వ్యవసాయానికి బంగారంలాంటి బయోచార్ కంపోస్టు.. తయారీ విధానం, ఉపయోగాలివే

by Yella Dhawani Reddy |

ఇటీవల కాలంలో రైతులు రసాయన ఎరువులు వాడకం తగ్గించి, సేంద్రియ ఎరువుల వైపు దృష్టి సారిస్తున్నారు.

వ్యవసాయానికి బంగారంలాంటి బయోచార్ కంపోస్టు.. తయారీ విధానం, ఉపయోగాలివే
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో రైతులు రసాయన ఎరువులు వాడకం తగ్గించి, సేంద్రియ ఎరువుల వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయాన్ని లభాసాటిగా మార్చుకునేందుకు 'బయోచార్ కంపోస్టు' ఎంతగానో ఉపయోగపడుతుంది. పంట వ్యర్థాలతో రైతులే స్వయంగా తయారు చేసుకుని దీనిని పొలాల్లో వేసుకోవచ్చు. అసలు ఏంటి బయోచార్ కంపోస్టు ఇక్కడ తెలుసుకుందాం.

బయోచార్ తయారీ విధానం

వ్యవసాయంలో భూసారానికి ముఖ్యమైనది సేంద్రియ కర్భనం. ఇది మట్టిలో స్థిరంగా ఉండదు. దీన్ని పెంపొందించుకోవటానికే బయోచార్‌ను ఉపయోగిస్తారు. బయో అంటే జీవం.. చార్‌ అంటే బొగ్గు. బయోచార్‌ అంటే 'జీవం ఉన్న బొగ్గు' అని అర్థం. ఇక పత్తి కట్టె, కంది కట్టె, వరి పొట్టు వంటి పంట వ్యర్థాల నుంచి 'పైరోలిసిస్' విధానంలో దీనిని తయారు చేసుకోవచ్చు. అంటే.. పరిమితంగా గాలి సోకేలా లేదా పూర్తిగా గాలి సోకకుండా ప్రత్యేక పద్ధతిలో పెద్దగా పొగ రాకుండా, 450 నుంచి 750 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతతో కాల్చితే నల్లని కట్టె బొగ్గు తయారవుతుంది. దీనినే బయోచార్‌ అంటారు. సాధారణంగా తగులబెడితే బూడిద అవుతుంది. అందుకే ఈ పద్ధతిలో తగులబెడుతారు. రైతులు ఇనుప డ్రమ్ములో లేదా కందకం తవ్వి దీన్ని తయారు చేసుకోవచ్చు.

బయోచార్‌ కంపోస్టు తయారీ విధానం

బయోచార్‌ను నేరుగా పొలాల్లో వేయకూడదు. బయోచార్‌ కంపోస్టు తయారు చేసుకొని వేయాలి. కారణం బొగ్గులోని సూక్ష్మరంధ్రాలు పంటకు పోషకాలను పూర్తిగా అందనివ్వవు. ఇక మాగిన పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టు, బయోగ్యాస్‌ స్లర్రీ, జీవామృతం, పంచగవ్య వంటి.. ఏదైనా సేంద్రియ ఘన/ద్రవరూప ఎరువులలో ఏదో ఒకదాన్ని బయోచార్‌ను సమపాళ్లలో కలిపి కుప్ప వేసి, బెల్లం నీటిని చిలకరిస్తూ రోజూ కలియదిప్పుతూ ఉంటే 15 రోజుల్లో 'బయోచార్‌ కంపోస్టు' సిద్ధం అవుతుంది. అప్పుడు దీన్ని పొలాల్లో వేసుకుంటే సత్ఫలితాలు వస్తాయి. ఇక పొలంలోని మట్టి గుణాన్ని బట్టి తగిన మోతాదులో వేసుకోవటం ముఖ్యం.

ఏ పొలానికి ఎంత వెయ్యాలంటే?

బయోచార్ కంపోర్టు ఏ భూమిలో ఖచ్చితంగా ఎంత మొత్తంలో వేస్తే సరిపోతుందనేది ఒక టెస్టు ద్వారా తెలుసుకోవచ్చు. పొలంలో ఎత్తయిన ప్రదేశంలో 5 చిన్న మడులు చేసుకొని, వాటిల్లో బయోచార్‌ కంపోస్టును వేర్వేరు మోతాదుల్లో వేసి.. ఆ 5 మడుల్లోనూ ఒకే రకం పంటను సాగు చేయండి. 3 నెలల్లో ఫలితం తెలిసిపోతుంది. 1వ మడిలో బయోచార్‌ కంపోస్టు అసలు వెయ్యొద్దు. 2వ మడిలో బయోచార్‌ కంపోస్టు 0.5 కిలో, 3వ మడిలో 1 కిలో, 4వ మడిలో 2 కిలోలు, 5వ మడిలో 4 కిలోలు వెయ్యండి. ఈ 5 మడుల్లో 3 నెలల్లో చేతికొచ్చే ఒకే రకం పంట విత్తుకోండి లేదా కూరగాయ మొక్కలు నాటుకోండి. ఇక మిగతా పనులన్నీ ఈ మడుల్లో ఒకేలా చేయండి. అంటే నీరు పెట్టటం, కలుపు తీయటం, పురుగుమందులు లేదా కషాయాలు పిచికారీ చేయటం అన్నీ ఒకేలా చెయ్యండి. ఆ పంటల్లో పెరిగే దశలో వచ్చే మార్పులన్ని్ంటినీ గమనిస్తే బయోచార్‌ కంపోస్టు ఏ మోతాదులో వేసిన మడిలో అధిక దిగుబడి వచ్చిందో ఫలితం తెలిసిపోతుంది.

Next Story