ముస్లిం రిజర్వేషన్ల జోలికొస్తే, దేశం అల్లకల్లోలమే..!

దేశంలోని హిందువుల మాదిరే ముస్లింలలో కూడా కులాలు ఉన్నాయి. హిందువులకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పించినప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఉన్న

Update: 2024-05-07 01:15 GMT

దేశంలోని హిందువుల మాదిరే ముస్లింలలో కూడా కులాలు ఉన్నాయి. హిందువులకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పించినప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఉన్న ముస్లిం ఉపజాతులకు కూడా కేంద్ర ఓబీసీ జాబితాలో చోటు దక్కింది. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఓబీసీలుగా కొన్ని ముస్లిం కులాలు గుర్తించబడినప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ నేతలు ప్రత్యేకంగా అభ్యంతరం చెప్పడమెందుకు? అదేదీ లేకుండా దేశంలోని పౌరులకు దక్కే ఏ సదుపాయం కూడా ముస్లిం అనే వాడికి దక్కకూడదనే ఆలోచన కొందరు బీజేపీ నేతల ప్రకటనల్లో, మాటల్లో కనబడుతుంది.

ఏ దేశంలోనైనా జనాభాపరంగా మైనార్టీ మతస్తులకు రాజ్యాంగపరంగా, పాలనపరంగా, మరిన్ని అదనపు హక్కులు, సదుపాయాలు, భాషా, సంస్కృతి పరిరక్షణ, జీవన భద్రతా హామీ ఉంటుంది. కానీ గత పదేళ్లుగా బీజేపీ పాలనలో ముస్లింలకు వ్యతిరేకంగా.. బీజేపీ దాని అనుబంధ సంస్థలు వారిలో భయాందోళన కలిగిస్తూ, వారి ఉనికిపై, డ్రస్‌పై ఆహార, సంస్కృతీ రీతులపై అనేక కల్పిత విష ప్రచారాలు చేస్తున్నారు. వారిని వలసవాదులుగా, చిత్రీకరిస్తున్నారు. తీవ్రవాదులుగా ముద్ర వేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో వారిపై భౌతిక దాడులు జరుగుతున్నాయి. ఇళ్ళను, దుకాణాలను, మసీదులను బుల్డోజర్లతో కూలగొడుతున్నారు. దీంతో మన దేశంలో మైనార్టీ మతస్థులు ప్రత్యేకంగా ముస్లింలు ఈ దేశ పౌరులుగా ధైర్యంగా తలెత్తుకొని నిలబడలేకపోతున్నారు. ప్రతి దినం ఏదో ఒక చోట ఇబ్బందులు పడుతున్నారు. వారి బ్రతుకులపై, భావ ప్రకటనా స్వేచ్ఛపై అభద్రతను ఎదుర్కొన్నారు.

పావులుగా మారుతున్న ముస్లింలు

పదేళ్లయ్యాక, ఇప్పుడు కూడా ఎన్నికల ప్రచారంలో ముస్లింలే బలి పశువులు అవుతున్నారు. గెలుపే లక్ష్యంగా మత విద్వేషాలను రెచ్చగొట్టేలా సాక్షాత్తు దేశ ప్రధాని మాట్లాడుతున్నారు. పౌరులను ఒకేలా చూడాలని చెప్పాల్సిన కేంద్ర హోం మంత్రి కూడా అదే బాటలో నడుస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని లేని విషయాలను వక్రీకరించి అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. దేశంలో కాంగ్రెస్‌ను ఓడించడానికి ముస్లింలను పావులుగా చేసుకొని వాడుకుంటున్నారు. మాజీ ప్రధాని మన్ మోహన్ సింగ్‌పై సోనియా, రాహుల్ గాంధీలపై వ్యక్తిగతంగా నిందలు మోపుతున్నారు. కాంగ్రెస్ ఈ సారి అధికారంలోకి వస్తే, హిందువుల ఆస్తులు లాక్కొని ముస్లింలకు పంచుతారని, హిందువుల ఇంట్లో రెండు ఉద్యోగాలు ఉంటే ఒకటి ముస్లింలకు అప్పగిస్తారని, హిందూ మహిళల బంగారం, మంగళసూత్రాలు లాక్కొని వలసవాదులకు పంచుతారని మొన్న రాజస్థాన్ ఎన్నికల సభలో ఈ దేశ ప్రధాని నోట పలకడం విస్మయాన్ని కలిగిస్తుంది. ఈ వ్యాఖ్యల్లో ముస్లింలు పరాయివాళ్ళన్న అర్థం సూచనప్రాయంగా దాగి ఉంది. ఇలా సామాన్య హిందూ జనం మెదళ్ళలో భయాన్ని, ముస్లింల పట్ల ద్వేషాన్ని పెంచేలా రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు పలకటం ఘోరమైన విషయం.

