పోమాల్ పెద్ద చెరువు పరిసరాల్లో అరుదైన జంతువు సంచారం

త్తర భారతదేశంలోని నది పరిసర ప్రాంతాల్లో ,పశ్చిమ కనుమల్లోని అడవుల్లో, నాగార్జునసాగర్ పరిసర ప్రాంతాల్లో అరుదుగా కనిపించే ఓ జంతువు మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం పోమాల్

Update: 2022-09-25 14:28 GMT

దిశ, నవాబుపేట: ఉత్తర భారతదేశంలోని నది పరిసర ప్రాంతాల్లో ,పశ్చిమ కనుమల్లోని అడవుల్లో, నాగార్జునసాగర్ పరిసర ప్రాంతాల్లో అరుదుగా కనిపించే ఓ జంతువు మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం పోమాల్ పెద్ద చెరువు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తోంది. అరుదైన జంతువు పెద్ద చెరువు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ చెరువులో నివాసం ఉంటున్నట్లుగా గ్రామస్తులు తెలిపారు. ప్రతిరోజు చెరువు వద్దకు వెళ్లె కొందరు యువకులు ఆదివారం ఉదయం చెరువు పరిసర ప్రాంతంలో ఆ జంతువు సంచరించడం చూశారు. మనుషుల అలికిడిని గమనించిన ఆ జంతువు చెరువులోకి వెళ్లి తల దాచుకోవడం వారు గమనించారు.

అంతేకాక ఆ జంతువు సంచారాన్ని తమ వెంట తీసుకు వెళ్లిన సెల్ ఫోన్ కెమెరాలతో వీడియోలు, ఫోటోలు తీసి వాట్సప్, పేస్ బుక్‌లలో షేర్ చేశారు. భారీ పరిమాణంలో గల ఆ జంతువు నీటి కుక్క అయి ఉండవచ్చని గ్రామస్తులు తెలిపారు. అయితే నాగార్జునసాగర్ తదితర ప్రాంతాల్లో సంచరించే నీటి కుక్కల పరిమాణానికి పోమాల్ పెద్ద చెరువు పరిసర ప్రాంతాల్లో సంచరించిన జంతువుకు పరిమాణానికి చాలా తేడా ఉండడంతో ఈ జంతువు ఏదో తెలుసుకోవాలని కుతూహలాన్ని ప్రజలు కనబరుస్తున్నారు. సంబంధిత అధికారులు పరిశీలించి ఈ అరుదైన జంతువును సంరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, జంతు సంరక్షకులు కోరుతున్నారు.

Similar News