సొంతగూటికి భూమా అఖిలప్రియ?.. వైసీపీలో కలిసొస్తుందా?

by  |
సొంతగూటికి భూమా అఖిలప్రియ?.. వైసీపీలో కలిసొస్తుందా?
X

దిశ, ఏపీ బ్యూరో: కర్నూలు జిల్లా రాజకీయాల్లో భూమా కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి దంపతులు జిల్లా రాజకీయాల తోపాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ ఓ వెలుగు వెలుగొందారు. వారి వారసురాలుగా రాజకీయ అరంగేట్రం చేసిన భూమా అఖిలప్రియ సైతం తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో మంత్రిగా కొనసాగారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఆమె ఘోరంగా పరాజయం పాలయ్యారు. ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ టీడీపీ వాయిస్ బలంగా వినిపిస్తూనే వచ్చారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఒంటరి పోరాటం చేస్తున్నారు. గత కొంతకాలంగా ఆమె సైలెంట్‌ అయిపోయారు. అసలు రాజకీయాల జోలికి పోవడం లేదు. అనేక కేసులు ఎదుర్కొంటున్న తరుణంలో ఆమె బయటకు రావడం లేదని ప్రచారం జరుగుతుంది. భూమా అఖిలప్రియకు కేసులు పెద్ద తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో బంధువులు వైసీపీలో చేరాలంటూ అఖిల ప్రియపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే భూమా అఖిలప్రియకు సంబంధించిన బంధువులు అంతా వైసీపీలోనే ఉన్నారు. ఆమె సొంత మేనమామ ఎస్వీ మోహన్‌రెడ్డి సైతం వైసీపీలో ఉన్నారు. వరుసకు మామ అయిన బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సైతం వైసీపీలోనే ఉన్నారు. దీంతో ఆమెను కూడా వైసీపీలో చేరాలని సలహా ఇస్తున్నట్లుగా సమాచారం. ఇకపోతే ఆమె సొంత మేన‌మామ ఎస్వీ. మోహ‌న్‌రెడ్డి వైసీపీలో కీల‌కంగా ఉండ‌డంతో పాటు క‌ర్నూలు రాజ‌కీయాల‌ను శాసిస్తున్నారు. ఇక ఆళ్ల‌గ‌డ్డ‌, నంద్యాల నియోజ‌క‌వ‌ర్గాలతో పాటు క‌ర్నూలు జిల్లాలో అఖిల బంధువులందరూ వైసీపీలోనే ఉన్నారు. అంతేకాదు వైఎస్ ఫ్యామిలీతో వీరికి బంధుత్వం కూడా ఉంది. అఖిలప్రియ మెుదటి భ‌ర్త జ‌గ‌న్ మేన‌మామ‌, క‌మ‌లాపురం ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి కుమారుడు అన్న విషయం తెలిసిందే.

బంధువర్గం అంతా వైసీపీలోనే ఉన్నా భూమా అఖిలప్రియ మాత్రం టీడీపీలో ఒంటరిగా ఉండటాన్ని బంధువులు తప్పుబడుతున్నారట. ఇప్పటికే కేసులతో సతమతమవుతున్న అఖిలప్రియ అధికార పార్టీలో చేరితే మంచిదని హితబోధ చేస్తున్నారట. ఇప్పటికే ఆమె భ‌ర్త భార్గ‌వ్ అనేక కేసులు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు భూమా అఖిలప్రియ భూ వ్యవహారంలో జైలుకు సైతం వెళ్లొచ్చారు. ఆ సమయంలో టీడీపీ నేతలు అండగా ఉండలేదని బంధువులు పదేపదే గుర్తు చేస్తున్నారట. ఇకపోతే రాజకీయపరంగా నంద్యాల డెయిరీ కూడా భూమా ఫ్యామిలీ నుంచి చేజారిపోయింది. అంతేకాదు ఏవీ సుబ్బారెడ్డితో పొసగడం లేదు. అలాగే ఫ్యామిలీలో ఆస్తుల విషయంలో గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అఖిల‌ను వైసీపీలోకి తీసుకెళ్లేందుకు ఆమె మేన‌మామ మోహ‌న్‌రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరి రాజకీయంగా తనకు మంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబు పట్ల ఉన్న విధేయత వల్ల ఇంతకాలం అఖిలప్రియ టీడీపీలోనే ఉండాల్సి వచ్చింది. అఖిలప్రియ రాజకీయ ప్రయాణం వైసీపీతోనే మొదలైంది. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె.. ఆ తర్వాత టీడీపీలోకి జంప్ అయ్యారు. ప్రస్తుతం కష్టాల్లో ఉన్న అఖిలప్రియ టీడీపీ అధినేత చంద్రబాబునే నమ్ముకుంటుందా? లేక మేనమామ ఎస్వీ మోహన్‌రెడ్డి సలహా మేరకు వైసీపీ తీర్థం పుచ్చుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది.

Next Story