నాలుగేళ్ళు..ఎన్నోమేళ్ళు నిజమేనా!?

How is YS Jagan's rule in Andhra Pradesh for four years?

Update: 2023-05-31 01:30 GMT

శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాన్ని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా చేసిన ప్రమాణాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. ఈ నాలుగేళ్లలో మీరు చేసిన ప్రమాణాన్ని ఒక్క రోజు అయినా పాటించారా?

అధికార గర్వంతో

నిజంగా మీరు చేసిన ప్రమాణంలో నిజాయితీ ఉంటే ఇంత ఉన్మాద పరిపాలన చేస్తారా? ఇదేనా రాజ్యాంగం పట్ల మీరు చూపిన నిజమైన విశ్వాసం, విధేయత మీ కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వర్తించడం అంటే? గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమరావతి రాజధానికి మరణ శాసనం రాయడమా? పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా పనిచేయడం అంటే ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టి వెంటాడి వేధించడమా? గత ప్రభుత్వం నిర్మించిన నిర్మాణాలు కూల్చి వెయ్యడం, నిలిపివేయడం, గత ప్రభుత్వ పథకాలు రద్దు చెయ్యడమా? ఇటువంటి ఫాసిస్టు, నిరంకుశ, స్వార్థ పూరిత పరిపాలన దేశ చరిత్రలో ప్రజలు చూసి ఎరుగుదురా? జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నిన్నటికి నాలుగేళ్లు పూర్తి అయింది. మాటలు కోటలు దాటాయి తప్ప చేతలు గడప దాటలేదన్న విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా కాలికి బలపం కట్టుకుని ఆ యాత్రా-ఈ యాత్రా అంటూ వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి, వంద అబద్ధాలు చెప్పి, ఒక్క చాన్సు ఇవ్వండి, తూర్పున ఉదయించే సూర్యుడిని పడమర ఉదయింప చేస్తాను అన్న విధంగా హామీలు ఇచ్చి 151 సీట్లతో అధికారంలోకి వచ్చారు. ఆ అధికారం గర్వంతో విధ్వంస పాలన మొదలు పెట్టారు. సకల పన్నులు వసూలు చేయడంతో పాటు ఆర్టీసీ చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వంటి చర్యలతో ప్రజల నడ్డి విరిచారు, ప్రతిపక్షాలపై, మీడియాపై అక్రమ కేసులు పెట్టడం, చీకటి జీవోలు తెచ్చి నిర్బంధించడం, అణచివేయడం వంటి క్రూరమైన చర్యలతో నాలుగేళ్లుగా రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారు.

విద్వేష పాలనతో

151 సీట్లతో ప్రజలు అధికారం అప్పగించడంతో జగన్ రెడ్డిలో అహంకారం హద్దులు దాటింది. ఆరు నెలల్లో బెస్ట్ సీఎంగా పేరు తెచ్చుకొంటానని బీరాలు పలికిన జగన్ రెడ్డి దేశంలోనే విఫల ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు. కక్ష సాధింపు చర్యలతో అభివృద్ధి పధంలో దూసుకు పోతున్నఆంధ్రప్రదేశ్‌ను తిరోగమన బాట పట్టించడం జగన్ రాజకీయ అపరిక్వతకు, అహంకారానికి, అవకాశవాదానికి నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి ఆయువుపట్టు కాగల ప్రజా రాజధాని అమరావతిని అగాధంలోకి నెట్టారు. రివర్స్ టెండర్లు పేరుతో అయిదు కోట్ల ఆంధ్రుల జల దేవాలయం 70 శాతం పూర్తయిన పోలవరం పుట్టి ముంచారు. పోలవరం రాష్ట్రానికి మహాభాగ్యం, జాతి సర్వతోముఖాభివృద్ధికి ప్రాణాధారం. అటువంటి పోలవరం పై నీలి నీడలు కమ్ముకున్నాయి. నాలుగేళ్లుగా రాష్ట్రంలో సాగునీటి రంగం పడకేసింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని జగన్ ప్రభుత్వం గాలికి వదిలేసి నీటి పారుదల రంగాన్ని పాడుబెట్టారు. పనులు ప్రారంభమైన బందరు పోర్టు కాంట్రాక్టును రద్దు చేసి పనులు నిలిపివేశారు. ఉచిత ఇసుక విధానం రద్దు చేసి 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారు. నిర్మాణ రంగాన్ని కుదేలు చేశారు. రోజుకు మూడు లక్షల మందికి ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లు రద్దు చేసి వారి పొట్టగొట్టారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని వంచనాత్మక మైనవే. గత ప్రభుత్వాలు అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలు రద్దు చేసి తన పేరు, తన తండ్రి పేరు మీద కొత్త పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