ముస్లింలపై అసాధారణ ద్వేషం

మత ప్రాతిపదికన ఉద్యోగ, విద్యా అవకాశాల్లో ఎవరికీ రిజర్వేషన్లు ఉండకూడదనేది బీజేపీ వాదన. అయితే, ముస్లింలలోని పేదలు ఈ దేశంలో పేదలు కాదా? అందుకే వారికి మిగతా పేదల వలె అవకాశాలు కల్పించాలి. గంపగుత్తగా ముస్లిం అన్నవాడికి దేశంలో ఇలాంటి రాయితీలు ఉండకూడదు అనే వాదనలు సరైనవి కావు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు వారిని వెనుకబడిన తరగతులుగా భావించి రిజర్వేషన్ కల్పించాయి. ప్రస్తుతం ఆ సదుపాయాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడులో ఉన్నాయి. దీనిపై ఆయా రాష్ట్ర ప్రజలకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్రమంత్రులకే ఇది నచ్చడం లేదు. కాంగ్రెస్ పాలనలో 2004లో ఆనాటి ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టిన 4 శాతం రిజర్వేషన్లను చూపి కాంగ్రెస్‌ను గెలిపిస్తే దేశమంతటా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తుందని బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచి ముస్లింలకు రిజర్వేషన్ కల్పించిందని మోదీ మధ్యప్రదేశ్‌లోని సభలో అన్నారు. కానీ నిజానికి కర్ణాటకలో ముస్లింలకు రిజర్వేషన్లు 1995లోనే దేవెగౌడ హయాంలోనే. ఇప్పుడు కర్ణాటకలో దేవగౌడ పార్టీ జేడీఎస్‌తో బీజేపీ ఎన్నికల పొత్తుకట్టింది. ఈ విషయాలు తెలిసి కూడా ప్రధానమంత్రి కాంగ్రెస్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కర్ణాటక వలె తెలంగాణలో కొనసాగుతున్న రిజర్వేషన్లుపై కూడా అమిత్ షా అభియోగాలు మోపుతున్నారు. ఈ మాటలను బట్టి ముస్లింలపై వారికి ఎంత అకారణ ద్వేషముందో అర్థం అవుతుంది.

మత వైషమ్యాలను రెచ్చగొడితే...

రాష్ట్రాల్లో రిజర్వేషన్ లేని గుజరాత్, మధ్యప్రదేశ్, యూపీల్లో కూడా పెద్ద మొత్తంలో ముస్లింలకు కేంద్ర జాబితాలో విద్యా, ఉద్యోగ విషయాల్లో రిజర్వేషన్ లభిస్తుంది. ఇదే ప్రాతిపదికన ముస్లింలలో కూడా పేద, వెనుకబడిన వారిని కూడా కులాల వారీగా గుర్తించి రిజర్వేషన్లు అందించవచ్చు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు వద్దనుకున్నప్పుడు వారిని కూడా వర్గీకరించి అర్హులకు ఈ సదుపాయాన్ని అందించవచ్చు. ఈడబ్ల్యూఎస్ కోటాలో ముస్లింలకు రిజర్వేషన్ లభిస్తుంది కదా! అనడం కూడా అన్యాయమే. జనాభా రీత్యా దేశంలో ఉన్నత కులాల వారి సంఖ్య, ముస్లింల సంఖ్య దాదాపు సమానమే అయినా అగ్రకుల హిందువుల్లో పేదల కన్నా ముస్లింలలో పేదలు ఎక్కువగా ఉంటారు. అందువల్ల ముస్లింలు ఈడబ్ల్యూఎస్ కోటాలో హిందూ అగ్రకుల పేదలతో పోటీ పడలేరు. వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులకు బీసీ రిజర్వేషన్లే సరిపోతాయి. ఓబీసీ జాబితాను ఆధారం చేసుకుని రాష్ట్రంలో కూడా ముస్లిం ఉపజాతుల గణన చేపట్టి రాష్ట్ర రిజర్వేషన్లలో వారికి స్థానం కల్పించాలి. దేశ జనాభాలో ముస్లింలు అంతర్గత భాగం. వారి సమస్యలను కూడా పరిష్కరించే దిశగా పాలన ఉండాలి అనే ఆలోచన పాలకులకు రావాలి. దేశాన్ని పాలించడం కన్నా మత సామరస్యం దేశ సమైక్యత ముఖ్యమైనవి. ఓట్ల కోసం మనుషుల్లో మత వైషమ్యాలను రెచ్చగొడితే గెలుపు సంగతేమో కానీ దేశం అల్లకల్లోలం అవుతుంది.

డా. కోలాహలం రామ్ కిశోర్

98493 28496

Tags:    

Similar News