రాజకీయాలను ఏలిన ఏలేటి.. మళ్లీ చక్రం తిప్పుతారా.?

by  |
రాజకీయాలను ఏలిన ఏలేటి.. మళ్లీ చక్రం తిప్పుతారా.?
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి.. ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. డీసీసీ అధ్యక్షుడిగా అన్ని నియోజకవర్గాల్లో పట్టు సాధించిన డైనమిక్ లీడర్. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఆయన పెద్దదిక్కుగా ఉన్నారు. గత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గంగా ముద్రపడిన ఏలేటి.. బస్సు యాత్రకు ఇన్‌చార్జీ బాధ్యతలు నిర్వహించారు. అయినప్పటికీ, కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఆయన తాజాగా ఏఐసీసీలో కీలక పదవి రావడం, రేవంత్ రెడ్డి పీసీసీ కావడంతో మళ్లీ యాక్టివ్ పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది.

ఏలేటి మహేశ్వర్ రెడ్డి గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాలను శాసించారు. పేద ప్రజలకు సేవ చేసేందుకు ట్రస్టు ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన ఆయన.. తొలుత ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009లో నిర్మల్ ఎమ్మెల్యేగా పీఆర్పీ పార్టీని గెలిపించుకున్నారు. ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో.. అదే పార్టీలో కొనసాగారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి.

గతంలో డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన ఉమ్మడి ఆదిలాబాద్‌లో రాజకీయంగా పట్టు సాధించారు. మరోవైపు మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌తో మంచి సంబంధాలు ఉండటంతో.. జిల్లా కాంగ్రెస్‌లో ఆయన తిరుగులేని శక్తిగా ఎదిగారు. కానీ, 2014, 2018లో వరుసగా నిర్మల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీనికితోడు టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఉమ్మడి జిల్లాలో ఆయన పట్టు క్రమంగా సడలింది. ఇటువంటి పరిణామాలతో కేవలం నిర్మల్ నియోజకవర్గానికి పరిమితమవుతుండడంతో.. మిగతా నియోజకవర్గాల్లో పట్టుకోల్పోయారు.

ప్రస్తుతం ఏఐసీసీ‌లో ఏలేటికి కీలక పదవి దక్కడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో యాక్టివ్ పాత్ర పోషిస్తారని చర్చ సాగుతోంది. టీపీసీసీ కొత్త అధ్యక్షుడు కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఆయనకు మళ్లీ పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చినట్లయింది. ఇప్పటికే ఆయన అనుచరులంతా సంబరాల్లో మునిగితేలుతున్నారు. తాజాగా రేవంత్ ప్రమాణస్వీకారానికి పెద్దఎత్తున తరలివెళ్లారు. త్వరలోనే నిర్మల్ జిల్లాకు కొత్త టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రానున్నారు ఇందుకోసం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తమ సత్తా చాటాలని ఏలేటి మహేశ్వరరెడ్డి భావిస్తున్నారు.



Next Story

Most Viewed