ప్రతి పథకం అరకొరే!

జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం అరకొరే తప్ప ఏ పథకం ప్రజలకు కడుపు నింపేది కాదు. అవసరం తీర్చేది కాదు. మా మాని పెస్టో భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని ప్రజలను బులిపించారు, మ్యానిఫెస్టోలో చెప్పిన దానికి అమలు చేస్తున్న దానికి ఎక్కడా పొంతన లేదు. గతంలో ఉన్న అనేక సంక్షేమ పథకాలకు కోత పెట్టారు. బడుగు బలహీన వర్గాల వారి కోసం ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఎంతగానో తోడ్పడనుంది. వారికి ఉన్నత విద్యావకాశాలు కల్పిస్తుంది. అటువంటి పథకానికి జగన్ ప్రభుత్వం మంగళం పాడింది. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అరకొర అమలు చేసి 95 శాతం హామీలను నెరవేర్చామని ప్రజలను మోసం చేస్తున్నారు. నవరత్నాలపై జగన్ చెప్పిన గొప్పలన్నీ ఆచరణలో నీటి మూటలుగా మిగిలిపోయాయి. సంక్షేమం పేరిట జగన్‌ రెడ్డి చేస్తున్న మోసం ఏమిటో ఒకసారి పరిశీలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి స్వయం ఉపాధి కింద ఆర్థిక సహాయం అందించడం కోసం రాజ్యాంగ బద్ధంగా వివిధ కార్పొరేషన్లు ఏర్పాటు అయ్యాయి. ఎన్నికల ముందు వివిధ వర్గాల ప్రజలకు బేషరతు హామీలు, పథకాలు ప్రకటించి అధికారంలోకి వచ్చాక అనేక నిబంధనలు విధించి వీలైనంత మేర లబ్ధిదారుల సంఖ్యను కుదించి ఆ మేరకు ఖర్చు తగ్గించుకొన్నారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులను ఊరించారు. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. ఒక్క జాబ్ క్యాలెండర్ విడుదల చెయ్యలేదు. సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. దశలవారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామన్నారు. అనేక హామీలకు పంగనామాలు పెట్టిన పెద్దమనుషులు,నేడు మహానాడులో భవిష్యత్ భరోసా పేరుతో కొన్ని పథకాలు ప్రకటించినందుకు ఎలా సాధ్యం అంటూ తట్టుకోలేక దిక్కుమాలిన ఆరోపణలు చేస్తున్నారు.

ప్రతి సభలోనూ పచ్చి అబద్ధాలు!

