శేరిలింగంపల్లి సర్కిల్‌లో భారీ స్కాం.. మానేసిన ఉద్యోగుల పేర జీతాలు క్లెయిమ్

ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీ ఖజానాకు కొందరు అక్రమార్కులైన అధికారులు కన్నం వేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Update: 2024-05-24 02:09 GMT

దిశ, సిటీ బ్యూరో: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీ ఖజానాకు కొందరు అక్రమార్కులైన అధికారులు కన్నం వేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఇంజినీర్లు కాంట్రాక్టర్ల అవతారమెత్తి నాసిరకం పనులు చేయించి, బిల్లులు క్లెయిమ్ చేస్తూ జేబులు నింపుకుంటుండగా, మరో ఇంజినీర్ కాంట్రాక్టు ఏజెన్సీలతో కుమ్మక్కు కావటంతో ఉద్యోగాలు మానేసిన ఔట్‌సోర్స్ వర్క్ ఇన్‌స్పెక్టర్ల జీతాలు నేటికీ క్లెయిమ్ చేస్తూ, అందులో వాటాలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని శేరిలింగంపల్లి సర్కిల్‌లోని ఇంజినీరింగ్ విభాగంలో రెండు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఇంజినీర్ పరిధిలో నలుగురు వర్క్ ఇన్‌స్పెక్టర్లు విధులు నిర్వర్తించే వారు.

వీరు ఒక వైపు వర్క్ ఇన్‌స్పెక్టర్లుగా పనిచేస్తూనే కాంట్రాక్టు పనులు చేస్తున్నట్లు గుర్తించిన ఉన్నతాధికారులు వారిని విధుల్లో నుంచి తొలగించాలని ఆదేశించారు. కానీ సదరు సర్కిల్‌లోని ఓ ఇంజినీర్ వారితో పనులు చేయించకుండా, దాదాపు ఏడాది నుంచి ఆ నలుగురికి జీతాలను ఇప్పిస్తూ అందులో సగం తన వాటాగా తీసుకుంటున్నట్లు సమాచారం. వీరిలో ఉద్యోగం మానేసిన ఓ వర్క్ ఇన్‌స్పెక్టర్ సదరు ఇంజినీర్‌కు వాటా ఇచ్చేందుకు నిరాకరించటంతో అతడిని ఆ ఇంజినీర్ విధుల్లో నుంచి పూర్తిగా తొలగించారు.

ఉద్యోగం మానేసిన ముగ్గురు వర్క్ ఇన్‌స్పెక్టర్ల జీతాలు ఇంకా క్లెయిమ్ చేస్తున్న ఆ ఇంజినీర్ వాటాలు తీసుకుంటున్న ఏ ఒక్క ఉన్నతాధికారి గుర్తించలేకపోవటం విడ్డూరం. నలుగురు వర్క్ ఇన్‌స్పెక్టర్లను విధుల్లో నుంచి తొలగించాలని ఏడాది క్రితం ఆదేశాలు జారీచేసిన ఉన్నతాధికారులు ఆ తర్వాత తమ ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలయ్యాయా లేదా అన్న విషయాన్ని కూడా సమీక్షించకపోవటం సదరు ఇంజినీర్‌కు వరంగా మారింది. అటెండెన్స్ రిజిస్టర్ ఆ నలుగురు వర్క్ ఇన్‌స్పెక్టర్ల వివరాలను తొలగించకుండా నేటికీ జీతాలను మెక్కుతున్న ఇంజినీర్ పై కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

రికవరీ చేస్తారా?

ఏడేళ్ల క్రితం శానిటేషన్ విభాగంలో సికింద్రాబాద్ జోన్ పరిధిలోని బేగంపేట సర్కిల్‌లో భార్యభర్తలైన ఇద్దరు స్వీపర్లు పగలు ఆబిడ్స్‌లో, రాత్రిపూట మోండ మార్కెట్ ప్రాంతంలో స్వీపింగ్ విధులు నిర్వహిస్తున్నారన్న విషయం 2017 జూలైలో వెలుగులోకి రావటంతో వారి పనులను పర్యవేక్షించే ఎస్ఎఫ్ఏ‌ను సస్పెండ్ చేయటంతో పాటు అతని వద్ద నుంచి రూ.50 వేలను రికవరీ చేశారు. స్థానిక మెడికల్ ఆఫీసర్ ఈ రకమైన అక్రమాలకు పాల్పడుతున్నారంటూ అప్పటి కమిషనర్ జనార్థన్ రెడ్డికి సదరు ఎస్ఎఫ్ఏ ఫిర్యాదు చేసిన మరుసటి రోజే ఇద్దరు స్వీపర్లు రెండు చోట్ల పనిచేస్తున్న విషయం బయటపడిందంటే అప్పటి మెడికల్ ఆఫీసర్ సదరు ఎస్ఎఫ్ఏను ఇరికించారంటూ అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ ఘటన మాదిరిగానే ఇప్పుడు ఉద్యోగాలు మానేసిన వర్క్ ఇన్‌స్పెక్టర్లకు ఇంకా జీతాలిప్పిస్తూ వాటాలు తీసుకుంటున్న ఇంజినీర్ నుంచి ఇప్పటి వరకు తీసుకున్న జీతాలను రికవరీ చేస్తారా? లేక గాలికొదిలేస్తారా? వేచిచూడాలి. జీహెచ్ఎంసీలో అధికారులు, ఇంజనీర్లు అక్రమాలకు పాల్పడితే ఓ న్యాయం? అదే క్షేత్ర స్థాయిలో స్వీపింగ్ పనులను పర్యవేక్షించే ఎస్ఎఫ్ఏ ను కుట్ర పూరితంగా బాధ్యుడ్ని చేస్తే మరో న్యాయమా? అంటూ కార్మిక, ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

Similar News