వివాదంలో మాదాపూర్ సీఐ గడ్డం మల్లేష్

ప్రజలకు నీతులు చెప్పే పోలీసులు.. ఆ నీతులు తమకు మాత్రం వర్తించవని అనుకుంటున్నారు. అవి చెప్పేందుకు తప్పా తాము చేసేందుకు కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు.

Update: 2024-05-05 09:18 GMT

దిశ, హైదరాబాద్ బ్యూరో : ప్రజలకు నీతులు చెప్పే పోలీసులు.. ఆ నీతులు తమకు మాత్రం వర్తించవని అనుకుంటున్నారు. అవి చెప్పేందుకు తప్పా తాము చేసేందుకు కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. విషయంలోకి వెళితే మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై ఇటీవల ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. కేబుల్ బ్రిడ్జి అందాలను చూసేందుకు వచ్చే వారు వాహనాలను బ్రడ్జిపైనే నిలిపి ఫోటోలు దిగడం, పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చేస్తున్నారు. దీంతో తరచుగా యాక్సిడెంట్లు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలామంది మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి కేబుల్ బ్రిడ్జిని పరిశీలించి వాహనాలు నిలిపి ఫోటోలు దిగే వారిపై జరిమానాలు విధించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

అదే విధంగా మాదాపూర్ సీఐ గడ్డం మల్లేష్ తన సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులతో కలిసి కేబుల్ బ్రిడ్జి ఫుట్ పాత్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అంతేకాదు కేబుల్ బ్రిడ్జి పొడుగునా వాహనాలు ఆపి ఫోటోలు దిగే వారిపై జరిమానా విధిస్తామంటూ సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. అలాగే కేబుల్ బ్రిడ్జిపై రెండు వైపులా ట్రాఫిక్ పోలీసులను ఉంచి వాహనాలు ఆపిన వారిపై, అక్కడ బర్త్ డే వేడుకలు చేస్తూ ఫోటోస్ దిగే వారిపై ఫైన్స్ వేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. కేబుల్ బ్రిడ్జిపై స్వయంగా మాదాపూర్ సీఐ గడ్డం మల్లేష్ ఇదే కేబుల్ బ్రిడ్జిపై తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకలు నిర్వహించి వార్తల్లోకి ఎక్కాడు. కేబుల్ బ్రిడ్జిపై కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుని,

రూల్స్ ప్రజలకు మాత్రమే.. మాకు కాదు అనేలా వ్యవహరించారంటూ సోషల్ మీడియాలో సీఐ పాల్గొన్న బర్త్ డే పార్టీ ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. కేబుల్ బ్రిడ్జ్ పై పుట్టిన రోజు వేడుకలు పార్టీలు చేసుకుంటే సెక్షన్ 188 ప్రకారం శిక్ష అర్హులంటూ గతంలో వేడుకలు నిషేధం అంటూ ప్రకటించిన సీఐ మల్లేష్.. తాజాగా అదే కేబుల్ బ్రిడ్జిపై పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని దగ్గరుండి కేక్ కట్ చేయించడం ఏంటని సిటీజన్స్ ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ఫోటోస్, వార్తలపై సీఐ మల్లేష్ స్పందించారు. తాను కేబుల్ బ్రిడ్జి ఫుట్ పాత్ పైనే బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నానని, బ్రిడ్జిపై వాహనాలు ఆపి పుట్టినరోజు చేయలేదని, తాను నిబంధనలు ఉల్లగించలేదంటూ సీఐ మల్లేష్ వివరణ ఇచ్చుకున్నారు.

మాదాపూర్ సీఐ మల్లేష్ వ్యవహరంపై స్పందించిన డీసీపీ డాక్టర్ వినీత్

కేబుల్ బ్రిడ్జిపై నిబంధనలు ఉల్లంఘించి స్వయంగా మాదాపూర్ సీఐ గడ్డం మల్లేష్ తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం పట్ల మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ స్పందించారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.


Similar News