ఎన్నికల అఫిడవిట్‌లో.. సీలింగ్ యాక్ట్ చట్ట ప్రభావం

In election affidavit.. Effect of Ceiling Act

Update: 2024-05-08 00:30 GMT

సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి, ఎన్నికల నియమావళి ప్రకారం ప్రమాణ పత్రం అఫిడవిట్ జతపరచాల్సి వస్తుంది. అందులో తమపైన కేసులు, తమకే కాకుండా తమ కుటుంబ సభ్యుల స్థిర చరాస్తుల వివరాలతో పాటు అప్పుల వివరాలను కూడా తెలియపరచాలి. అందులో ముఖ్యంగా తమకు తమ కుటుంబ సభ్యులకు గల వ్యవసాయ భూమి వివరాలు, సర్వే నెం, విస్తీర్ణంతో సహా పొందుపరచాలి. అయితే ఆ వివరాలపై భూగరిష్ట పరిమితి చట్టం నిబంధనలు ఏ మేరకు ప్రభావం చూపుతాయన్న విషయాన్ని పరిశీలించడమే కాకుండా, అవి సరిగా లేకుంటే చట్ట నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

చరిత్రలోకి వెళితే, కొంతమంది చేతులలోనే ఎక్కువ శాతం భూమి ఉంటున్న నేపథ్యంలో, కుటుంబానికి నిర్ణిత భూ గరిష్ట పరిమితి విధిస్తూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, నాటి ముఖ్యమంత్రి పి.వి. నరసింహారావు భూ గరిష్ట పరిమితి చట్టాన్ని (ఏపీ ల్యాండ్ రిఫార్మ్స్ సీలింగ్ ఆన్ అగ్రికల్చర్ హోల్డింగ్ యాక్ట్) 1973 ప్రవేశపెట్టారు. అందుకుగాను తన సీఎం పదవిని ఆయన త్యాగం చేయవలసి వచ్చింది. ఆ చట్టం నిబంధనల మేరకు, ప్రతి భూ యజమాని, 20 ఎకరాలపైన వ్యవసాయ భూమి కల్గి ఉన్న వారందరూ, సెక్షన్ 8 ప్రకారం డిక్లరేషన్‌ని (నిర్ణీత ఫారంలో) సంబంధిత సీలింగ్ ట్రిబ్యునల్‌కు సమర్పించాలి. అంతేగాక అందులో తన, తన కుటుంబ సభ్యుల భూ వివరాలు పొందుపరచాలి.

ప్రామాణిక గరిష్ట భూపరిమితి

కుటుంబ నిర్వచన ప్రకారం, యజమాని, భార్య, ముగ్గురు పిల్లలను ఒక కుటుంబంగా పరిగణిస్తారు. భూమి ఫెర్టిలిటీని బట్టి భూమిని విభజించి, డ్రై భూమి అయితే ఒక కుటుంబానికి 50 నుండి 54 ఎకరాల వరకు అలాగే తరి (వెట్) భూమి అయితే సుమారు 20 నుండి 25 ఎకరాల వరకు ఒక ప్రామాణిక గరిష్ట పరిమితి విధించి, అంతకన్నా ఎక్కువ భూమిని చట్ట నిబంధనల మేరకు మిగులు భూమిగా ప్రకటించి, దానిని ప్రభుత్వం స్వాధీన పర్చుకోవడమే గాకుండా, అట్టి మిగులు భూమిని గ్రామంలో ఉన్న, భూమి లేని నిరుపేదలకు (sc,st,bc నిష్పత్తి ప్రకారం) గరిష్టంగా 5 ఎకరాల వరకు భూ పంపిణీ చేయడం జరిగింది. చట్టం అమలులోకి వచ్చిన తర్వాత, వేల ఎకరాలను స్వాధీన పరుచుకొని నిరుపేదల కుటుంబాలకు పంపిణీ చేయడమైనది.

అయితే ఆ మిగులు భూమిని, కేవలం వ్యవసాయం కోసం, గ్రామ హస్త కళాకారులకు ఇళ్ల స్థలాల కోసం మాత్రమే కేటాయించాలని చట్టంలో స్పష్టంగా చెప్పారు. కానీ అలాంటి మిగులు భూమిని సెజ్‌లకు, సంస్థలకు కూడా కేటాయించవచ్చని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చట్టంలో అమెండ్‌మెంట్ తీసుకురావడమే కాకుండా, మిగులు భూమిని వాటికి కేటాయించారు కూడా. ఇలాంటి అమెండ్‌మెంట్ ఎంతవరకు చట్టబద్దం అన్న విషయం ఎవ్వరూ చాలెంజ్ చెయ్యకపోవడం గమనార్హం. సీలింగ్ భూమిని అసైన్ చేసిన నాటికి ప్రొహిబిషన్ & అలియనేషన్ & ట్రాన్స్‌ఫర్ యాక్ట్ 1977 నిబంధనలు వర్తిస్తాయి. అలాంటి భూమిని వంశపారంపర్యంగా అనుభవించాలే తప్ప, అమ్ముకోవడానికి చట్టం ఒప్పుకోదు. అలా చేస్తే ప్రభుత్వం తిరిగి స్వాధీనపరుచుకోవచ్చు.

