సింగరేణిపై ప్రభుత్వ వైఖరి వెల్లడించాలి

by  |
సింగరేణిపై ప్రభుత్వ వైఖరి వెల్లడించాలి
X

దిశ, న్యూస్‌బ్యూరో: సింగరేణి ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వం తన వైఖరిని చెప్పాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. విద్యుత్ బిల్లుపై స్పందించిన కేసీఆర్ సింగరేణిపై ఎందుకు నోరువిప్పడం లేదని ప్రశ్నించారు. సింగరేణి పరిధిలో ఉన్న 11బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మంగవారం హైదరాబాద్‌ మగ్ధుంభవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అధ్యక్షతన రౌండ్ టేబుల్ భేటీ నిర్వహించారు. సమావేశానికి భట్ట విక్రమార్క, కోదండరాం, ఎల్.రమణ, డీజీ నర్సింగరావు హాజరై పలు అంశాలపై చర్చించారు. లాభాల బాటలో ఉన్న సంస్థలను మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గ చర్యగా అఖిలపక్షం అభివర్ణించింది. ఈ నెల 10, 11వ తేదీల్లో కేంద్ర కార్మిక సంఘాలు చేపడుతున్న నిరసన కార్యాక్రమాలకు అఖిలపక్షం మద్ధుతు ప్రకటించింది. 11న హైదరాబాద్ సింగరేణి భవన్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టాలని, సింగరేణి సంస్థను రక్షించుకోవడానికి గవర్నర్, సీఎం, సీఎస్‌ను కలిసి వినతి పత్రాలు అందజేయాలని నేతలు నిర్ణయించారు.

ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కరోనాతో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కేంద్ర దుర్మార్గ విధానాలను అవలంభిస్తోందని విమర్శించారు. తెలంగాణలో సింగరేణి అత్యంత ప్రతిష్ఠాత్మకమైందని, బొగ్గును నల్లబంగారంగా భావిస్తామన్నారు. సింగరేణి సంస్థ 2019లో కేంద్ర ప్రభుత్వానికి రూ.3,650కోట్లు, రాష్ట్రానికి రూ.3,400కోట్లు, 6 జిల్లాల కలెక్టర్లకు వినరల్ ఫండ్ కింద రూ.2వేల కోట్లు, నియోజకవర్గ ఎమ్మెల్యేలకు రూ.2 కోట్లు చొప్పున చెల్లించిందని చాడ వెల్లడించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తే దేశ ఆర్థిక పరిస్థితి ప్రైవేటు చేతిలోకి వెళ్తుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. అదే జరిగితే ప్రజాస్వామ్యాన్ని ప్రైవేటు శక్తులు శాసించే పరిస్థితి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వద్ద ఉన్న పెద్దలకు బొగ్గుగనులను పంచేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తున్న సమయంలో ప్రభుత్వం తీసుకోవాల్సినవి ఇలాంటి నిర్ణయాలు కావని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సింగరేణి ఉత్తర తెలంగాణ గుండెకాయ లాంటిదని, ఇలాంటి సంస్థ ప్రైవేటు సంస్థల చేతుల్లోకి పోతే సామాజిక మార్పు, అభివృద్ధి కార్యక్రమాలు సాధ్యం కావని కోదండరాం అన్నారు. సకల జనుల సమ్మె విజయవంతంలో సింగరేణి కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. విశాలమైన ఉపాధి సింగరేణితోనే సాధ్యమన్నారు. సింగరేణి సంస్థ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల నిర్ణయమన్నారు.



Next Story

Most Viewed