జగన్ రెడ్డి పాలనలో కాలం అనే చక్రం వెనక్కి తిరుగుతుంది. నాలుగేళ్లలో తాను ప్రజలకు, రాష్ట్రానికి చేసిన నాలుగు మంచి పనులు చెప్పే పరిస్థితి లేదు. అమరావతిని చంపేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. తన పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోకుండా తాను చెప్పిన అబద్ధాలు నమ్మి తనకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన ప్రజలంటే జగన్‌కు లోకువగా కనిపిస్తున్నట్లుంది. తన నిజ స్వరూపం తెలుసుకోకుండా ముఖ్యమంత్రిని చేసిన అమాయక ప్రజలకు ఏమైనా చెప్పవచ్చునన్న ధీమా జగన్ రెడ్డిలో పెరిగిపోయింది. అందులో భాగంగానే పేదలకు,పెత్తందారులకు మధ్య యుద్ధం అంటూ పేద ప్రజలను రెచ్చగొట్టి వెర్రివెంగళప్పలను చేద్దామనుకొంటున్నారు జగన్ రెడ్డి. అందుకే ఆయన ప్రతి బహిరంగ సభలో పచ్చి అబద్ధాల వరద పారిస్తున్నారు. కానీ జనం ఎల్లకాలం వెర్రి వెంగళప్పలు కారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పిన మాటలను ప్రజలు మర్చిపోయి ఉంటారని, మరోసారి ముఖ్యమంత్రిగా ప్రజలను దగా చేసే ప్రయత్నాలు మొదలెట్టారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి నోటికొచ్చిన అబద్ధాలు చెబుతూ, పిచ్చి విమర్శలు చేస్తున్నారు. ఉత్తుత్తి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మొదలు పెట్టారు. సొంత సోషల్‌ మీడియా ద్వారా అభూత కల్పనలు ప్రచారం చేస్తున్నారు. తన అబద్దాలను ప్రజలు మౌనంగా వింటున్నందున వాటిని జనం నిజంగానే నమ్ముతున్నారన్న భ్రమలో ఉన్నారు జగన్ రెడ్డి. తాను చెబుతున్నవి అబద్ధాలు అని తెలిసినా ప్రజలు ప్రశ్నించరన్న ధైర్యంతో కొన్ని అబద్ధాలు అయినా తనని కాపాడక పోతాయా అని మరోసారి అధికారం పీఠం ఎక్కడానికి అబద్దాల మెట్లనే ఎంచుకొన్నారు. ప్రజాధనాన్ని పథకాల పేరిట పంచిపెట్టడం తన ఘనత అంటున్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి పంచుతున్న డబ్బును తన సొంత సొమ్ము పంచుతున్నట్టుగా బిల్డప్‌ ఇస్తున్నారు జగన్ రెడ్డి. ఈ నాలుగేళ్లలో రాష్ట్రానికి మేలు చేసే ఒక్క పనంటే ఒక్క పని చేశామని చెప్పగలిగే స్థితిలో జగన్ లేరు.

నవ్యాంధ్ర పునాదులు కూల్చేశారు

చరిత్ర ఎప్పుడూ దార్శనికులనే గుర్తు పెట్టుకుంటుంది. కానీ వినాశకులను, విధ్వంసకులను కాదు. నిస్సందేహంగా నవ్యాంధ్రను నాశనం చేసిన స్వయం వినాశకుడు జగన్మోహన్ రెడ్డే అని చెప్పాలి. గత ప్రభుత్వంపై ఇష్టానుసారం విమర్శలు చేసి, నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి గత ప్రభుత్వం నవ్యాంధ్ర అభివృద్ధికి వేసిన పునాదులను కూల్చి వేశారు. పూర్వకాలం రాక్షసులు ఘోర తపస్సు చేసి ఎవరు పొందలేని అపూర్వ వరాలు పొంది ప్రజలను, దేవతలను హింసిస్తే ఆయనను అణచివేయడానికి మహా విష్ణువే నరసింహ అవతారం ఎత్తవలసి వచ్చింది. ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి కూడా కాలికి బలపం కట్టుకొని ఆ యాత్రా-ఈ యాత్రా అంటూ వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి, వంద అబద్ధాలు చెప్పి,ఒక్క చాన్సు ఇవ్వండి అంటూ 151 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చిన అధికారం గర్వంతో విధ్వంస పాలన మొదలు పెట్టారు. కావున గర్వాంధులైన రావణ,శిశుపాలాదులకు ఏం జరిగిందో ధన, అధికార గర్వంతో, లెక్కలేని తనంతో తాను చేసిందే నీతి, చేసేదే న్యాయం అంటూ ఎదురు దాడి చేస్తున్న జగన్ రెడ్డికి ప్రజల చేతిలో గుణపాఠం తప్పదు.

నీరుకొండ ప్రసాద్

98496 25610

Tags:    

Similar News