నిర్వీర్యమైన భూపరిమితి చట్టం

ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత అంటే 1975 నుండి 1980 వరకు కచ్చితంగా అమలు చేయడం ద్వారా కొన్ని వేల ఎకరాలను స్వాధీనపరుచుకొని, నిరుపేదలకు పంపిణీ చేయడం ద్వారా వాటి జీవితాలలో వెలుగులే కాకుండా, నిరుపేద కుటుంబాలకు ఒక ఉపాధిని కల్పించడం జరిగింది. దాని తర్వాత చట్టంలో అనేక సవరణలు తీసుకురావడం, హైకోర్టు తీర్పు వంటి వాటివల్ల చట్టం నిర్వీర్యమైనది. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ చట్టం అమలులోకి ఉన్నప్పటికీ వాటికి సంబంధించిన అనేక కేసులు, ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ లోను, వివిధ కోర్టులలో ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ చట్టంపై చాలామంది రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్లకు అవగాహన లేనందువల్ల చాలావరకు కేసులన్నీ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. అంతేగాక ప్రభుత్వాలు కూడా వాటిపై తగినంతగా దృష్టిని పెట్టకపోవడం శోచనీయం.

తప్పుడు డిక్లరేషన్‌ చేస్తే శిక్ష తప్పదు

సీలింగ్ చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం ఎవరైనా సీలింగ్ డిక్లరేషన్ సమర్పించకపోవడం, లేదా భూముల విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై క్రిమినల్ కేసు ద్వారా రెండు సంవత్సరాల కారాగార శిక్ష లేదా 2000 జరిమానా లేదా రెండు విధించవచ్చు. అందుకు ముందుగా రూల్ 18 ప్రకారం జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసు జారీ చేసి ప్రాసిక్యూట్ చేసే అధికారం కలిగి ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒకటి, రెండు కేసులలో మాత్రం చర్యలు తీసుకున్నారు. అసలు అటువంటి అధికారం ఉన్నప్పటికీ దానిని ఉపయోగించుకున్న పాపాన పోలేదు.

నిబంధనలు పాటించని వారిపై విచారణ

ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్, దానిలో సీలింగ్ చట్ట పరిమితికి మించి వ్యవసాయ భూముల వివరాలను, ప్రకటించిన అభ్యర్థుల వివరాలను, సంబంధిత జిల్లా కలెక్టర్లకు అలాగే ఆర్డీవోలకు పంపి, సీలింగ్ చట్టంలోని నిబంధనలు పాటించని వారిపై ప్రాసిక్యూట్ చేసి చట్టాల రీత్యా తగు చర్యలు తీసుకోవచ్చు. తద్వారా సీలింగ్ చట్ట ఉద్దేశం నెరవేరుతుంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కొంతమంది అభ్యర్థులు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ సీలింగ్ చట్ట పరిమితికి మించి వ్యవసాయ భూములు కల్గి ఉన్నారని, దినపత్రికలలో ప్రచురించిన వార్తల వల్ల తెలియవస్తోంది. దానిపై జిల్లా కలెక్టర్లు తమకు సీలింగ్ చట్టం ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించే విధంగా ప్రభుత్వం తగు ఆదేశాలు జారీ చేయాలి.

అప్పుడే పీవీ ఆత్మకు శాంతి

నిరుపేద, భూములు లేని బలహీన వర్గాల వారికి, సీలింగ్ చట్టం ద్వారా స్వాధీన పరుచుకున్న మిగులు భూములను పంపిణీ చేయాలన్న సదుద్దేశ్యంతో స్వర్గీయ ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన సీలింగ్ చట్టం ఇప్పటికీ అమలులో ఉన్నందున వాటిపై రెవెన్యూ అధికారులకు తగు అవగాహన కల్పించి వాటిలోని నిబంధనలను తూచా తప్పకుండా పాటించే విధంగా తగు చర్యలు తీసుకోవాలి. లేకపోతే గత కాంగ్రెస్ ప్రభుత్వం 1973లో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సీలింగ్ చట్టాన్ని ప్రస్తుత ప్రభుత్వం తగు దృష్టిపెట్టి రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సీలింగ్ కేసులను డిస్పోజ్ అయ్యే విధంగా అలాగే నిర్దిష్ట పరిమితికి మించి భూములు కలిగి ఉన్నవారిపై సీలింగ్ చట్ట నిబంధనలు పాటిస్తూ మిగులు భూములను ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటే అప్పుడే తన ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసిన స్వర్గీయ పీవీ నరసింహారావు ఆత్మకు శాంతి కలుగుతుంది.

సురేష్ పొద్దార్

విశ్రాంత జాయింట్ కలెక్టర్

80080 63605

Tags:    

Similar News