మారుతున్న రాజకీయ సమీకరణాలు

మారుతున్న రాజకీయ సమీకరణాలు... The strategies of political parties are changing says ambeer srikanth

Update: 2023-01-26 18:30 GMT

గెలుపు పందెమే ముఖ్యంగా రాజకీయ పార్టీల నేతలు తమ పల్లవి మారుస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోనూ ఈ పరిస్థితి నెలకొంది. ఒకప్పటిలా రాజకీయ పార్టీలు ఇప్పుడు సిద్ధాంత రాద్ధాంతాలను అంతగా పట్టించుకోవడం లేదు. గెలుపు వ్యూహాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇతర పార్టీల నుంచి చేరికల పర్వం కొనసాగుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం మరోసారి గెలుపునకు వ్యూహాలు రచించుకుంటున్నారు. 175కు 175 సీట్లు తమవేననే ధీమాతో ఎన్నికలకు ఏడాదికి ముందే వైఎస్ జగన్ ప్రచార పర్వం ప్రారంభించారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ పేగుబంధమైన 'తెలంగాణ' పదాన్ని తొలగించి 'భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)' అంటూ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి 'దేశ్ కీ నేత' కావాలని తహతహలాడుతున్నారు. గుణాత్మక మార్పును దేశంలోనూ తీసుకొస్తానని చెప్తున్నారు.

వారి ఎత్తుగడలని గమనించాలి..

రాష్ట్రంతో పాటు దేశంలోనూ జెండా ఎగరవేస్తామని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ప్రత్యేక తెలంగాణ 'సెంటిమెంటు'ను చాలా చక్కగా పండించిన కేసీఆర్.. ఇప్పుడు స్వరం మార్చారు. జనసేన నేతలను బీఆర్ఎస్‌లో చేర్చుకొని తోట చంద్రశేఖర్‌ను బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షులుగా నియమించారు. దీంతో ఇకనుంచి ఏపీ పాలకులను కేసీఆర్ విలన్లుగా చూపే ప్రయత్నం చేయకపోవచ్చు. రాజకీయంగా చంద్రబాబును దునుమాడే పరిస్థితులు కనబడకపోవచ్చు. ఒకవైపు బీఆర్ఎస్ పేరిట కేసీఆర్ ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ అవుతుంటే, మరోవైపు తెలంగాణలో చంద్రబాబు నాయుడు టీటీడీపీని మళ్లీ తెలంగాణలో యాక్టివ్ చేస్తున్నారు. మొత్తంగా ఒక ఆకులోనే రాజకీయ పాఠాలు నేర్చుకున్న చంద్రబాబు నాయుడు, కేసీఆర్ మళ్లీ ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కేంద్రబిందువుగా మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

దోస్తీ-కుస్తీ

ఏపీలో అయితే మళ్లీ 2014 నాటి పరిస్థితులు కనబడుతున్నాయి. అప్పట్లో మాదిరిగా ఏపీలో మళ్లీ జనసేన-బీజేపీ-టీడీపీ పొత్తు పొద్దు పొడిచేలా ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల భేటీ ఈ చర్చకు ఆజ్యం పోస్తున్నది. తానే చొరవ తీసుకుని అన్ని పార్టీలను కలుస్తానని, వారిని కలుపుకొని వైసీపీ వ్యతిరేక ఓటు చీలనవ్వనని పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు పొత్తులకు దోహదపడతాయని అంచనా వేసుకోవచ్చు. అయితే, పవన్ కల్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి అవుతారా? జనసేన శ్రేణులు ఏ విధంగా పవన్ కల్యాణ్ జనసేన పార్టీని అధికారంలోకి తీసుకొస్తాయి? మళ్లీ చంద్రబాబే సీఎంగా ఉంటారని పవన్ ప్రచారం చేస్తారా? అనే తదితర ప్రశ్నలకు సమాధానాలు రాబోయే రోజుల్లో తెలుస్తాయి.

ప్రజల నిర్ణయమే ఫైనల్ ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే నాయకులకు శిరోధార్యం. కావున ప్రజలు సైతం నాయకుల ఎత్తుగడలను గమనించాలి. ప్రయోజన రాజకీయాలే పరమావధిగా పని చేస్తున్న నేతలను 'ఓటు' అనే వజ్రాయుధంతో ఇంటికి పంపించాలి. అవినీతిపరులకు ప్రజాకోర్టులో సరైన గుణపాఠం చెప్పాలి. తమ ఆకాంక్షలను, అభిమతాలను అర్థం చేసుకుని అభివృద్ధికి బాటలు వేసే అసలు సిసలైన ప్రజానాయకులను మాత్రమే అసెంబ్లీ, పార్లమెంటుకు పంపి బాధ్యతాయుతమైన పాత్రలు పౌరులు పోషించాలి.

అంబీరు శ్రీకాంత్,

81859 68059

Also Read...

ఆ కమ్యూనిటీ ఓటర్లపై ప్రధాన పార్టీల ఫోకస్.. ఆకర్షించేలా వ్యూహాలు! 

ఆ కమ్యూనిటీ ఓటర్లపై ప్రధాన పార్టీల ఫోకస్.. ఆకర్షించేలా వ్యూహాలు! 


Tags:    

Similar News