పెరిగిన అదానీ గ్రీన్ ఎనర్జీ ఆదాయం

by  |
పెరిగిన అదానీ గ్రీన్ ఎనర్జీ ఆదాయం
X

దిశ, వెబ్‌డెస్క్: అదానీ గ్రూప్‌ (Adani Group)లో భాగమైన అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy) 2020-21 ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 21.75 కోట్ల నికర లాభాల (Net profit)ను నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీకి రూ. 97.44 కోట్ల నికర నష్టాలు (Net losses) నమోదైనట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం 30 శాతం పెరిగి రూ. 878.14 కోట్లకు చేరుకుంది.

గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం (Company total revenue) రూ. 675.23 కోట్లని కంపెనీ పేర్కొంది. ఈ త్రైమాసికంలో విద్యుత్ నికర ఎగుమతి 24 శాతం పెరిగి 1,382 మిలియన్ యూనిట్లకు చేరిందని కంపెనీ తెలిపింది. విద్యుత్ సరఫరా ద్వారా రాబడి 10 శాతం, ఏటా(వడ్డీ, తరుగుదల, పన్నుకు ముందు లాభాలు) 12 శాతం పెరిగాయి. క్లీనర్ అండ్ గ్రీనర్ టెక్నాలజీకి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో గ్రీన్ ఎనర్జీ వినియోగం వేగవంతమైంది. ఈ మార్పును అనుసరించడానికి సిద్ధంగా ఉన్నామని అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఛైర్మన్ గౌతం అదానీ వెల్లడించారు.

సంస్థ లక్ష్యాలు దేశ అవసరాలకు అనుగుణంగా ఉంటాయన్నారు. సంస్థ తీసుకున్న ఖచ్చితమైన చర్యలతో ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ డెవలపర్‌గా స్థానం సంపాదించినట్టు గౌతం అదానీ పేర్కొన్నారు. అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy) ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తిదారుగా (solar power producer) అవతరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కంపెనీ తెలిపింది. 2025 నాటికి సంస్థ 25 గిగావాట్ల (gigawatts) పునరుత్పాదక సామర్థ్యాన్ని కలిగి ఉండాలని భావిస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు శుక్రవారం సుమారు 5 శాతం పెరిగి రూ. 608.45 వద్ద ట్రేడయింది.

Next Story