ఇలా అయితే.. ఎన్నికలు సజావుగా జరిగేనా?

Will elections be held smoothly in Andhra Pradesh?

Update: 2024-05-07 01:00 GMT

స్వేచ్ఛగా, నిర్భయంగా, ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు తమ ఓటుహక్కు వినియోగించుకుంటేనే ప్రజాస్వామ్యానికి పరిపుష్టి చేకూరుతుంది. అభద్రతతో, భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఏ రోజు ఏం జరుగుతుందో అనే ఆందోళనతో ప్రజలు జీవిస్తుంటే ఓటు హక్కును ఎలా వినియోగించుకుంటారు? దేశ చరిత్రలో 2024లో జరిగే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్‌ను నిర్దేశించబోతున్న అత్యంత కీలకమైనవి. కూటమికి, వైసీపీకు జీవన్మరణ సమస్య. అలాంటి ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించలేకపోతే ప్రజాస్వామ్య అంతిమ యాత్రకు ఎన్నికల సంఘం తమవంతు సహకారం అందించినట్లు అవుతుంది.

రాష్ట్రంలో అడుగడుగునా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ వైసీపీ మూకలు, అభ్యర్థులు చెలరేగి పోతున్నారు. ఇప్పటికీ కొన్ని ఎన్నికల కమిషన్ అనుమతి లేకపోయినా ప్రచార వాహనాలు, హోర్డింగ్స్, బ్యానర్లు, ఫ్లెక్సీలు, పార్టీ రంగులు విచ్చలవిడిగా కనిపిస్తూనే ఉన్నాయి. పైగా జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ అభ్యర్థులందరూ వారి సభలు, సమావేశాల్లో ప్రజలను రెచ్చగొట్టే రీతిలో అభ్యంతరకరమైన మాటలు, చేష్టలతో ప్రసంగాలు కొనసాగిస్తున్నప్పటికీ ఎన్నికల కమిషన్ ప్రేక్షకపాత్ర వహిస్తోంది.

వైసీపీ పథకం ప్రకారమే..

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ప్రార్థనా మందిరాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించడాన్ని చాలా తీవ్రమైన నేరంగా పరిగణించాలి. చర్చిలు, మసీదులు, దేవాలయాల్లో వైసీపీ అభ్యర్థులు సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారం చేస్తూనే ఉన్న పట్టించుకోవడం లేదు. చాలా మంది జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బంది జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే పనిచేస్తున్నారు. ఇక పోలీసు అధికారుల గురించి వేరే చెప్పనక్కర్లేదు. వైకాపా కార్యకర్తల కంటే మరింత స్వామిభక్తిని ప్రదర్శిస్తున్నారు.

వైసీపీ ఎన్నికలకు ముందే ఒక పథకం ప్రకారం తన సామాజిక వర్గం, తన చెప్పు చేతల్లో ఉండే అధికారులను ఎన్నికల ప్రక్రియలో చొప్పించారు. వారు తమ పూర్తి సహాయ సహకారాలను వారికి అందిస్తున్నారు. మీడియా సర్టిఫికేషన్, పర్యవేక్షణా కమిటీ(ఎంసీఎంసీ) వారిని రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో వైకాపా అనుకూల వ్యక్తులను నియమించారు. వారు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల నిబంధనలు కచ్చితంగా అమలుచేసి చిత్తశుద్ధితో, నిష్పక్షపాతంగా వ్యవహరించే సుమారు వంద మంది పోలీసు అధికారులను చాలాకాలం వీఆర్‌లో పెట్టి వారిని ఎన్నికల విధులకు దూరం ఉంచారు. సాక్షాత్తూ దేశప్రధాని భద్రతనే ప్రమాదంలోకి నెట్టి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యల కోసం ఎన్నికల కమిషన్ మీనమేషాలు లెక్కపెట్టింది. తర్వాత ఎట్టకేలకు ఆరుగురు పోలీసు అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించింది. అయినప్పటికీ వారు నివసిస్తున్న బంగ్లాలను ఖాళీ చేయకుండా అక్కడే తిష్టవేశారు. అక్కడున్న సిబ్బందికి, అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నారు. తిరిగి వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారు. మరోవైపు ఇంటిలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ సీపీ కాంతి రాణాను మాత్రమే బదిలీ చేశారు. సీఎస్‌ను బదిలీ చేయకపోగా.. ఎక్కడో డిఫెన్స్‌లో పనిచేసిన ధర్మారెడ్డికి డిప్యూటేషన్ గడువు పొడిగించారు. పేరుకే టీటీడీ ఈవో. కానీ పాలకపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఓటర్లను ప్రాభావితం చేస్తున్నారు.

ఈసీ నిష్పక్షపాతంగా పని చేయాలి!

ఎన్నికల సంఘానికి వెన్నెముక లేకపోతే ప్రజాస్వామ్యం నిట్టనిలువునా కూలిపోతుంది. ఎన్నికల ప్రక్రియ మొక్కుబడిగా, తూతూమంత్రంగా మారకూడదు. ఎన్నికలు న్యాయబద్ధంగా జరుగుతాయనే నమ్మకం ప్రజల్లో కలిగించాలి. ఎన్నికల వేళ చోటుచేసుకోబోతున్న హింసాత్మక ఘటనలు, ఉద్రిక్తత పరిస్థితులను నిలువరించాలి. పాలకపక్షం ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్న మద్యం, నగదు, ఇతర ప్రలోభాలను నియంత్రించాలి. ప్రజాస్వామ్యానికి ఊపిరిలాంటి ఎన్నికలను నిర్వహించే స్వతంత్ర ఎన్నికల వ్యవస్థ రాజీపడకూడదన్న సుప్రీంకోర్టు స్ఫూర్తికి పట్టం కట్టాలి. నిబంధనలు ఉల్లంఘించేవారి పట్ల కఠినంగా ఉంటూ వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవాలి. జగన్ రెడ్డి విద్వేషపూరిత వ్యాఖ్యల గురించి నిర్దిష్ట సమాచారాన్ని ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అయిప్పటికీ ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం నిష్పాక్షికతను ప్రశ్నార్థకం చేస్తోంది.

జగన్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు ఉన్నతాధికారులను కాపలాదారులుగా పెడుతున్నారు. ప్రజలకు స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు లేకుండా భావప్రకటనా స్వేచ్ఛను బంధీ చేసి ఐదేళ్ల పాలన పూర్తిచేశారు. ఇప్పుడైనా ప్రజలు కళ్లుతెరిచి అన్యాయాలను, అకృత్యాలను అడ్డుకోవాలి. శవ, హత్యా రాజకీయాలకు పాల్పడ్డవారికి గుణపాఠం చెప్పేందుకు సమయం ఆసన్నమైంది. అణచివేతలు అధికమవడంతో తిరుగుబాట్లు తీవ్రమయ్యాయి. ఆ తీవ్రత ఓట్ల రూపంలో మే 13వ తేదీన కనిపిస్తుంది. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓట్లు వేస్తే జగన్ రెడ్డి ఓటమి ఖాయం అవుతుంది. కూటమి విజయం సాధిస్తుంది.

మన్నవ సుబ్బారావు

99497 77727

Tags:    

Similar News