మేడం ఆఫీ‌స్‌కు రాదు.. మనమే వెళ్లాలి..! బల్దియాలో మెడికల్ ఆఫీసర్ తీరు

ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా మెడికల్ ఆఫీసర్లు, డిప్యూటీ కమిషనర్ల ఇష్టారాజ్యం కొనసాగుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Update: 2024-05-24 02:22 GMT

దిశ, సిటీ బ్యూరో: ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా మెడికల్ ఆఫీసర్లు, డిప్యూటీ కమిషనర్ల ఇష్టారాజ్యం కొనసాగుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్కిళ్లకు బాస్‌లుగా వ్యవహరిస్తున్న డిప్యూటీ కమిషనర్లు, హెల్త్, శానిటేషన్ విభాగాలకు బాస్‌లుగా వ్యవహరిస్తున్న మెడికల్ ఆఫీసర్లు రాజరిక పాలనను కొనసాగిస్తూ సిబ్బందిని ముప్పుతిప్పలు పెడుతున్నట్లు ఆరోపణలు వినివిపిస్తున్నాయి. వైద్య, ఆరోగ్య శాఖ నుంచి జీహెచ్ఎంసీలోకి డిప్యూటేషన్లపై వచ్చి గడువు ముగిసినా మాతృ శాఖకు వెళ్లకుండా జీహెచ్ఎంసీలోనే తిష్ట వేయటంతో పాటు ఇష్టారాజ్యంగా పాలన కొనసాగిస్తూ సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్నారు.

సికింద్రాబాద్ జోన్ పరిధిలోని ఓ సర్కిల్‌కు చెందిన మెడికల్ ఆఫీసర్ ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతున్నట్లు సమాచారం. సదరు మెడికల్ ఆఫీసర్ చిక్కడపల్లిలోని జీహెచ్ఎంసీకి చెందిన మార్కెట్‌లో ఓ మల్గీను తీసుకుని అందులోనే బస చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ మేడం ఆఫీసుకు వచ్చి విధులు నిర్వర్తించకుండా తనకు అవసరమైన ఫైళ్లను తన మల్గీకే రప్పించుకుని సంతకాలు చేస్తున్నట్లుగా సమాచారం. సదరు ఆఫీసర్ ఇంట్లోకి కావాల్సిన సరుకులను ఎస్ఎఫ్ఏలు, శానిటరీ జవాన్లు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు, ఇతర హెల్త్ అండ్ శానిటేషన్ సిబ్బందే సమకూర్చాల్సిందే. ఇందుకు అయ్యే ఖర్చు కూడా వారు భరించాలి.

మేడం డబ్బులని అడిగారంటే చాలు, వారి ఉద్యోగం ఊస్టే. సదరు మెడికల్ ఆఫీసర్‌కు కావాల్సిన పప్పులు, ఉప్పులతో పాటు పండ్లు, ఫలాలు, వెజ్, నాన్‌వెజ్ డిష్‌లను ఆర్డర్ చేసిన వెంటనే ముందుంచాలి, లేకపోతే అంతే సంగతులు. మెడికల్ ఆఫీసర్ తన మూడ్‌ను బట్టి నాన్‌వెజ్ ఫుడ్ ఆర్డర్ చేస్తారట. మటన్, చికెన్, ఫిష్, కుందేలు వంటివి తినాలనిపిస్తే కిందిస్థాయి సిబ్బంది వాటిని విక్రయించే కొట్టుకు వెళ్లి మేడమ్‌కు వీడియో కాల్ చేయాల్సిందే. సదరు మెడికల్ ఆఫీసర్ ఫోన్‌లో చూస్తుండగానే వాటిని కట్ చేయాలని ఆదేశిస్తున్నట్లు సమాచారం. అందులో చూసి మేడమ్ ఆర్డర్ చేసిన ఐటమ్‌ను వెంటనే తీసుకెళ్లి ఇవ్వాలి. అందుకు ఎంత ఖర్చయినా కింది స్థాయి సిబ్బందే భరించాల్సిందే. ఈ రకంగా సరుకులు తెచ్చినందుకు గతంలో ఓ ఎస్ఎఫ్ఏను ఎలాంటి కారణాలు లేకుండానే విధుల్లో నుంచి తొలగించినట్లు సమాచారం.

జరిమానా విధించారు.. ఖజానాల జమ చేశారా?

సదరు మెడికల్ ఆఫీసర్‌పై మరో ఆరోపణ కూడా వినిపిస్తుంది. నగరంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న ఫుడ్ స్టాళ్లు, రోడ్లను ఆక్రమించి ఏర్పాటయ్యే వ్యాపార కేంద్రాలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ కింద చలానాలు విధిస్తుంటారు. సదరు మెడికల్ ఆఫీసర్ కూడా ఇలాంటి ఛలానాలు విధిస్తుంటారు. కానీ ఈ మెడకల్ ఆఫీసర్ ప్రత్యేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ చలానాల బుక్ ప్రింట్ చేసుకుని, జరిమానాలు విధిస్తున్నారు. కానీ, వాటిలో చాలా వరకు ఆమె జీహెచ్ఎంసీ ఖజానాలో జమ చేశారా? అన్న విషయాన్ని ఉన్నతాధికారులు క్రాస్ చెక్ చేస్తే.. ఎంత వరకు ఛలానాలు వసూలు చేస్తున్నారు, అందులో ఎంత వరకు జీహెచ్ఎంసీ ఖజానాకు కడుతున్నారన్న విషయం బయటపడుతుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

Similar News