియోగిస్తార‌ని తెలుస్తోంది. పెయింటింగ్ వర్క్‌లోనూ ఖనిజాన్ని ఉపయోగిస్తారు.

అంతా రాత్రివేళ‌ల్లోనే..

అధికారుల నిర్లక్ష్యం, మాముళ్ల ఒప్పందాల‌తో బైరైటీస్ అక్రమ రవాణా య‌థేచ్ఛగా సాగుతోంద‌న్న ఆరోప‌ణ‌లు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. రెవెన్యూ, పోలీస్‌, ర‌వాణా, అటవీ శాఖ అధికారులు తూతు మంత్రంగా చేస్తున్న త‌నిఖీల‌తో అక్రమ ర‌వాణా ఆగ‌డం లేద‌ని అన్నారు. శాఖ‌ల్లోని కింది స్థాయి అధికారులు మాముళ్లు తీసుకుంటూ దందాకు స‌హ‌క‌రిస్తున్నట్లుగా ఆరోప‌ణ‌లున్నాయి. రాత్రి సమయంలో పాత పోచారం, కోట నాయక్, నగరం బాలాజీ తండా, గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో సుమారు వందల ఎకరాల్లో ఎక్కడో ఒక చోట త‌వ్వకాలు జ‌రుపుతూ విలువైన ఖ‌నిజాన్ని త‌ర‌లించుకెళ్తున్నారు. ఒక టిప్పర్‌లో సుమారు 35 టన్నులు ఒక ట్రాక్టర్లో దాదాపు 6 టన్నులు ఖనిజాన్ని ర‌వాణా చేస్తున్నారు. నాణ్యమైన ఖనిజం టన్ను విలువ సుమారు పదివేల రూపాయలు చొప్పున, నాణ్యత లేని దాని విలువ టన్ను సుమారు 6000 రూపాయలు ధర పలుకుతుందని తెలిసింది.

ఈ లెక్కన ఒక టిప్పర్ ఖనిజానికి విలువ 3,50,000, ఒక ట్రాక్టర్ ఖనిజానికి విలువ 60 వేల రూపాయలు చొప్పున విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. స్థానిక ఖమ్మం, కడప ప్రాంతానికి చెందిన అక్రమార్కులే ఈ వ్యవహారానికి పాల్పడుతున్నారు. నిక్షేపాలు ఉన్న ప్రాంతం నిర్జన ప్రదేశంలో ఉండడంతో రాత్రి అయితే చాలా అక్రమార్కులు ఆ ప్రాంతంలో యంత్రాలు, ట్రాక్టర్‌తో వాలిపోతారు. కందకాలను యంత్రాలతో పూడ్చివేసి లోపలికి చొరబడి ఖనిజాన్ని కొల్లగొడుతున్నారు. ఆనవాళ్లు లేకుండా యధావిధిగా కందకాలను తీసుకున్నట్లు విశ్వసనీయగా తెలిసింది. మేడారం జాతర సమయంలో టిప్పర్ల ద్వారా వందల టన్నులు గత నెలలో ట్రాక్టర్ల ద్వారా తరలించినట్లు తెలిసింది. వారి అక్రమాలకు సెలవు రోజులను ఎంచుకున్నట్లు సమాచారం.

గతంలో జరిగిన సంఘటనలు..

పాత పోచారం నుంచి కమలాపురం వైపు దారిలో బెరైటీస్ తరలిస్తున్న లారీని పట్టుకొని అక్రమార్కులపై కేసు నమోదు చేశారు. ఈ ఖనిజంతో కూడిన లారీ సూర్యాపేట జిల్లా కోదాడ వైపుగా తరలిస్తున్నట్లు తెలిసింది. గడిచిన ఏడాది సెప్టెంబర్ లో రాత్రివేళ టాక్టర్‌లో ఖనిజాన్ని తరలించేందుకు అక్రమార్కులు ప్రయత్నించారు. వర్షంతో ఆ ప్రాంతం బురదగా ఉండడంతో వాహనం అందులో కూరుకుపోవడంతో తెల్లవారితే దొరికిపోతామేమో అని భయంతో అక్రమార్కులు విలువైన రాయిని కింద వదిలేసి వెళ్లారు. ఇటీవల నిక్షేపాలు ఉన్న ప్రాంతంలో రెండు ట్రాక్టర్లు ఖనిజాన్ని తరలించేందుకు వచ్చినట్లు గుర్తించిన పోలీసులు వాటిని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు.

Similar News